Gold: ప్రకృతి విపత్తులకు, బంగారానికి మధ్య సంబంధం ఏంటి?

by Sujitha Rachapalli |
Gold: ప్రకృతి విపత్తులకు, బంగారానికి మధ్య సంబంధం ఏంటి?
X

దిశ, ఫీచర్స్ : గోల్డ్.. బిజినెస్ నుంచి ఫ్యాషన్ వరకు అన్ని చోట్ల కీలకమే. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు.. ప్రతి ఒక్కరినీ ఎంతో కొంత ప్రభావితం చేసే ఈ బంగారం(Gold).. అసలు భూమిపై ఎలా ఉద్భవించింది? అనేది చాలా మందిలో ఉండే ప్రశ్నే. కాగా దీనిపై తాజా అధ్యయనం ఓ క్లారిటీ ఇచ్చింది. గత అధ్యయనాలను ఛాలెంజ్ చేస్తూ స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం.

భూమి క్రస్ట్ లో పగుళ్ల ద్వారా ప్రవహించే వేడి, ఖనిజాలు అధికంగా ఉండే ద్రవాల నుంచి ఏర్పడతాయని భావించారు. ఈ ద్రవాలు చల్లబడినప్పుడు.. బంగారం అవక్షేపించబడి చుట్టుపక్కల ఉన్న క్వార్ట్జ్‌లో చిక్కుకుపోతుందని నమ్ముతారు. అయినప్పటికీ, ఈ సిద్ధాంతం పెద్ద మొత్తంలో బంగారం ఏర్పడటాన్ని వివరించడంలో ఫెయిల్ అయింది. ప్రత్యేకించి ఈ ద్రవాలలో సాధారణంగా బంగారం తక్కువగా ఉండటం కారణంగా ఈ థియరీ ఫెయిల్ అయింది.

డాక్టర్ క్రిస్ వోయిసీ నేతృత్వంలోని కొత్త అధ్యయనం.. భూకంపాలు(Earth Quakes) క్వార్ట్జ్ లోపల పైజోఎలెక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం ద్వారా బంగారు నగ్గెట్స్( Gold Nuggets) ఏర్పడటాన్ని ప్రేరేపించగలవని చెప్తుంది. ఈ ప్రక్రియలో యాంత్రిక ఒత్తిడి కొన్ని పదార్థాలలో విద్యుత్ చార్జ్‌ను కలిగిస్తుందని చెప్పింది. ఒత్తిడికి గురైన క్వార్ట్జ్ దాని ఉపరితలంపై ఎలెక్ట్రోకెమికల్‌గా బంగారాన్ని నిక్షిప్తం చేయడమే కాకుండా... అది బంగారు నానోపార్టికల్స్‌ను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియ కొత్త వాటిని ఏర్పరచడం కంటే ఇప్పటికే ఉన్న వాటిపై బంగారం పేరుకుపోవడానికి దారితీస్తుంది. కాలక్రమేణా మరింత బంగారంతో ప్లేటింగ్ చేస్తుంది.

ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అయిన క్వార్ట్జ్.. కండక్టర్ అయిన బంగారం.. ఈ ప్రాసెస్ కు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. క్వార్ట్జ్ భూకంపం సమయంలో ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు.. విద్యుత్ చార్జ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బంగారు కణాలను ఆకర్షిస్తూ.. ఇప్పటికే ఉన్న స్టోరేజ్ పై మరింత యాడ్ చేస్తుంది. కాలక్రమేణా.. పెద్ద బంగారు నగ్గెట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. కాగా ఈ పరిశోధనలు బంగారం ఏర్పడటం వెనుక ఉన్న భౌగోళిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. భౌగోళిక రహస్యాలపై అంతర్దృష్టిని అందించడమే కాకుండా భవిష్యత్తులో బంగారం అన్వేషణ, మైనింగ్‌కు సంబంధించిన అంశాల్లో కీలకంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed