Kidney health : ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్లే !

by Javid Pasha |   ( Updated:2024-11-03 10:42:36.0  )
Kidney health : ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్లే !
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పలు ఇతర కారణాలతో ఇటీవల పలువురిలో కడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ వంటివి వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. అయితే సమస్య ప్రారంభమైనట్లు ముందుగానే గుర్తిస్తే, దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన లక్షణాలేవి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీవ్రమైన అలసట

సాధారణంగా ఉదయం లేవగానే ఎవరికైనా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. చాలా మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉన్నవారు మాత్రం తీవ్రమైన అలసటకు గురౌతారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, టాక్సిన్లు శరీరంలో పేరుకుపోవడం కారణంగా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఉదయంపూట అలసట, శారీరక బలహీతన తరచుగా వేధిస్తుంటే కిడ్నీల్లో ఏదో సమస్య ఉందని అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలి.

యూరిన్‌ రంగు మారడం

కిడ్నీ ప్రాబ్లమ్స్‌ను సులభంగా గుర్తించదగ్గ మరో లక్షణం యూరిన్ రంగు మారడం. ఉదయంపూట మూత్ర విసర్జన చేసే క్రమంలో అది చాలా లేతగా అనిపించడం, నురుగు ఎక్కువగా రావడం, క్రమంగా రంగు మారడం వంటివి గుర్తిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి.

కడుపులో ఉబ్బరం

మార్నింగ్ లేవగానే కడుపులో ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కొన్ని రోజులుగా కనిపిస్తుంటే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉండవచ్చు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇది గమనిస్తే గనుక వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

విపరీతమైన దాహం

దాహం వేయడం సహజం. కానీ విపరీతమైన దాహం వేరు. నీళ్లు తాగిన కొద్ది నిమిషాలకే మళ్లీ తాగాలని పిస్తుంది. తాగకపోతే శరీరంపై చెమటలు పడుతుంటాయి. ఈ లక్షణం కూడా తరచుగా కొనసాగుతుంటే కిడ్నీల అనారోగ్యానికి సంకేతంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. మూత్ర పిండాల పనితీరులో సమతుల్యత లోపించినప్పుడు ఇలా జరుగుతుంది.

స్కిన్ అలెర్జీలు

కిడ్నీల పనితీరు సరిగ్గా లేనప్పుడు కనిపించే మరో సాధారణ లక్షణం చర్మంపై దురద లేదా పలు రకాల స్కిన్ అలెర్జీలు. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం, వాటిని క్లీన్ చేయడంలో కిడ్నీలు విఫలం కావడం కారణంగా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తరచుగా మీరు చర్మంపై దురద వంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మూత్ర పిండాల్లో సమస్యగా అనుమానించవచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. అసలు కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటివి అవైడ్ చేయాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More..

Ghingaru Fruit: ఈ పండు ఒక్కటి తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్ .. మెడిసిన్స్ కూడా అవసరం లేదు!

Advertisement

Next Story

Most Viewed