స్కిన్‌కేర్ యాడ్‌కు ఫ్రీమాన్ ఫొటో.. క్షమాపణ కోరిన ఆస్పత్రి యాజమాన్యం

by Disha News Desk |
స్కిన్‌కేర్ యాడ్‌కు ఫ్రీమాన్ ఫొటో.. క్షమాపణ కోరిన ఆస్పత్రి యాజమాన్యం
X

దిశ, ఫీచర్స్ : 'మీకు మొటిమలు, మిలియా, మొలస్కం, కామెడోన్స్ వంటి చర్మ సమస్యలున్నాయా? కేవలం ఒకే విజిట్‌లో వాటిని పూర్తిగా తొలగించుకోండి' అంటూ కేరళ, కోజికోడ్‌లోని ఓ ఆస్పత్రి తాజాగా ఒక ప్రకటన రూపొందించింది. అయితే ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు ఆస్కార్ అవార్డు పొందిన నటుడు 'మోర్గాన్ ఫ్రీమాన్' ఫొటోను ఉపయోగించుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన అభిమానులు దీన్ని 'జాత్యహంకార చర్య'గా భావిస్తుండగా.. అజ్ఞానంతో ఈ పని చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వివాదం తారాస్థాయికి చేరడంతో ఎట్టకేలకు ఆస్పత్రి యాజమాన్యం క్షమాపణలు కోరింది. దీంతో శాంతించిన నెటిజన్లు.. 'తప్పులు జరగవచ్చు, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి' అని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు.

మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరాం..

ఆస్పత్రిలో మెరుగైన స్కిన్‌కేర్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాలున్నాయని ప్రచారం చేసేందుకు నాలుగు రోజుల పాటు బోర్డును అమర్చాం. స్థానిక డిజైనర్ దీన్ని రూపొందించాడు. అవగాహన లోపం, సీరియస్‌నెస్ లేకపోవడం వల్ల అతడు ఫ్రీమాన్ ఫొటోను వినియోగించాడు. చాలామంది అలా ఎందుకు వాడారని అడగడంతో వెంటనే బోర్డు తొలగించాం. అయితే మా ప్రకటన అప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రీమాన్ గొప్ప కళాకారుడని, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అశేష అభిమానులున్నారని ఇప్పుడు తెలుసుకున్నాం. ముందుగా ఆయన గురించి తెలియకపోయినందుకు మనస్ఫూర్తిగా మన్నించాలని ఫేస్‌బుక్‌లో క్షమాపణలు కోరాం' అని వడకర కోఆపరేటివ్ హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ సునీల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed