‘చేప ప్రసాదం’తో అంటు వ్యాధులు.. ఉబ్బసం మరింత పెరిగే చాన్స్!

by Javid Pasha |
‘చేప ప్రసాదం’తో అంటు వ్యాధులు.. ఉబ్బసం మరింత పెరిగే చాన్స్!
X

దిశ, ఫీచర్స్ : మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చాలామంది పచ్చి కొర్రమీను చేపలో ఇంగువా బెల్లం పెట్టుకొని మింగేస్తుంటారు. దీనివల్ల శరీరంలో వేడి, ఉబ్బసం(ఆస్తమా) తగ్గుతాయని భావిస్తుంటారు. అలాగే హైదరాబాద్‌లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం దశాబ్దాల కాలంగా కొనసాగుతోంది. ఈనెల 8, 9 తేదీల్లోనూ ఇది కంటిన్యూ అవుతుంది. అయితే చేప ప్రసాదం నిజంగానే ఉబ్బసం వ్యాధిని తగ్గిస్తుందా? అన్న సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

నమ్మకం - వాస్తవం

వాస్తవానికి చేప ప్రసాదం ఉబ్బసాన్ని తగ్గించదు. ఇలా నిరూపించదగ్గ సైంటిఫిక్‌గా రుజువులు ఏమీ లేవు. గతంలో లోకాయుక్త కూడా చేపమందు రోగాలు తగ్గిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, దానిని మందు అనకూడదని, ప్రసాదంగా పేర్కొనాలని తీర్పును వెల్లడించింది. హైకోర్టు కూడా దీనిని సమర్థించింది. పైగా చేప ప్రసాదంవల్ల ఆస్తమా తగ్గుతుందనేది కేవలం ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకం మాత్రమే. పైగా చేప ప్రసాదం వల్ల ఆస్తమా తగ్గడం ఏమోకానీ మరింత పెరిగే అవకాశం ఎక్కువ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చేప ప్రసాదం ఎలా ఇస్తారు?

కొర్రమీను లేదా మరో రకం చేపల్లో ఇంగువ లేదా బత్తిని సోదరులు అయితే వారు తయారు చేసిన పదార్థాన్ని పెట్టి, తమ వద్దకు వచ్చే ప్రజలకు, ఆస్తమా బాధితులకు మృగశిర కార్తె ప్రారంభం తర్వాత నోటి ద్వారా మింగటానికి ఇస్తుంటారు. లక్షలాది మంది ఈ ప్రసాదం కోసం వస్తుంటారు. పైగా ఈ చేప ప్రసాదాన్ని ఇచ్చే విధానం అభ్యంతరకరంగా, అపరిశుభ్రంగా ఉంటుంది. ఒకరి నోటిలో చేపప్రసాదాన్ని చేతులతో కుక్కేస్తుంటారు. అదే చేత్తో మరో వ్యక్తికి, ఇలా ఎంతోమందికి చేప ప్రసాదాన్ని ఇస్తుంటారు.

ఇన్ఫెక్షన్లకు కారణం అదే

చేప ప్రసాదం ఇచ్చే విధానమే అపరిశుభ్రతకు మారు పేరు. ఎందుకంటే ఒకరి నోటిలో పెట్టిన చేయి, మరొకరికి ప్రసాదం ఇచ్చేటప్పుడే కూడా పెడతారు. దీనివల్ల ఒకరి నోటి నుంచి మరొకరి నోటిలోకి హానికారక సూక్ష్మ క్రిములు చేరుతాయి. తర్వాత ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అప్పటికే ఉన్న ఆస్తమా ఉంటే మరింత పెరిగే చాన్స్ ఉంటుంది.

వ్యాధులు వ్యాపిస్తాయి

సహజంగా మనం ఇండ్లల్లో ఒకరు వాడిన టూత్ బ్రష్‌ను పరిశుభ్రంగా ఉన్నప్పటికీ మరొకరం వాడం. అలాంటిది ఒకరి నోట్లో చేయి పెట్టి, అదే చేతిని వేరొకరి నోట్లో పెట్టడం ఎంతటి అపరిశుభ్రతో, ఎలాంటి హాని చేస్తుందో ఊహించుకుంటేనే అర్థమైపోతుంది. అలాంటప్పుడు జలుబు, దగ్గు‌తో పాటు హెపటైటిస్- బి, టీబీ మొదలగు ప్రాణాంతకమైన దీర్ఘకాలిక అంటు వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా ఎలా ఉంటాయి? అదీగాక చేప ప్రసాదం ఇచ్చేటప్పుడు ప్రాణంతో ఉన్న చేప పిల్లను ఉపయోగిస్తారు. నోట్లో కుక్కే సందర్భంలో అది ఊపిరితిత్తులలోకి పోతే గనుక ఆస్పిరేషన్ అనే ప్రమాదకరమైన ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా చేప పొలుసులో ఉండే చిన్న చిన్న క్రిములు ఉంటాయి పొట్ట లోపలికి వెళితే రోగాలు వస్తాయి.

బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజనింగ్

వాస్తవానికి పచ్చి చేపలు తినడం ప్రాణాంతకం. ఎందుకంటే వాటిలో హానికరమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉంటాయి. చేప ప్రసాదం పేరుతో ఇచ్చేది చిన్నపాటి కొర్రమీను చేపపిల్లలే కాబట్టి వీటిలో సాల్మొనెల్లా, విబ్రియో, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా ఫుల్లుగా ఉంటాయి. వీటిని తిన్న రెండు మూడు రోజులకు ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడవచ్చు. దీంతోపాటు పచ్చి చేపలలో అనిసాకిస్, సూడోటెర్రానోవా, డిఫిలోబోథ్రియాసిస్ వంటి పరాన్నజీవులు కూడా ఉంటాయి. ఇవి వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తాయి. కాబట్టి ఏ విధంగా చూసినా మృగశిర కార్తెలో జరిగే చేప ప్రసాదం పంపిణీ ఆరోగ్యానికి మంచిది కాదు.

Advertisement

Next Story

Most Viewed