సాలరీ ఎంతో చెప్పని భర్త.. ఆర్టీఐ ద్వారా వివరాలు పొందిన భార్య

by sudharani |
సాలరీ ఎంతో చెప్పని భర్త.. ఆర్టీఐ ద్వారా వివరాలు పొందిన భార్య
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది తాము ఎంత సంపాదిస్తున్నారో అందరితో చెప్పేందుకు ఇష్టపడకున్నా కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి భార్యకు మాత్రం తెలియజేస్తారు. ఏదైనా వివాదముంటే తప్ప ఆదాయ వివరాల గురించి భాగస్వామి దగ్గర దాచిపెట్టరు. అయితే భర్తకు సంబంధించి ఇలాంటి ప్రవర్తనతో నిరాశ చెందిన ఒక భార్య.. అతడు తన స్థూల ఆదాయం ఎంతో పంచుకోవడానికి నిరాకరించడంతో అధికారుల సహాయం కోరడం ద్వారా ఆ వివరాలను పొందింది. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంది.

విషయానికొస్తే.. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సీఐసీ) ప్రకారం, భర్తల ఆదాయ సమాచారాన్ని పొందేందుకు భార్యలు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో తన భర్త స్థూల ఆదాయ వివరాలను తెలుసుకునేందుకు సంజు గుప్తా అనే మహిళ RTI దరఖాస్తును దాఖలు చేసినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక పేర్కొంది. బరేలి, ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(CPIO) మొదట ఆమెకు ఈ వివరాలను అందించడానికి నిరాకరించారు.

దీంతో సంజు ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ (FAA) ముందు అప్పీల్ చేసింది. కాగా CPIO ఉత్తర్వును FAA సమర్థించగా.. ఆ తర్వాత ఆమె సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(CIC)కి మరో అప్పీల్ దాఖలు చేసింది. CIC తన గత ఆదేశాలతో పాటు సుప్రీంకోర్టు & హైకోర్టు తీర్పులను పరిశీలించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత CIC సదరు మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'పబ్లిక్ అథారిటీ వద్ద అందుబాటులో గల ఆమె భర్త నికర పన్ను విధించదగిన ఆదాయం/స్థూల ఆదాయ సాధారణ వివరాలను అప్పీలుదారుకు తెలియజేయమని CPIOని ఆదేశించింది.

Advertisement

Next Story