Valentine's Special: మన భాగ్యనగరం ప్రేమకు చిహ్నమని ఎంతమందికి తెలుసు?

by D.Reddy |
Valentines Special: మన భాగ్యనగరం ప్రేమకు చిహ్నమని ఎంతమందికి తెలుసు?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ.. రెండు మనసుల కలయిక, తియ్యని అనుభూతి, మాటల్లో చెప్పలేని భావన అంటారు. ప్రేమను దక్కించుకోవడం కోసం, ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు. ఎవరినైనా ఎదిరిస్తారు ప్రేమికులు. మరీ అలాంటి ప్రేమకు గుర్తుగా ప్రేమైక నగరంగా చరిత్రకెక్కింది మన నేటి హైదారాబాద్. నిజానికి చెప్పాలంటే భాగ్యనగరం అంటేనే ప్రేమ పునాదులపై వెలసిన నగరం.. ప్రపంచంలో ఏ నగరం కూడా ఇలా ప్రేమే పునాదులుగా ప్రేమైక నగరంగా స్థాపించబడలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రేమకథను తనలో దాచుకుంది మన భాగ్యనగరం. అందుకు నేడు మనం హైదరాబాద్‌లో చూస్తున్నా నాటి నిర్మాణాలూ, కట్టడాలే నిదర్శం. కానీ ఆ కట్టడాల చరిత్ర వెనక గొప్ప ప్రేమకథ దాగి ఉందని, ప్రేమకు చిహ్నాంగా వాటిని నిర్మించారని మనలో చాలా మందికి తెలియదు. ఫిబ్రవరి ప్రేమికుల నెల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రేమకథ ఏంటో చదివేయండి.

కుతుబ్ షా-భాగమతిల ప్రేమ కథ..

క్రీ.శ 16 శతాబ్ధంలో కుతుబ్ షాహీ వంశీయులు గోల్కొండ రాజధానిగా హైదరాబాద్‌ను పరిపాలించారు. ఆ సమయంలో ఐదవ రాజైన కూలీ కుతుబ్ షా హైదవ స్త్రీ అయిన భాగమతిని ప్రేమించాడు. భాగమతి నాటి హైదరాబాద్ రాజ్యంలోని చించలం(నేటి శాలిబండ) అనే ఓ చిన్న పల్లె ప్రాంతంలో నివసించేది. ఆమె చక్కటి నృత్యాకారిణి. ఓ రోజు యువరాజు కుతుబ్ షా గుర్రపై చించలం గ్రామానికి వెళ్తుండగా భాగమతిని చూసి మంత్ర ముగ్ధుడయ్యాడు. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. భాగమతి కూడా యువరాజును చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడింది. నాటి నుంచి రోజు భాగమతిని కలవడానికి గోల్కోండ కోట నుంచి మూసి నదికి అవతలి వైపు ఉన్న చించలం గ్రామానికి వెళ్లేవాడు. అయితే, అప్పట్లో గోల్కొండ కోట నుంచి చించలం వెళ్లే క్రమంలో పరవళ్లు తొక్కే మూసీని దాటడం అంటే పెద్ద సవాల్‌గానే ఉండేది.

కుతుబ్ షా అదేమీ లెక్కచేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి మరీ భాగమతిని కలువడానికి వెళ్లేవాడు. అది చూసిన మహారాజు ఇబ్రహీం కుతుబ్‌ షా పుత్రుడి ప్రేమకు ముగ్ధుడయ్యాడు. పుత్రుడు తన ప్రియురాలి ప్రేమ కోసం నదిని దాటేందుకు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు.. 1578లో గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించలం(శాలిబండ) వెళ్లేందుకు మూసీ నదిపై వంతెనను కట్టించాడు. ప్రేమికులను కలపడానికి వారధిగా నిర్మించిన వంతెన కావడంతో దీనికి 'ప్యార్ నా పూల్' అనే పేరు పెట్టారు. ఇదే కాల క్రమేణ నేటి పూరనాపుల్‌గా మారింది. హైదరాబాద్‌ నగరంలో మూసీ నదిపై నిర్మించిన తొలి వంతెన ఇదే కావడం విశేషం.

వీరి ఇద్దరి ప్రేమకు వారధిగా నిర్మాణమైన ఈ వంతెన నగరంలో వీళ్ల ప్రేమకు తొలి గుర్తయితే, మలి గుర్తు హైదరాబాద్ నగరమనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ అనగానే మన అందరీకి గుర్తొచ్చే చార్మినార్‌ను కూడా కుతుబ్ షా భాగమతి గుర్తుగానే నిర్మించాడు. మొట్ట మొదటిసారి తాను భాగమతి ఎక్కడైతే చూశాడో అక్కడ ఏదైనా అద్భుత కట్టడం నిర్మించాలని అనుకున్నాడు. అదే సమయంలో గోల్కొండ నగరంలో ఘోరమైన అంటు వ్యాధి సోకడంతో నవాబు ఆ వ్యాధి నివారణ కోసం 1591లో చార్మినార్‌ను నిర్మించి భాగ్యనగరంగా నామకరణం చేశాడు. అప్పటి ఆ చిన్న మారుమూల గ్రామంలో నిర్మించిన చార్మినార్ నేడు హైదరాబాద్ నడిబొడ్డున సందర్శకులను ఆకర్షిస్తుంది.

భాగమతి కూడా తన ప్రియుడైన కుతుబ్ షా కోసం తన మతాన్నే వదులుకొని ఇస్లాం మతాన్ని స్వీకరించింది. తన పేరును కూడా భాగమతి నుంచి హైదర్‌బానుబేగంగా మార్చుకుంది. అప్పటి నుంచి ఆమె పేరుతోనే భాగ్యనగరం.. హైదరాబాద్‌‌గా రూపాంతరం చెందింది. ఒకటేమిటి భాగమతి కోసం కుతుబ్ షా నగరంలో తోటలు, చెరువులు, సరస్సులు వంటివి ఎన్నో నిర్మాణం చేయించాడు. ఇలా అపూరమైన వారి ప్రేమ పునాదులపై వెలసిన హైదరాబాద్ మహానగరం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికి ఓ ప్రేమ నగరమే.

యువరాజు ఒక సాధారణ అమ్మాయిని ప్రేమించటాన్ని రాజవంశం కూడా అంగీకరించింది. భాగమతి కూడా తన ప్రేమికుడి కోసం మతాన్ని మార్చుకొని ప్రేమని గెలిపించుకుంది. ఇలా రాజరికం నుండి పేదరికం మధ్య ప్రేమకు వారధిలా నిలిచి గెలిచిన హైదరాబాద్ చరిత్రకు ఎందుకు సరైన ఆదరణ దక్కలేదు. తాజ్ మహాల్ అంటే షాజహాన్-ముంతాజ్ ప్రేమకు గుర్తు అని చెప్పినంతా త్వరగా హైదరాబాద్ అంటే కుతుబ్ షా-భాగమతి ప్రేమకు చిహ్నాం అని మనలో చాలా మందికి ఎందుకు తెలియట్లేదు. కుతుబ్ షాహీ తరువాత వచ్చిన అసఫ్ జాహీలు వారి పరిపాలనతో అప్పటి చరిత్రను మరిచిపోయేలా చేసారా? లేక ప్రజలు వారి పాలన గురించి మాత్రమే చెప్పుకోవాలనే ఆలోచనతో ఆ గొప్పప్రేమకథ చరిత్రలోనే పాతదైపోయిందా.?

Next Story