క్రిమినల్స్‌ ఏరివేతకు 'హౌస్ వైఫ్స్' ఆర్మీ.. పోలీసులకు బదులుగా

by Manoj |
క్రిమినల్స్‌ ఏరివేతకు హౌస్ వైఫ్స్ ఆర్మీ.. పోలీసులకు బదులుగా
X

దిశ, ఫీచర్స్ : పురుషుల చేతిలో హింసకు గురవుతున్న మహిళలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌ నుంచి బయటపడ్డ బాధితులు ఒక సమూహంగా ఏర్పడ్డారు. ఎవరో వచ్చి తమ కష్టాలు తీరుస్తారని ఎదురుచూడకుండా తామే ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగి సాటి మహిళల బాధలు తీర్చేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, బలోద్ జిల్లాలోని గ్రామాల్లో తలకు మెరూన్ బేరెట్స్(గుండ్రటి టోపీ)తో దర్శనమిచ్చే ఈ మహిళా సమూహాలు.. ఆర్మీ, పారామిలటరీ ఫోర్స్‌లో భాగమేమీ కాదు. వారంతా కమాండోలుగా మారిన గృహిణులే.

భారతీయ కార్యకర్త, 2012లో పద్మశ్రీ కూడా అందుకున్న శంషాద్ బేగం 2006లో ఈ 'మహిళా కమాండోస్' బ్రిగేడ్‌కు పునాది వేసింది. ఛత్తీస్‌గఢ్‌లో వెనుకబడిన వర్గాల విద్య కోసం విశేష కృషి చేసిన బేగం.. మద్యం మత్తులో ఉన్న పురుషుల చేతిలో హింసకు గురైన దాదాపు 100 మంది మహిళలను ఒకచోట చేర్చడంతో ఈ ఫోర్స్ ఏర్పడింది. వీరిలో కొందరు మానవ అక్రమ రవాణా బాధితులు కూడా ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి రక్షించబడిన తర్వాత ఈ కమాండోస్ ప్రాథమిక మానవ హక్కుల కోసం పోరాడే బాధ్యతను స్వీకరించారు. వీరంతా తాము అనుభవించిన దురాగతాల నుంచి తమ పిల్లలను రక్షించాలనే సాధారణ ఆలోచనతోనే ఈ దిశగా ప్రేరణ పొందారు.

దేనికోసం పోరాడుతున్నారు?

15,000కు పైగా మహిళలతో కూడిన ఈ బృందం ప్రస్తుతం 30కన్నా ఎక్కువ గ్రామాలకు విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు సైతం వీరిని 'సూపర్ పోలీస్ కమాండోస్(SPOలు)'గా వర్గీకరించారు. ఈ SPOలు రాష్ట్రంలో గృహ హింస, వరకట్న వ్యవస్థ, మద్యపాన వ్యసనం, మాదకద్రవ్యాల వినియోగం, ఇల్లీగల్ లిక్కర్ బిజినెస్ వంటి ప్రబలమైన నేరాలను అరికట్టేందుకు పనిచేస్తారు. ఇలాంటి కార్యకలాపాలను తనిఖీ చేసేందుకు సంబంధిత గ్రామాల్లో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేస్తారు. ఎవరైనా నిత్యం మత్తులో జోగుతూ ఆల్కహాల్ అడిక్టర్‌గా మారినట్లు గుర్తిస్తే వారితో ఆ అలవాటు మాన్పించేందుకు కౌన్సిలింగ్ అందిస్తారు.

ఈ మహిళలు ఎవరు?

బలోద్‌లో అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 'ఆరిఫ్ హుస్సేన్ షేక్'.. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 2016లో ఈ మహిళలకు SPO హోదా కల్పించారు. ప్రతి గ్రామంలోని ఒక్కో వార్డు నుంచి 10 మంది మహిళలను వ్యక్తిగతంగా ఎంపిక చేసి వారికి విజిల్‌, బీరువా సమకూర్చారు. అదే గ్రూప్ ఇప్పుడు 15,000 మంది మహిళా సైనికులతో పనిచేస్తుండగా ఈ పనికి ఎటువంటి జీతం ఉండదు. ఈ చొరవ ఫలితంగానే అప్పటి నుంచి బలోద్‌లో ఒక్క వ్యక్తి కూడా వైన్ షాపుల బయట మద్యం సేవిస్తూ లేదా బహిరంగంగా జూదం ఆడుతూ పట్టుబడలేదు. ఇక తమను మహిళా కమాండోస్‌గా పేర్కొన్న గ్రూప్ సభ్యురాలు లతా దేవి సాహు.. 'మేము ఉగ్రవాదం లేదా నక్సలిజంతో పోరాడం. సామాజిక దురాచారాలపై పోరాడతాం' అన్నారు.



Advertisement

Next Story

Most Viewed