Holiday Heart Syndrome : కొందరికి సెలవు రోజుల్లోనే తలెత్తుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్.. కారణం ఇదే

by Javid Pasha |   ( Updated:2024-11-28 07:08:37.0  )
Holiday Heart Syndrome : కొందరికి సెలవు రోజుల్లోనే తలెత్తుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్.. కారణం ఇదే
X

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? రోజూ ఉద్యోగాలకు, వివిధ పనులకు వెళ్లినా అలసిపోని కొందరు వ్యక్తులు హాలిడే రోజు మాత్రమే ఎక్కువగా నీరసించి పోతుంటారు. ప్రతి రోజూ హుషారుగా కనబడే వారు సైతం పండుగ రోజుల్లోనే సిక్ అవుతుంటారు. సెలవులను ఎంతో ఎంజాయ్ చేయాలనుకునే పలువురు అదే రోజు ఏదో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలా సెలవు రోజుల్లో మాత్రమే తలెత్తే సమస్యల్లో ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనినే ‘హాలిడే హార్ట్ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు.

నిజానికి హాలిడే హార్ట్ సిండ్రోమ్‌ (Holiday Heart Syndrome )ను చిన్న రుగ్మతగా భావిస్తుంటారు చాలా మంది. కానీ కొన్సిసార్లు నిర్లక్ష్యం చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యగానూ మారవచ్చు.అందుకే తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హాలిడే లేదా పండుగ రోజుల్లోనే ఇది ఎందుకు ఎక్కువగా వస్తుందంటే.. ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఏంటంటే.. ప్రస్తుతం సెలవులు, పండుగలు, పంక్షన్లు, పార్టీలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే చాలా మంది ఆల్కహాల్, వివిధ పానీయాలు ఎక్కువగా తాగడం, రకరకా ఆహారాలు, స్వీట్స్ వంటివి తినడం చేస్తుంటారు. ఈ పరిస్థితి గుండె వేగంగా కొట్టుకోవడానికి దారితీస్తుంది. అప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి ఆ సందర్భంలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే హాలిడే రోజు తీసుకునే ఆల్కహాల్, ఇతర పానీయాలు, ఆహారాల వల్ల అందరూ గుండెకు సంబంధించిన ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటారని కూడా చెప్పలేం. కొందరికి హార్ట్ బర్న్, కడుపులో ఉబ్బరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి, బ్లడ్ ప్రెజర్ (Blood pressure) అధికమై ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆహారాలు సరిపడక ఇంకొందరికి ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతుంటారు. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గుండెపై ప్రభావం చూపుతుండటం కారణంగా వైద్య నిపుణులు ఆ సందర్భంలో ఏర్పడే సమస్యలను ‘హాలిడే హార్ట్ సిండ్రోమ్’గా పేర్కొంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సెలవు రోజుల్లోనూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మెయింటైన్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండెపై ప్రతికూల ప్రభావం (Adverse effect on the heart) చూపేందుకు కారణం అయ్యే మద్యపానం, అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉండే ఇతర పానీయాలు, స్వీట్లు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed