హ్యాపినెస్ కోల్పోయారా.. అయితే కారణం అదేనేమో తెలుసుకోండిలా..!

by Prasanna |   ( Updated:2022-12-26 11:57:23.0  )
హ్యాపినెస్  కోల్పోయారా.. అయితే కారణం అదేనేమో తెలుసుకోండిలా..!
X

దిశ, ఫీచర్స్ : సంతోషమే సగం బలం అంటారు పెద్దలు. అది అక్షరాలా నిజం అనిపించేలా పలు సంఘటనలో, సందర్భాలో నిత్య జీవితంలో మనకు ఎదురవుతూనే ఉంటాయి. సంతోషం బలమే కాదు, ఆరోగ్యం కూడాను అంటున్నారు నిపుణులు. అందుకే జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నా సంతోషకరమైన సందర్భాలను ఆస్వాదించాలి. మన జీవితంలో హాప్పీనెస్ సగభాగం కూడా లేకుంటే అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి సంతోషంగా గడిపే లైఫ్ స్టయిల్‌ను అలవర్చుకోవాలని, జీవితంలోనూ, సమాజం నుంచి ఆనందాన్ని ఆస్వాదించాలని నిపుణులు చెప్తున్నారు.

మీరేం కోరుకుంటున్నారు?

జీవితంలో మీరేం కోరుకుంటున్నారు? మంచి ఉద్యోగం, ఐదంకెల జీతం, అంతకు మించి..అని అనడంలో తప్పులేదు కానీ, అది మాత్రమే జీవితంలో మనల్ని సంతోషంగా ఉంచలేదు అంటున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శశాంక్ శర్మ. జీవితంలో ఉద్యోగం, డబ్బు సంపాదన.. మరేదైనా ప్రొఫెషన్ కావచ్చు. అది మనకు సంతోషాన్ని కూడా ఇవ్వాలని చెప్తున్నారు. మనం సంతోషంగా లేనప్పుడు డబ్బు, హోదా, సంపాదన ఇవన్నీ నాన్ ప్రయారిటీ అంశాలే అవుతాయి. డబ్బు ఉన్నంత మాత్రానా మనిషి సంతోషంగా లేదా ఆనందగా ఉండగలడనే గ్యారెంటీ ఏమీ లేదు. కొందరికి డబ్బు, కారు, విల్లా అన్నీ ఉంటాయి. కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి ఉంటుంది. అదే సంతోషం. ఇది బజార్లో దొరికేది కాదు, ఎవరికి వారు తామున్న స్థితిలోనే క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే లైఫ్ వెరీ బోరింగ్ అంటున్నారు మానసిక నిపుణులు. చాలామంది సంతోషంగా ఉండకపోవడానికి గల పలు కారణాలేమిటో పరిశీలిద్దాం.

సంతృప్తిని కోల్పోతున్నారా?

చాలామంది తాము సంతోషంగా జీవించగలిగే అవకాశాలు, పరిస్థితులు ఉన్నప్పటికీ జీవితంలో సంతోషం కరువైందని బాధ పడుతుంటారు. ఉన్న స్థితిలో లేదా ఉన్నదానితో సంతోషంగా ఉండవచ్చు కానీ, తికమక ఆలోచనలతో దానిని దూరం చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి బైకు కలిగి ఉన్నప్పుడు, కారుంటే ఇంకా సంతోషంగా ఉండేవాడిని అనుకుంటాడు. కారు కొన్నాక, అంతకంటే బెటర్ అయింది కొంటే బాగుంటుంది అనుకుంటాడు. అలాగే సొంత ఇల్లు ఉన్నప్పుడు కూడా సంతృప్తి చెందక మరొక ఇల్లు కొనాలని అనుకుంటూ ఉంటాడు. ఇలా అనుకోవడంలో తప్పులేదు కానీ, అనుకునే క్రమంలో ఆనందాలను కోల్పోవడమే అసలైన సమస్య అంటున్నారు నిపుణులు. అందుకే అనంతమైన కోరికలతో సంతోషాన్ని దూరం చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఉన్న పరిస్థతిలో ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నత పరిస్థితిని క్రియేట్ చేసుకునేలా ఆలోచించాలి తప్ప, ఉన్నది కూడా కోల్పోయే పరిస్థతి తెచ్చుకునేలా మన ఆలోచన ఉండవద్దని చెప్తున్నారు.

ఇతరులతో పోలికవద్దు

మనకున్న పరిస్థితులను, అవకాశాలను ఎలా సంతోషంగా మల్చుకోవాలో ఆలోచించాలి. అంతే తప్ప ఇతరులు సంతోషంగా ఉంటున్నారనో, తనకంటే పలు అంశాల్లో బెటర్‌గా ఉన్నారనో ఊహించుకుంటూ కొందరు సంతోషాన్ని కోల్పోతుంటారు. ఇది క్రమంగా అసూయ, ఆత్మ న్యూనతా భావానికి దారి తీస్తుంది. అతి ఆలోచనలతో ఆరోగ్యం పాడవుతుంది. ఆత్మీయులు, మానవ సంబంధాలు దూరం కావడానికి దారి తీస్తుంది. కాబట్టి ఎవరి జీవితం వారిది. ఎవరికి ఉన్న పరిస్థితిని బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు. మన పరిస్థితిని బట్టి మనం నడుచుకుంటూ సంతృప్తి చెందాలి తప్ప ఇతరులతో పోల్చుకుంటూ బాధపడవద్దు. ''అసూయ, ద్వేషం వదులుకొని మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే సంతోషం మీ సొంతమవుతుంది'' అంటున్నారు కౌన్సెలింగ్ సైకాలజిస్టు రణదీర్ మెహతా.

ఇతరులపై నెపంవద్దు

కొందరు తమ జీవితంలో ఎదురయ్యే గెలుపోటములు లేదా సంతోషాలు, విషాదాలకు కారణం తామేనని మాత్రం ఒప్పుకోరు. తమకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు అనవసరంగా ఇతరులను నిందిస్తుంటారు. ఇలాంటి అలవాటే వారిని సంతోషాలకు దూరం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం కలిగి ఉంటాడు. తను ఏ విధమైన మార్గం అనుసరిస్తే సంతోషంగా ఉండగలడో ఆలోచించి, అటువైపు అడుగు వేస్తే ఇతరులను నిందించడం అనే అలవాటు దూరం అవుతుంది. అసలైన ఆనందం ఏమిటో తెలిసొస్తుంది అంటున్నారు నిపుణులు. సంతోషకరమైన జీవితాన్ని మల్చుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నించాలి. కానీ ఇతరులతో పోల్చుకోవద్దు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed