Social Media : స్నేహం ముసుగులో.. సోషల్ మీడియాలో బూచాళ్లున్నారు జాగ్రత!!

by Javid Pasha |
Social Media : స్నేహం ముసుగులో.. సోషల్ మీడియాలో బూచాళ్లున్నారు జాగ్రత!!
X

దిశ, ఫీచర్స్ : పరిచయమనే మొగ్గు తొడిగి.. స్నేహమనే పువ్వు పూస్తుంది. అది నిరంతరం ఆనంద పరిమళాలను వెదజల్లుతుంది. ఆపద సమయంలో ఆదుకుంటుంది. నిరాశలో నువ్వున్నప్పుడు ఆశల హరివల్లయ్ వికసిస్తుంది. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు నేనున్నానే భరోసానిస్తుంది. ఒంటరివై దిగులు చెందుతున్నప్పుడు తోడూ నీడై నీ వెంటే నిలుస్తుంది. కానీ.. ఇలాంటి స్నేహాలు క్రమంగా కనుమరుగవుతున్నాయ్. ఇప్పుడంతా మోసమే.. కొందరు స్వార్థపరులు, అపరిచితులు, నేరస్థులు కూడా స్నేహమనే ముసుగులో ఉంటున్నారు. ఇన్ స్టా, ఫేస్‌ బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలుగా వలపు వల విసురుతున్నారు. స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. అందుకే జర జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

స్నేహమంటూనే వేధింపులు..

ఆమె బీ ఫార్మసీ స్టూడెంట్. ఏదో సరదాకొద్దీ ఇన్ స్టాలో రీల్ చూస్తున్న ఈ క్రమంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. జస్ట్ ఫ్రెండ్‌షిప్ అన్నాడు. రోజూ మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రతీ విషయాన్ని ఇద్దరూ పంచుకున్నారు. పాపం ఆ యువతి స్నేహం కదా అనుకుంది. కానీ కొన్నిరోజులకు యువకుడు ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో, బయటా తెలిస్తే పరువుపోతుందని భావించిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ఓ గ్రామంలో జరిగిన సంఘటన ఇది. పోలీసుల దర్యాప్తులో ఆమె చావుకు కారణమైన వ్యక్తి ఓ జులాయి అని, గంజాయికి బానిసై నేరస్థుడని తేలింది. అందుకే జర జాగ్రత్త. స్నేహం పేరుతో మోసం చేస్తున్నా, దారుణాలకు పాల్పడుతున్నా చూస్తూ ఊరుకోకండి అంటున్నారు నిపుణులు.

మార్ఫింగ్ పేరుతో మాయ

వాళ్లిద్దరూ మైనర్లే. సోషల్ మీడియాలో పరిచయమయ్యారు. స్నేహం పేరుతో దగ్గరయ్యారు. ఆ తర్వాత బయటకు తిరగడం కూడా మొదలు పెట్టారు. అనేకసార్లు, అనేక చోట్ల ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. అప్పుడు మొదలైంది అసలు కథ. యువకుడు అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. తనకు కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని, ఇంట్లో నుంచి తేవాలని కూడా హుకుం జారీ చేసేవాడు. లేకపోతే ఫొటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. భయపడిన బాలిక పేరెంట్స్ తెలియకుండా వారు కష్టపడి దాచుకున్న డబ్బునంతా అతనికి ఇచ్చేది. దీంతో సదరు యువకుడు జల్సాలు చేసేవాడు. ఎంతకాలం నడుస్తుంది అలా.. డబ్బులు ఎక్కడికిపోతున్నాయనే అనుమానం వచ్చి, యువతి పేరెంట్స్ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. తమ కూతురే తీస్తోందని, ఓ యువకుడికి ఇస్తోందని తెలిసి షాక్ అయ్యారు. ఏపీలోని ఒంగోలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫొటోలు మార్ఫింగ్ చేస్తాననే బెదిరింపులకు లొంగిపోయిన ఓ యువతకు సంబంధించిన సంఘటనను ప్రస్తావిస్తూ పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో స్నేహం పేరుతో పరిచయం అయ్యే వ్యక్తులతో జర జాగ్రత్త. వారు తేనెపూసిన కత్తుల్లాంటి వారు కావచ్చు. నేరస్థులు కూడా కావచ్చు.

ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే..

ఇంటర్ చదువుతున్న యువతికి నాలుగు నెలల క్రితం రామ్ అనే యువకుడు ఇన్ స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ ఛాటింగ్ చేసుకుంటున్నారు. ఇంతలోనే తన నిజస్వరూపం బయట పెట్టాడు యువకుడు. అవసరం ఉందంటూ ఆమె దగ్గర విడతల వారీగా రూ. 21 వేలు తీసుకున్నాడు. ఇంకా ఇవ్వాలని వేధించేవాడు. లేవని చెబితే పర్సనల్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదరించేవాడు. చివరికి యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంలోని అశ్వరావు పేటలో ఈ ఘటన జరిగింది. మన దేశంలోని ఓ రాష్ట్రంలో కూడా మరో ఘటన జరిగింది. తనతో కాస్త స్నేహంగా ఉన్న ఓ వివాహిత ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన ఓ వ్యక్తి, దానిని వైరల్ చేస్తానంటూ, తన భర్తకు వాట్సాప్ చేస్తానంటూ వేధిస్తూ ఆమెపై పలు దారుణానికి ఒడిగట్టాడు. సో.. ఇలాంటి ఘటనలు చూసైనా యువత మారాలి. మోసాలు జరుగుతున్నాయని గ్రహించాలి. పేరెంట్స్ కూడా తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని, వారి సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.

అశ్లీల వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

ఆమె ఇంజినీరింగ్ చదువుతోంది. ఇటీవల ఓ అశ్లీల వెబ్ సైట్‌లో ఆమె ఫోన్ నెంబర్ సహా ఫొటో ప్రత్యక్షమైంది. తరచూ ఫోన్లు రావడం, అవతలి వ్యక్తులు అసభ్యంగా మాట్లాడటంతో భరించలేకపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రేమించాలని వేధించిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. చూశారు కదా.. ఇలాంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కారణం సోషల్ మీడియాలో అవతలి వ్యక్తులను గుడ్డిగా నమ్మేయడమే. ఇవి మాత్రమే కాదు, సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్ కాల్స్ వల్ల, వాట్సాప్ కు వచ్చిన లింకులను క్లిక్ చేయడంవల్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసుకుంటున్నవారు చాలామందే ఉంటున్నారు. అంతా అయిపోయాక మోసపోయామని గ్రహిస్తున్నారు.

అలసత్వం అస్సలు వద్దు

ఎంతోమంది నేడు సోషల్ మీడియా వేదికల్లో స్నేహం, ప్రేమ పేర్లతో వేధింపులకు గురవుతుండగా, మరి కొందరు వాటికి లొంగిపోయి చివరకు మోసపోయాక మేల్కొంటున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే సమజాంలో జరుగుతున్న మోసాలపట్ల ప్రజలు, యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు, నిపుణులు. పేరెంట్స్ కూడా తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అట్లనే సోషల్ మీడియా అకౌంట్లకు ప్రైవసీ సెట్టింగ్స్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ విషయాలు, ఫొటోలు, వీడియోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయవద్దు. ఏదైనా జరిగితే ఎదుర్కొనే ధైర్యం, ఆత్మ స్థైర్యం, పోలీసులను ఆశ్రయించగలమనే నమ్మకం ఉంటే తప్ప సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయండి. ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మేయకండి. స్నేహం, ప్రేమ ముసుగులో కామాంధులు, నేరస్థులు ఉండొచ్చు. బీ కేర్ ఫుల్ !

Next Story

Most Viewed