Financial security : ఆర్థిక స్థితర్వతమే జీవన భద్రత.. ఇవి పాటిస్తే లైఫ్ బిందాస్!

by Javid Pasha |   ( Updated:2024-10-20 13:32:16.0  )
Financial security : ఆర్థిక స్థితర్వతమే జీవన భద్రత.. ఇవి పాటిస్తే లైఫ్ బిందాస్!
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు మాత్రమే ఉంటే సరిపోదు.. ఆర్థిక స్థిరత్వం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మీ కనీస అవసరాలు తీర్చగలిగే సంపాదన, భవిష్యత్ అవసరాలకు తగిన ప్లాన్, ఆపద సమయాల్లో గట్టెక్కించగలిగేలా పొదుపు వంటివి మీ సమతుల్య జీవితానికి ముఖ్యమైన వనరులుగా ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయే సంవత్సరాలల్లో మీరు ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నా, ఆర్థిక స్వేచ్ఛ పొందాలన్నా ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లను వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

స్థోమతకు మించి ఖర్చు చేయడం

ఆర్థిక స్థిరత్వం లేదా స్వేచ్ఛను సాధించడం వాస్తవానికి అనుకున్నంత ఈజీ కాదు. అది లాటరీ తగిలినప్పుడు కలిగే సంపదలాంటిదో, వారసత్వంగా వచ్చే నిధిలాంటిదో అస్సలు కాదు. మీరు చేసే ఖర్చులు, పొదుపులను బట్టి కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే చాలా మంది చేసే ఆర్థిక పొరపాటు ఏంటంటే.. తమ ఆర్థిక స్థోమతకు మించి జీవించే ప్రయత్నం చేస్తుంటారు. కొత్త ఫోన్, కొత్త డిజైనర్ అవుట్ ఫిట్, కొత్త బైకు, కొత్త కారు.. ఇలా ప్రతీ ఒక్కటి అవసరమా.. కాదా ? అనే దానితో సంబంధం లేకుండా కొనేస్తుంటారు. దీంతో ఖర్చులు పెరిగిపోయి, అప్పులు చేస్తుంటారు తప్ప ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేద్దామనే కోణంలో ఆలోచించరు. ఈ అలవాటు వదులుకోకపోతే మీ భవిష్యత్ ఆర్థిక స్వేచ్ఛను హరిస్తుంది.

అప్పులను విస్మరించడం

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తుంటారు. అయితే మీ ఆర్థిక వనరులు, ఆదాయం, తీర్చగలిగే స్థోమతను బట్టి చేయాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సమయానికి తీర్చగలగాలి. క్రెడిట్ కార్డులు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొనే యూజ్ చేయాలి. ఇది పరోక్షంగా మీ ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఒకసారి లోన్ తీసుకొని సక్రమంగా తీర్చితే.. మరోసారి ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో అవసరమైన అప్పును మంజూరు చేయడానికి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మొగ్గు చూపుతాయి. అలా కాకుండా ఎగ్గొడితేనో, సక్రమంగా కట్టకపోతేనో మీకు మరోసారి అప్పు పుట్టదు. అప్పులు చేసి వ్యాపారాలు పెట్టడం, పెళ్లిళ్లు చేయడం, ఇల్లు కట్టుకోవడం వంటివి చేస్తున్నవారు ఎందరో ఆర్థికంగా ఎదిగినవారు ఉన్నారు. అందుకు కారణం వారు కట్టాల్సిన అప్పులను విస్మరించకపోవడం కూడా ఒకటి.

రిటైర్మెంట్ పొదుపు

చాలా మంది జాబ్ చేస్తేనే రిటైర్మెంట్ పొదుపు ఉంటుంది అనుకుంటారు. దీని అర్థం అది కాదు. మీ శేష జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రస్తుత సంపాదనలో కొంత భవిష్యత్ అవసరాలకోసం పొదుపు చేయాలి. కానీ కొందరు దీనిని విస్మరిస్తుంటారు. ఫలితంగా వృద్ధాప్యంలో హాస్పిటల్ ఖర్చులకు, వ్యక్తిగత అవసరాలకు డబ్బులు లేకుండా పోతాయి. ఇంట్లో సంపాదించేవారు ఉన్నా.. అవసరాలకు తగిన విధంగా వారి సంపాదన ఉండకపోవచ్చు. ఉన్నా కొందరు ఖర్చు చేయడానికి వెనుకాడవచ్చు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు. మీరు సంపాదిస్తున్న వయస్సులోనే మీ శేష జీవితానికి అవసరమైన డబ్బులను జమ చేసుకోవాలి. రిటైర్మెంట్ ఫండ్‌ను విస్మరించే హాబీని మీరు వదులుకోవాలి.

ఆర్థిక లక్ష్యాలపట్ల నిర్లక్ష్యం వద్దు

మీరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోకుండానే ప్రయాణించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి! జీవితం కూడా అంతే. మీరు ఆర్థిక లక్ష్యాలు కలిగి ఉండకపోతే రాబోయే రోజుల్లో ఆర్థిక స్వేచ్ఛను పొందలేరు. జీవితంలో స్థిరత్వాన్ని సాధించలేరు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకోవడం, భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయడం, వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడి పెట్టడం, మీ ఆర్థిక పరిస్థితని మెరుగు పరిచే నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.

అనవసర ఖర్చులు

కొందరు సాలరీ పడగానే వెనుకా ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తుంటారు. మరి కొందరు తమ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక నెలాఖరు వచ్చేసరికి దేనికి ఎంత ఖర్చు చేశారో, ఎందుకు ఖర్చు చేశారో కూడా అర్థంకాని గందరగోళంలో కూరుకుపోతారు. ఇలా చేయడం ఇబ్బందుల్లోకి నెడుతుంది. భవిష్యత్తులో మీ ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు ఖర్చు చేసే ప్రతీపైసా గురించి ఆలోచించండి. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. మంత్ ఎండింగ్‌లో సరిచూసుకొని వచ్చే నెలలో ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకుంటారు.

తాత్కాలిక ఆనందం కోసం

ప్రపంచంలో అనేక విషయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పటి పరిస్థితుల్లో ఎలా జీవించాలో నిర్ణయం తీసుకోవాలి. మీరు మరింత ఆనందంగా జీవించాలంటే పొదుపు చేయడం ముఖ్యం. కాబట్టి వచ్చే ఆదాయంలో నెలకు ఎంతో కొంత అందుకు కేటాయించాలి. అలా కాకుండా తాత్కాలిక ఆనందాలకోసం ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు చేసే అలవాటు మీ భవిష్యత్ ఆర్థిక స్వేచ్ఛను హరిస్తుంది. అదే తాత్కాలిక ఆనందాలను విస్మరిస్తూ పొదుపు చేస్తే మరో పదేండ్లకైనా సరే మీరు శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తారు.

ఇన్వెస్ట్‌మెంట్ భయాలు

మీకు వచ్చే ఆదాయం ఎంతైనా ఉండనివ్వండి. అందులో కొంత ఏదో ఒక పొదుపు పథకంలోనో, స్థిరాస్థిపైనో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో రెట్టింపు అవుతుంది. అలా కాకుండా నాకెందుకు లే అనుకున్నా, ఇన్వెస్ట్‌మెంట్లకు భయపడినా మంచి భవిష్యత్తును కోల్పోవచ్చు. కాకపోతే పెట్టుబడి పెట్టడం అనేది సరిగ్గాలేనపపుడు నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైన మార్గమేదో తెలుసుకొని అనుసరిస్తే మేలు జరుగుతుంది. కాబట్టి మీ ఎదుగుదలకోసం పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి అంశాలపట్ల నిర్లక్ష్యాన్ని వదులుకోండి.

ఇన్సూరెన్స్ పట్ల నిర్లక్ష్యం

ఎల్‌ఐసీ వంటి పలు జీవిత బీమా పథకాలు ఆయా వ్యక్తుల ఆర్థిక స్వేచ్ఛకు మంచి మార్గాలుగా ఉంటున్నాయని నిపుణులు చెప్తుంటారు. మీ భవిష్యత్ అవసరాలు తీర్చుకోవడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి, ఆనందంగా జీవించడానికి బీమా పాలసీలు, పొదుపులు సహాయపడతాయి. కాబట్టి ఆదాయం తక్కువగా ఉన్నా సరే. అందులోంచే కనీసం 5 శాతం మొదలు కొని ఎంతైనా కేటాయించడం మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛవైపు నడిపిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా అవసరం అంటున్నారు నిపుణులు. చాలా మంది ఎలా పొదుపు చేయాలి? ఎందులో పెట్టుబడి పెట్టాలి? వంటి విషయాలు తెలియకపోవడంవల్ల కూడా ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోతుంటారు. కాబట్టి మారతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా పొదుపు చేయాలనే విషయాలపై నిర్లక్ష్యం చేయవద్దు.

Advertisement

Next Story