Fastest Trains: కళ్లు మూసి తెరిచే లోగా..! ప్రపంచంలోనే అత్యంగా వేగంగా దూసుకెళ్లే రైళ్లు ఇవే..

by Javid Pasha |
Fastest Trains: కళ్లు మూసి తెరిచే లోగా..! ప్రపంచంలోనే అత్యంగా వేగంగా దూసుకెళ్లే రైళ్లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : రైళ్లల్లో ప్రయాణమంటే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది తప్ప మిగతా సమయాల్లో సరదాగా ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. కిటికీ పక్కన సీటు దొరికితే ఆ సంతోషమే వేరు. బయటి పరిసరాలను, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు. కంటినిండా కునుకు కూడా తీయవచ్చు. ఇలా రకరకాల కారణాలతో రైలు ప్రయాణాన్ని ప్రజలు ఇష్టపడుతుంటారు. ఇక ఒకప్పుడు రైళ్లు పట్టాలపై వెళ్తుంటే చాలా పెద్దగా శబ్దం వచ్చేదని, వాటి నుంచి పొగ ఎక్కువగా వెలువడేదని ఆ సెక్టార్ గురించి తెలిసిన నిపుణులు అంటుంటారు. సౌకర్యాలు కూడా తక్కువగా ఉండేవి. పైగా అవి స్లోగా నడిచేవి. దీంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేది. కానీ కాలక్రమంలో ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రైళ్లలో స్లీపింగ్ బెర్త్‌లు, వాష్ రూమ్‌లు, ఏసీ వంటి సౌకర్యాలు ఉంటున్నాయి. అంతేకాకుండా గంటకు 500 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్లే రైళ్లు ప్రపంచంలో ఉన్నాయి. ఇక దగ్గర ప్రయాణాలు చేసేవారైతే ట్రైన్ ఎక్కి అలా కళ్లు మూసి తెరిచేలోగా దిగాల్సిన స్టాప్ వచ్చేస్తుంది. కాగా ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

*షాంఘై మాగ్లేవ్ : ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లల్లో షాంఘై మాగ్లేవ్ ఒకటి. ఇది చైనా దేశంలోని షాంఘై సిటీలో నడుస్తుంది. కాగా గంటకు 460 కి.మీ. స్పీడ్‌తో దూసుకెళ్తుందని, ఒకానొక సందర్భంలో గంటకు 501 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేసిందని రైల్వే రంగంపట్ల అవగాహన ఉన్న నిపుణులు చెప్తుంటారు. అలాగే షాంఘై నగరం నుంచి ఎయిర్ పోర్టుకు కొన్ని నిమిషాల వ్యవధిలో చేరుకోవడానికి కూడా చాలా మంది ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తారట. పైగా ఇది సాధారణ ట్రైన్ల మాదిరి కాకుండా ఆయస్కాంతశక్తితో నడుస్తుంది.

*సీఆర్ హార్మోనీ : ప్రపంచంలోనే వేగంగా దూసుకెళ్లే రైళ్లల్లో మరొకటి CR హార్మోనీ ఇది కూడా చైనా దేశానికి చెందినదే. గంటకు 350 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని, అవసరమైనప్పుడు గంటకు 486 కీలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు.

*సీఆర్ ఫక్సింగ్ : చైనాలో 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇంకో ట్రైన్ పేరు సీఆర్ ఫక్సింగ్ (CR faxing). అవసరమైతే ఇది గంటకు 420 కిలోమీటర్ల వేగంతో కూడా నడవగలదు. చైనా రైల్వే రంగం ఎంతగా అభివృద్ధి చెందింతో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

* డీబీ ఇంటర్ సిటీ - ఎక్స్ ప్రెస్ 3: ఇక జర్మనీ దేశానికి చెందిన డీబీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 3 (DB Inter City - Express 3) రైలు కూడా గంటకు 368 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఇది ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చెప్తారు. జర్మన్ ప్రజలు ఎక్కువగా ఈ రైల్లోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారట.

*ఎస్ఎన్‌సీఎఫ్‌టీ‌జీ‌వీ : ఫ్రాన్స్ దేశంలోని ఎస్ఎన్‌సీటీజీవీ (SNCF TGV) పేరుగల ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఈ రైలు ఏకంగా గంటకు 575 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించి హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్తారు. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కువ దూరం ప్రయాణించిన ట్రైన్‌గా గుర్తింపు పొందింది. చైనా ట్రైన్లు కూడా ఇప్పటి వరకు ఈ వేగాన్ని అందుకోలేకపోయాయి. కాబట్టి చైనాకంటే కూడా ఫ్రాన్స్ హైస్పీడ్ రైళ్లను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్తారు.

*జేఆర్ షింకన్ సెన్ : జపాన్ దేశానికి చెందిన రైళ్లలో జేఆర్ (JR Shinkan Sen) షింకన్ సెన్ చాలా ఫేమస్. ఇది గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లగలదు. ఒకసారి గంటకు 443 కిలోమీటర్ల వేగాన్ని చేరుకొని రికార్డు క్రియేట్ చేసింది. మరో విషయం ఏంటంటే.. ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా సమయానికి వచ్చే ట్రైన్‌గా జపాన్‌లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది.

*ONCF అల్ బొరాక్ : ఓఎన్‌సీఎఫ్ (ONCF) అల్ బొరాక్ పేరుతో మొరాకోలో ప్రయాణించే ట్రైన్ కూడా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అవసరమైనప్పుడు 357 కిలోమీటర్ల స్పీడ్‌తో కూడా దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ట్రైన్ వచ్చాకే మొరాకోలో ఆయా నగరాల మధ్య జర్నీ చాలా ఈజీ అయిందని చెప్తుంటారు. అంతేకాకుండా ఈ దేశానికి పర్యాటకుల తాకిడి కూడా ఈ ట్రైన్ వచ్చాక మరింత పెరిగిందని చెప్తారు.

*రెన్‌ఫే AVE10: గంటకు 310 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే మరో ట్రైన్ ‘రెన్‌ఫే AVE103’ స్పెయిన్ దేశంలో నడుస్తుంది. ఇది 404 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంటున్నారు. స్పెయిన్‌లోని దాదాపు అన్ని బిగ్ సిటీస్‌లలో ఈ ట్రైన్‌ను నడుపుతున్నారు.

*కొరైల్ KTX- సాంచియోన్ : గంటకు 305 కిలోమీటర్ల స్పీడ్‌తో నడిచే కొరైల్ KTX- సాంచియోన్ పేరుగల ట్రైన్ దక్షిణ కొరియాలో నడుస్తుంది. ఇది ఒకసారి 421 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేసిందని రైల్వే సెక్టార్ నిపుణులు పేర్కొంటున్నారు.

*ట్రెనిటాలియా ఫ్రెక్సియారోస్సా : ట్రెనిటాలియా ఫ్రెక్సియారోస్సా (Trenitalia frexiarossa).. ఇటలీ దేశంలో ప్రయాణించే ఈ రైలు గంటకు 300 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. కాగా దీని హైస్పీడ్ రికార్డ్ గంటకు 389 కిలోమీటర్లు అని కూడా చెప్తారు. ఇటలీలోని మిలన్, రోమ్, ఫ్లోరెన్స్ వంటి ముఖ్యమైన నగరాల మధ్య ఈ ట్రైన్ నడుస్తుంది. ఇక్కడి ప్రజలకు రైలు ప్రయాణమంటే చాలా ఇష్టపడతారు.

Next Story