అందాన్ని దెబ్బతీసే బ్యాడ్ హాబిట్స్ ఇవే.. వదిలేస్తే నేచురల్ బ్యూటీ మీరే..

by Javid Pasha |   ( Updated:2024-03-20 14:28:14.0  )
అందాన్ని దెబ్బతీసే బ్యాడ్ హాబిట్స్ ఇవే.. వదిలేస్తే నేచురల్ బ్యూటీ మీరే..
X

దిశ, ఫీచర్స్ : అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్‌కు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, లేకుంటే హోమ్ రెమిడీస్ తయారు చేసుకోవడానికి అధిక సమయం పడుతుందని చాలామంది అంటుంటారు. కానీ అవేమీ చేయకుండానే రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పైగా కొన్ని బ్యాడ్ బ్యూటీ హాబిట్స్ వదులుకోవడంవల్ల సహజమైన అందం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. అందుకే అందాన్ని దెబ్బతీసే కామన్ హాబిట్స్‌ను వదులుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

ముఖంపై తరచుగా టచ్ చేయడం

కొందరు మాటి మాటికీ తమ ముఖాన్ని టచ్ చేస్తుంటారు. అలవాటుగా మారడంవల్ల మాట్లాడుతున్నప్పుడు చెంపలపై చేతులు ఆనించడమో, ముక్కుపై రుద్దుకోవడమో చేస్తుంటారు. మరికొందరు దవడ భాగంలో చేతులను తాకిస్తూ ఉంటారు. అయితే ఇది ముఖ సౌందర్యానికి నష్టం చేసే వరస్ట్ హాబీట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మనం ప్రతిరోజూ ఎన్నో రకాల వస్తువులను చేతులతో తాకుతుంటాం. చేతులపై డస్ట్ పేరుకుపోయి ఉండవచ్చు. కంటికి కనిపించని సూక్ష్మజీవులు చేరవచ్చు. కాబట్టి చేతులు కడుక్కోకుండా ముఖాన్ని తాకే అలవాటు ముఖంపై చర్మంలో సమస్యలకు దారితీస్తుంది. హాబిట్‌ను బ్రేక్ చేయడం బెటర్.

పెదాలు కొరకడం

నాలుకతో పెదాలను తాకడం, చప్పరించడం, కొరకడం అనేది కొందరిలో ఒక అలవాటుగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల లిప్ స్కిన్‌పై పగుళ్లు ఏర్పడతాయనేది అందరికీ తెలిసిన విషయమే. నాలుకతో తాకడంవల్ల కాస్త ఫ్రెష్‌గా అనిపిస్తాయని మీరు భావించి ఉండవచ్చు. కానీ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయని గుర్తుంచుకోండి. పైగా ఈహాబీట్ వల్ల పెదవులు అందవిహీనంగా మారుతాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే లిప్ బామ్ ఉపయోగించాలే తప్ప, నాలుకతో టచ్ చేయడం, కొరకడం చేయవద్దు. క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉంటే పెదాలను తేమగా ఉండి, అందంగా కనిపిస్తాయి.

కళ్లు రబ్ చేయడం

కళ్లను రుద్దే బ్యాడ్ హాబీట్ వల్ల నష్టం జరుగుతుంది. అలసిపోయినప్పుడు లేదా అలెర్జీలతో బాధపడుతున్నప్పుడు, నిద్రలోంచి లేచినప్పుడు కొందరు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. కానీ దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే చాన్స్ ఉంటుంది. తరచుగా రుద్దడం వల్ల మంట కూడా వస్తుంది. అంతేకాకుండా కళ్ల చుట్టూ ఉండే స్కిన్ చాలా డెలికేటెడ్‌గా ఉంటుంది కాబట్టి, చేతులతో రుద్దడం కారణంగా ‘పింక్ ఐ’ సిండ్రోమ్, కళ్లకలక వంటి సమస్యలు తలెత్తుతాయి. అందం దెబ్బతింటుంది. అవసరం అయితే ఇరిటేషన్ నుంచి ఉపశమనానికి టిష్యూను, కాటన్ వస్త్రాన్ని ఉపయోగించవచ్చు.

మొటిమల్ని గిల్లడం

ప్రతి ఒక్కరికీ టీనేజీలో మొహంపై మొటిమలు రావడం సహజం. వివిధ కారణాలవల్ల పెద్దలకు కూడా రావచ్చు. అయితే వాటిని గిల్లడంవల్ల ఇన్ఫెక్షన్ సోకి మరింతగా పెరిగిపోతాయి. ఫలితంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. కాబట్టి వాటిని గిల్లడం చేయకూడదు. రియాలిటీ ఏమిటంటే మొటిమలు ఉన్నాయని ఆందోళన చెందడంవల్ల అవి మరింత పెరుగుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. పాపింగ్ చేయకుండా ఉండాలి. అవి మీకు సమస్యగా అనిపిస్తే ట్రీ ఆయిల్‌ని ప్రయత్నించవచ్చు. ఇది వాపును తగ్గిస్తుంది.

రబ్బరు బ్యాండ్లను ఉపయోగించడం

మహిళలు జడ వేయకుండా రబ్బరు బ్యాండ్స్ యూజ్ చేస్తుంటారు. కానీ ఇవి జుట్టుకు హాని చేయవచ్చు. తరచుగా ఉపయోగించడంవల్ల వెంట్రుకలు విరిగిపోవడం, సరిగ్గా పెరగకపోవడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకు బదులుగా ప్లాస్టిక్ స్పైరల్ రకం మాదిరి ఫాబ్రిక్ కవర్ బ్యాండ్స్‌ను ఉపయోగించవచ్చు.

ఎయిర్ హీటర్‌ను యూజ్ చేయడం

జుట్టుకు హెన్నా పెట్టుకున్నప్పుడో, తలస్నానం చేసినప్పుడో కొందరు ఎయిర్ హీటర్ ద్వారా ఆరబెడుతుంటారు. దీనివల్ల జుట్టు త్వరగా ఆరిపోతుంది. కానీ తర్వాత సమస్యలు వస్తాయి. జుట్టు చివర్లు చిట్లిపోవడం జరగవచ్చు. కాబట్టి వీలైతే మీ జుట్టును సహజంగా ఆరబెట్టడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. నేచురల్ డ్రై సాధ్యం కాకపోతే ఏదైనా హీట్ ప్రొటక్షన్ సీరమ్‌ను యూజ్ చేయాలి. అలాగే ఎక్కువసార్లు తలస్నానం చేయడంవల్ల లేదా వాష్ చేయడంవల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కూడా కొందరు అపోహ పడతారు. మగవారికి, చిన్న జుట్టు ఉన్నవారికి సమస్య ఉండదు. కానీ పొడవాటి జుట్టు ఉండాలనుకుంటే మాత్రం ఇలా చేయకపోవడం బెటర్. మూడు, నాలుగు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుంది. దీంతోపటు గోర్లు కొరకడం, పిల్లో కవర్స్ మార్చకపోవడం వంటివి కూడా అందం, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Advertisement

Next Story

Most Viewed