పిల్లలు పడిపోతే ఎలా ఓదార్చాలి?

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-03 16:25:46.0  )
పిల్లలు పడిపోతే ఎలా ఓదార్చాలి?
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దల పర్యవేక్షణ అవసరం అంటున్నారు నిపుణులు కన్. ఎక్కువ నిర్మాణాలు (ద్వారాలు, మెట్లు, బల్లలు, కుర్చీలు, మంచాలు) ఇంకా ఎన్నో పెద్దలనుద్దేశించి కట్టుకున్నవి కాబట్టి పిల్లలు వాటిని దాటే, వాడే, ఆడే క్రమంలో పడిపోతుంటారు. పిల్లలు పడిపోయినా, దెబ్బతగిలినా ముందుగా సానుభూతి తప్పనిసరిగా చూపాలి. తర్వాత నొప్పి ఒక్కటే కాదు, చికాకు, అయ్యో అందరిముందూ పడిపోయాం పరువు పోయిందనే భావనలకు కూడా మద్దతు పలకాలి.

“అయ్యో పడిపోయావా, పరిగెత్తేటపుడు పాపం అడ్డుగా తగిలేసిందిది. నొప్పేమన్నా ఉందా? తగ్గిపోతుందిలే. ఏం పర్లేదు, ఇవన్నీ మామూలే, నేను చిన్నప్పుడు ఎన్ని సార్లు పడ్డానో, ఇదిగో ఈ గడ్డం నాది పగిలిపోయింది చూడు” అంటూ దెబ్బ తగిలిన చోట చిన్నగా రుద్దడం, పిల్లల్ని కౌగిలించుకోవటం లాంటివి చెయ్యాలి. దీన్నే నార్మలైజేషన్ అంటారు. ఇలా చేయటం వలన ఆడుతూ పడిపోవటం పొరపాటు కాదు, పడిపోతే ఇలాంటి భావాలన్నీ కలగటం సహజమే అన్న అవగాహనకి పిల్లలు వస్తారు.

ఇకపోతే మనం వాళ్లని నిందించటం, అపహాస్యం చెయ్యటం సమస్య ముదిరేలా చేస్తుంది. వాళ్లు తగిలిన నొప్పి కంటే మనమన్న మాటకి ఇంకా ఎక్కువ ఏడుస్తారు. అప్పటికే కోపంగా ఉన్న మీరు మరో దెబ్బ వేస్తారు. అలా అస్సలు చేయరాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని కొట్టడం సమర్థనీయం కాదని సూచిస్తున్నారు. దాంతో సమస్య మరింత జటిలం అవుతుందని.. అంతే కాకుండా పిల్లలు ఇక మీ ముందు ఆడకపోవడం, వాళ్లకి నిజంగా హాని జరిగినపుడు, దెబ్బ తగిలినప్పుడు చెప్పకపోవటం జరుగుతుంది.

సాధారణంగా పిల్లలు ఆడేటప్పుడు దెబ్బలు తగులుతాయి, అది సహజం అలాగే ఎక్కువశాతం చిన్నవే. అంటే ఎటువంటి వైద్య సహాయం అక్కర్లేనివి. ఇలాంటి దెబ్బలు తగలడం వాళ్ళ ఎదుగుదలలో భాగం కూడా. దీన్నే పాజిటివ్ రిస్క్ టేకింగ్ అంటారు. కానీ పిల్లల్లో చిన్న దెబ్బలకే విపరీతంగా కంగారు పడే పెద్దలు(పిల్లలపై ప్రేమ అలాంటిది) ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపలేరు. కొంచెం విజ్ఞత అవసరం. చీటికీ మాటికీ వైద్యుడి దగ్గరికి పట్టుకెళ్లక్కర్లేదు. మానటం సహజ ప్రక్రియ.

Advertisement

Next Story

Most Viewed