NASA discovery : అంగారక గ్రహంపై రంగురాళ్లు.. జీవజాలం మనుగడ సాధ్యమేనా?

by Javid Pasha |   ( Updated:2024-07-23 06:41:58.0  )
NASA  discovery : అంగారక గ్రహంపై రంగురాళ్లు.. జీవజాలం మనుగడ సాధ్యమేనా?
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్ష పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక విషయాలను కనుగొన్నారు. ముఖ్యంగా అంగారక గ్రహంపై వాతావరణం, జీవావరణం, నీటి జాడలకు సంబంధించిన నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మార్స్‌పై వేడినీటి బుగ్గలు, అగ్ని పర్వాతాలు వంటివి ఏర్పడి ఉండవచ్చునని కూడా సైంటిస్టులు అంచనా వేశారు. అక్కడ జీవజాలం మనుగడకు గల అవకాశాలపైనా పరిశోధించారు. కానీ అలాంటి చాన్సెస్ ఇప్పట్లో లేనట్లేనని భావించారు. ఇదిలా ఉండగా తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై మరో అద్భుతాన్ని గుర్తించింది. ఏంటంటే.. అక్కడ పసుపు-ఆకుపచ్చ (yellowish-green crystals) రంగులో గల స్వచ్ఛమైన సల్ఫర్ స్ఫుటికాలను, కొన్ని రకాల రంగు రాళ్లను కనుగొంది.

రెడ్ ప్లానెట్‌‌లోని ‘గెడిజ్ వల్లిస్ ఛానెల్‌పై (Gediz Vallis channel) పరిశోధనలు చేస్తున్న క్రమంలో నాసాకు చెందిన రోవర్ అక్కడి రాళ్ల కుప్పలపై డ్రైవ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ సందర్భంగా దాని రాపిడికి అక్కడున్న కొన్ని రాళ్లు పగిలిపోవడం వల్ల అసలు విషయం బయటపడిందని వెల్లడించారు. గత 30 ఏండ్ల అన్వేషణలో ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం మొట్ట మొదటిసారిగా రెడ్ ప్లానెట్‌పై రంగురాళ్లను గుర్తించడం ఆశ్చర్యం కలిగించిందని, ఈ కొత్త ఆవిష్కరణతో ఆనందంగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

కాలిఫోర్నియా పసాదేనాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో క్యూరియాసిటీ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతరిక్ష పరిశోధకుడు అశ్విన్ వాసవాడ ‘రెడ్‌ ప్లానెట్‌పై రంగు రాళ్లను గుర్తించడమనే ఈ కొత్త ఆవిష్కరణ ఎడారిలో ఒయాసిస్ కనుగొనడం’ లాంటిదని పేర్కొన్నారు. రోవర్ గ్రహంపై పరుగెడుతూ సడెన్‌గా ఒక దగ్గర ఆగిపోయింది. అది వెంటనే ‘క్రోంచ్.. నేను ఒక రాక్ మీద పరుగెత్తాను.. లోపల స్ఫుటికాలను కనుగొన్నాను’ అనే మెసేజ్‌ను ల్యాబొరేటరీకి అనుసంధానించిన కంప్యూటర్‌కు పంపిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కాగా నాసా క్యూరియాసటీ రోవర్ మార్స్‌పై సల్ఫర్ స్ఫుటికాలను గుర్తించడం తమలో చాలా ఉత్సాహం నింపిందని సైంటిస్టులు అంటున్నారు. ఈ ఆవిష్కరణను భవిష్యత్తు పరిశోధనలకు చాలా ముఖ్యమైందిగా భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇతర గ్రహాలపై జీవజాలం మనుగడ కోసం ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అందుకోసం అవసరమైన వాటిలో కార్బన్ డయాక్సైడ్‌, హైడ్రోజన్, నత్రజని, ఆక్సిజన్, భాస్వరం, సల్ఫర్ మూలకాలు చాలా ముఖ్యమైనవి. ఈ మూలకాలన్నీ కలవడంవల్లనే భూమిపై 98 శాతం జీవ పదార్థాన్ని కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు అంగారక గ్రహంపై సల్ఫర్ కంటెంట్ కలిగి ఉండే ఆకు పచ్చ, పసుపు రంగు రాళ్లను కనుగొనడం భవిష్యత్తు జీవజాల ఆవిర్భావానికి, మనుగడకు అవకాశాలు కల్పించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా ఇక్కడి సల్ఫర్ స్ఫుటికాలు, రంగురాళ్లు పురాతన అగ్ని పర్వతాలు, అలాగే భూగర్భ జలాల ప్రవాహాలవల్ల ఏర్పడిన ఉండవచ్చునని, హార్డ్ - వాటర్ నిక్షేపాల ఉనికి కూడా కావచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story