- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kids Health : రెడీ టు ఈట్ స్నాక్స్.. పిల్లల్లో జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయా?

దిశ, ఫీచర్స్ : ‘‘చదువుకునే వయసులో తినకుంటే ఎట్లా..? ఒక్క రొట్టె తునకైనా తినకుంటే చదివింది ఏం గుర్తుంటది? కొచెం సల్ల (మజ్జిగ) అయినా తాగిపో బిడ్డా..’’ ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కువగా వినిపించే మాట ఇది. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో పిల్లలు, పెద్దల బ్రేక్ ఫాస్ట్ రొట్టె, అంబలి, సద్దన్నంతోనే మొదలైతయ్ కానీ.. తక్కువ. పదీ పదిహేనేళ్ల క్రితం అయితే రోజువారీ ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, సల్ల, రసాయనాలతో కలుషితం కానటువంటి తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటివి వండుకొని తినేవారు. నాన్ వెజ్ విషయానికి వస్తే నాటుకోళ్లు, పొట్టేలు మాంసం, నాటుకోడి గుడ్లు వంటివి ఎక్కువగా తినేవారు. ఈ అలవాట్లే వారిలో శారీక బలానికి, జ్ఞాపకశక్తి, ఏగ్రత పెరగడానికి, ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆహారపు అలవాట్లలో మార్పులు పిల్లల, పెద్దల మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అలాంటి కొన్ని రకాల ఆహారాలేవో ఇప్పుడు చూద్దాం.
నగరాల్లో జీవించే చాలామందికి హెల్తీ ఫుడ్స్ అంటే అనాగరికంగా అనిపిస్తుంటాయ్. సల సల మరిగే నూనెల్లో వంద డిగ్రీలవద్ద కాల్చిన పూరి, వడ, బజ్జీ వంటి ఆహారాలు, బేకరీల్లో లభించే రెడీ టు ఈట్ స్నాక్స్ అయితే యమ టేస్టీగా అనిపిస్తంటాయ్. పాస్తా, నుడుల్స్, మ్యాగీ వంటి ఆహారాలు, చిప్స్, పిజ్జా, బర్గర్ల వంటి జంక్ ఫుడ్స్ అయితే లొట్టలేసుకుంటూ మరీ తినేస్తుంటారు. కానీ ఇవే మన ఆరోగ్యాలను పాడుచేస్తున్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గడానికి కూడా కారణం అవుతున్నాయని చెబుతున్నారు.
మెదడుపై ప్రభావం
రెడీ టు ఈట్ స్నాక్స్ ఈ రోజుల్లో పిల్ల మెదడు సామర్థ్యంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతున్నాయి. జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతున్నాయి. అలాంటి వాటిలో చిప్స్, నూడుల్స్, కుకీస్, అధిక చక్కెరలు కలిగిన డ్రింక్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటున్నాయి. అట్లనే కృత్రిమ రుచులు, రంగులు కలిగిన ఆహారాలు చదువుకునే పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని తగ్గడానికి దారితీస్తున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కూల్ అండ్ హాట్ డ్రింక్స్
కూల్ అండ్ హాట్ డ్రింక్స్.. ముఖ్యంగా టీ, కాఫీ వంటి పానీయాలు తాగడానికి రుచిగా అనిపిస్తాయి. అయితే కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, టీ, కాఫీల్లో కెఫిన్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల చదువుకునే పిల్లల జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. కెఫిన్ అధికంగా ఉండే ఏ రకమైన డ్రింక్స్ అయినా పిల్లల్లో హైపరాక్టివిటీని, నిద్రలేమిని, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంటాయి. కాబట్టి దూరంగా ఉంచడమే బెటర్.
ఫాస్ట్ ఫుడ్స్
ప్రస్తుతం చాలామంది ఇష్టపడే వాటిలో ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటుంటారు. కానీ వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి మంచిది కాదు. వారి మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. చదువులో వెనుకబడేందుకు కారణం అవుతాయని, తరచుగా ఫాస్ట్ ఫుడ్స్ తినేవారిలో మేధో వికాసం స్తంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తీపి పదార్థాలు
చాలా వరకు మార్కెట్లో లభించే తీపి పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదంటుంటారు నిపుణులు. ముఖ్యంగా క్యాన్డ్ జ్యూస్‌లు, డ్రింక్స్ పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి అధిక చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లతో నిండి ఉంటాయి. రక్తంలో చక్కెరస్థాయిలను పెంచుతాయి. పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. గట్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే మార్కెట్లో లభించే తీపి పదార్థాలు తరచుగా తినవద్దు అంటున్నారు పోషకాహార నిపుణులు.
క్యాండీలు, జెల్లీలు
అనేక రంగుల్లో ఉంటూ చూడగానే పిల్లల దృష్టిని ఆకర్షించే వాటిలో క్యాండీలు, జెల్లీలు కూడా ఉన్నాయి. చక్కెరలు అధికంగా ఉండే క్యాండీలు, జెల్లీలు, కృత్రిమ రంగులు కలిపిన ఇతర చక్కెర పదార్థాలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాగా వీటిని తరచుగా తింటే పిల్లల మెదడు సామర్థ్యం దెబ్బతినవచ్చు. హైపరాక్టివిటీ, ఆందోళన, ఎడీహెచ్‌డీ వంటి సమస్యలు, అట్లనే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.