ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి

by samatah |
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి
X

దిశ, ఫీచర్స్: అప్పుడప్పుడూ ఫాస్టింగ్ ఉండాలన్న ఆసక్తి ఉన్నవారికి.. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులై, ఉపవాసం ఎలా ఉండాలోనని దిగులు పడేవారికి.. ఇది శుభవార్త. ఎందుకంటే షుగర్ వ్యాధి బాధితులైనా సరే ఫాస్టింగ్ ఉండవచ్చని, ఇది డయాబెటిస్ నివారణకు తోడ్పడుతుందని తాజా అధ్యయనం రుజువు చేసింది. ప్రతీ సందర్భంలో కాకపోయినా అరుదుగానైనా ఉపవాసం ఉండటమనేది చాలా కుటుంబాల్లో ఒక ఆనవాయితీగా ఉంటుంది. వారానికో, ఆయా పండుగలప్పుడో, ప్రత్యేక పూజలు, వ్రతాల సమయాల్లోనో ఫాస్టింగ్ ఉండేందుకు పలువురు ఆసక్తి చూపుతుంటారు. ఇంకొందరు లావెక్కకూడదనే భయంతో, మరికొందరు బరువు తగ్గాలనే ఆశతో ఫాస్టింగ్ వైపు మొగ్గు చూపుతారు. కారణం ఏదైనా అడపా దడపా ఉపవాసాలు మేలు చేస్తాయని, డయాబెటిస్‌ను తిప్పికొట్టడంతో పాటు అధిక బరువును నివారించడంలో తోడ్పతాయని తాజా పరిశోధన స్పష్టం చేసింది.

ఆరోగ్యం, ఆనందం, భక్తి కూడా ఇమిడి ఉండటంతో చాలా మంది ఫాస్టింగ్ ఉండేందుకు ఇష్టపడుతుంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఉండొచ్చా? ఉంటే ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయి? అని చాలామంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్టు తేలింది. దీంతో దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నియమానుసార ఉపవాసం ఉండవచ్చని స్పష్టం చేశారు. డయాబెటిస్‌ను నివారించడంలో ఉపవాసం ఏ విధంగా తోడ్పడుతుందనే అధ్యయనంలో భాగంగా శాస్ర్తవేత్తలు 38 నుంచి 72 ఏళ్ల వయస్సుగలవారిపై ప్రయోగం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం.. మూడు నెలలపాటు అడపా దడపా ఉపవాసం ఉన్నవారికి మధుమేహం తగ్గుతూ వచ్చిందని గుర్తించారు. ఉపవాసాల తర్వాత షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గినవారు వారు ఏడాదిపాటు మందులు తీసుకోకపోయినా ఆరోగ్యంగానే ఉన్నారని అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను శాస్ర్తవేత్తలు ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండో క్రినాలజీ మెటబాలిజంలో పబ్లిష్ చేశారు.

డయాబెటిస్ నివారణలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాత్ర

అరుదైన లేదా అడపా దడపా ఉపవాసానికి కచ్చితమైన సమయం, నియమం అవసరం. ఇక 5:2 నియమం ప్రకారం.. అంటే ఐదు రోజులు సాధారణ ఆహారం తీసుకుని, రెండు రోజులు ఉపవాసం చేయడం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఈ ఉపవాస రోజుల్లో స్వల్పంగా 500 కేలరీల కంటే తక్కువ కలిగిన ఆహారం తీసుకోవాలి. ఇలాంటి పద్ధతి డయాబెటిస్‌ను తరిమి కొట్టడమేగాక.. మధుమేహం ఉన్నవారిలో స్థూలకాయం రాకుండా నివారించేందుకు దోహదం చేస్తుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఇలాంటి అరుదైన ఉపవాస సమయంలో అవసరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం తర్వాత ఎక్కువసేపు విరామం అవసరం కాబట్టి, ముందుగానే తీసుకునే ఫుడ్‌లో తగిన పోషకాలు ఉండేలా చూసుకోవడం బెటర్. ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మల్టీ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం పోషకాహారమే కాదు, తగినంతగా నీరు కూడా తాగాలి.

టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం

తరచూ ఒకే దగ్గర కూర్చొని ఉండటం అంటే శారీరక శ్రమలేని లైఫ్ స్టయిల్ టైప్ 2 డయాబెటిస్‌‌కు ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పవచ్చు. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో డయాబెటిస్‌ను తరిమికొట్టే గుణం ఎక్కువ. శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి కారణాలు టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీయవచ్చు. అలాంటప్పుడు హెల్తీ లైఫ్ స్టయిల్ అలవర్చుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. మధుమేహం నుంచి ఉపశమనం పొందిన తర్వాత కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డైట్ పాటించాలి. అంటే మీరు తీసుకునే ఆహారం మళ్లీ డయాబెటిస్‌ను పెంచేదిగా ఉండకూడదు. అనుమానాలు ఏమైనా ఉంటే డైటీషియన్‌ను సంప్రదించి ఆహారం, జీవన శైలి విషయంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అన్నింటి కంటే నివారణ మార్గం ఉత్తమమైనది కాబట్టి జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడంవల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండవచ్చు.


Advertisement

Next Story

Most Viewed