చందమామ దూరం.. దూరం.. క్రమంగా తగ్గుతున్న పరిమాణం.. మానవాళికి ప్రమాదమా ?

by Javid Pasha |
చందమామ దూరం.. దూరం.. క్రమంగా తగ్గుతున్న పరిమాణం.. మానవాళికి ప్రమాదమా ?
X

దిశ, ఫీచర్స్ : చల్లని రేయి.. నిర్మలమైన ఆకాశం.. వాకిట్లో అలా వాలిపోయి వెలుగులు విరజిమ్మే చందమామను చూస్తే ఆనంద పారవశ్యంలో మునిగిపోనివారంటూ ఎవరూ ఉండరు. మొత్తం విశ్వంలోనే ఓ స్పెషాలిటీ కలిగిన ఉప గ్రహం చంద్రుడు. దాని ప్రత్యేకత రీత్యా చంద్రుడి చట్టూ అనేక కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. సైంటిఫిక్ అంశాలు కూడా మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కాగా ప్రస్తుతం భూ గోళంపై చోటు చేసుకునే పర్యావరణ వ్యతిరేక కార్యకలాపాలు చంద్రుడి సైజు రోజు రోజుకూ తగ్గడానికి కారణం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

నిరంతర పరిశోధనలు

సౌర వ్యవస్థ మొత్తంలో భూమిపై మాత్రమే జీవం మనుగడకు అనుకూల పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు కొన్ని ఉన్నప్పటికీ అవి సూర్యుడికి ఎక్కువ దగ్గరగా, మరికొన్ని ఎక్కువ దూరంగా ఉండటంవల్ల అక్కడ జీవం ఏర్పడే పరిస్థితులు లేవని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ సూర్య చంద్రులకు సంబంధించిన మరిన్ని రహస్యాలు తెలుసుకునేందుకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

క్షీణిస్తున్న చంద్రుడు

తాజాగా భూకంప చర్యలు, పర్యావరణ వ్యతిరేక పరిస్థితుల కారణంగా చంద్రుడి పరిమాణంలో మార్పులు జరుగుతున్నాయని, ముఖ్యంగా చంద్రుడు క్షీణించిపోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రుడి ఉపరితలంపై థ్రస్ట్ ఫాల్ట్స్ ఫొటోలను అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు నెట్టింట డిస్కషన్ నడుస్తోంది. అయితే చర్చల్లో వాస్తవం ఉందని నిపుణులు చెప్తున్నారు. బీబీసీ రిపోర్ట్ ప్రకారం కూడా కొన్ని వందల మిలియన్ సంవత్సరాల్లో చంద్రుడి వ్యాసార్థం తగ్గింది.

50 మీటర్ల క్షీణత

వందల మిలియన్ సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుతం చంద్రుడి కోర్ (అంతర్భాగం) సుమారు 50 మీటర్ల వరకు.. అంటే.. 164 అడుగుల మేర కుంచించుకుపోయింది. చంద్రుడి ఉపరితలంపై థ్రస్ట్ ఫాల్ట్ ఫొటోలను ఎనలైజ్ చేసిన సైంటిస్టులు కూడా ఇది నిజం అని తేల్చారు. కాగా ఈ ఛాయా చిత్రాలను అపోలో వ్యోమగాములు, ఇటీవల నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ క్యాప్చర్ చేశాయి.

వ్యాసార్థంలో లోపాలు

అట్లనే అపోలో ప్రయోగ సమయంలోనూ చంద్రుడిపై మిగిలిపోయిన సీస్మోమీటర్లలో పలు లోపాలను రీసెర్చర్స్ గుర్తించారు. ముఖ్యంగా చంద్రుడికి దాదాపు 500 కిలోమీటర్ల రేడియస్‌ (వ్యాసార్థం)తో ఇన్నర్‌ కోర్ ఉందని, ఇది పాక్షికంగా క్షీణించిందని పరిశోధకులు కనుగొన్నారు. కాగా ఇది భూమి కోర్ కంటే చాలా తక్కువ సాంద్రత కలిగి, లోపలి భాగం కూడా చాలా కూల్‌గా ఉంటుంది.

ఇన్నర్ కోర్‌లో మార్పులు

చంద్రుడిపై రేడియస్ ఇన్నర్ కోర్ బయటి భాగం మొత్తం క్రస్ట్ మాదిరి పెళుసుగా ఉంటుంది. కాబట్టి లోపలి భాగం తగ్గిపోతున్నప్పుడు క్రస్ట్ విరిగిపోతుంది. ఫలితంగా ఈ క్రస్ట్ భాగాలు కొన్ని కోర్ వైపునకు కదులుతాయి. చంద్రునిపై కనిపిస్తు్న్న కొన్ని లైన్స్, స్లోగా సంకోచించడంవల్ల పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాసెస్ నేటికీ కొనసాగుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. భూమి గురుత్వాకర్షణ నేపథ్యంలో చంద్రునిపై ఒత్తిడి మరింత ప్రభావం చూపుతోంది. మొత్తానికి చంద్రుడిలో క్షీణత కనిపిస్తోంది.

దూరంగా జరుగుతున్న చంద్రుడు

వాస్తవానికి చంద్రుడి ద్రవ్యరాశి తగ్గదు కాబట్టి, భూమి, చంద్రుని మధ్య గురుత్వాకర్షణ శక్తి అలాగే ఉంటుంది. ఇది ఒకే లెవల్‌లో ఉన్నప్పుడు భూగోళంపై అది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. అలాగే చంద్రుని కక్ష్య పరిమాణం ఏడాదికి సుమారు 3.8 సెం.మీ పెరుగుతున్నది. కాబట్టి అది మనకు కాస్త దూరంగా జరుగుతోంది. ఫలితంగా భూ భ్రమణం మందగిస్తోంది. ఇది రోజు నిడివిని ప్రభావితం చేస్తుంది. అంటే భూమిపై ఒక రోజు నిడివికి దాదాపు 2.3 మిల్లీసెకన్లు యాడ్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

మానవులకు నష్టమా?

చంద్రుడి పరిమాణంలో.. ముఖ్యంగా కోర్ భాగాలవద్ద క్షీణత భూమిపై, మానవులపై ప్రతికూల ప్రభావం చూపుతాయా? అనే సందేహాలు, ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చంద్రుడిలో సంకోచం రేటు దీర్ఘకాలం పాటు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి చంద్రుని పరిమాణం మారదు. అలాగే దీర్ఘకాలంలో తర్వాత సంభవించే స్వల్ప మార్పులు కూడా మానవులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు.

Advertisement

Next Story

Most Viewed