Selling Sun Light : సూర్య కాంతిని అమ్ముతున్న కంపెనీ... రాత్రి కూడా అవెలెబుల్..

by Sujitha Rachapalli |
Selling Sun Light : సూర్య కాంతిని అమ్ముతున్న కంపెనీ... రాత్రి కూడా అవెలెబుల్..
X

దిశ, ఫీచర్స్ : కాలిఫోర్నియా బేస్డ్ స్టార్టప్ 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' సూర్య కాంతిని విక్రయించేందుకు సిద్ధమైంది. సూర్యరశ్మిని అందించడం ద్వారా గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్‌స్కేప్‌ను మార్చేందుకు ప్రణాళికను ప్రకటించింది. రాత్రి సమయంలో భూమి ఉపరితలంపై ఉన్న సౌర ఫలకాలపైకి సూర్యరశ్మిని మళ్లించాలని భావిస్తోంది, సమయంతో సంబంధం లేకుండా డిమాండ్‌పై సమర్థవంతంగా సన్ లైట్ ను విక్రయిస్తానని అంటోంది. లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో CEO బెన్ నోవాక్ ఇందుకు సంబంధించిన ప్లాన్ వివరించాడు.

సోలార్ ఫర్మ్స్ రాత్రి పూట సౌర శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు నోవాక్. ఎలాంటి అంతరాయం లేకుండా చీకటి పడిన తర్వాత కూడా సూర్య కాంతిని సోలార్ ప్లాంట్ లకు విక్రయిస్తామని తెలిపారు. నోవాక్ ప్లాన్ లో 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్కటి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ మిర్రర్‌లతో అమర్చబడి ఉంటుంది. ఈ అద్దాలు సూర్యరశ్మిని భూమిపై ఉన్న సౌర క్షేత్రాలకు ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి. ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి.

ఏడుగురు వ్యక్తులతో కూడిన రిఫ్లెక్ట్ ఆర్బిటాల్.. హాట్ ఎయిర్ బెలూన్‌కు 8*8 అడుగుల కొలత గల మైలార్ మిర్రర్‌ను జోడించడం ద్వారా తమ ప్లాన్ పరీక్షించాలని నిర్ణయించుకుంది. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ఉద్దేశ్యం. కాగా మైలార్ మిర్రర్స్ ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఇందుకు గాజు కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై పాలిస్టర్ ఫిల్మ్‌ను ఉపయోగించారు. అనేక వారాలు ఫీల్డ్‌లో గడిపిన తర్వాత చివరకు గణనీయమైన పురోగతిని సాధించినట్లు చెప్పారు. చాలా ప్రయోగాల తర్వాత, బృందం 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌ మీద ఉన్న మిర్రర్ నుంచి సూర్య కాంతిని విజయవంతంగా ప్రతిబింబించగలిగారు. ఈ ప్రతిబింబించే కాంతి ప్రతి చదరపు మీటరు ప్యానెల్‌కు దాదాపు 500 వాట్ల శక్తిని ఉత్పత్తి చేసింది. కాగా ఈ కంపెనీ 2025లో తమ వ్యాపారాన్ని ప్రారంభించనుండగా... ఇక మీరు సూర్య కాంతి కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఇప్పటికే 30,000 దరఖాస్తులు కూడా వచ్చినట్లు చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed