Being Too Nice : అతి మంచితనం అనర్థదాయకమే..!!

by Javid Pasha |
Being Too Nice : అతి మంచితనం అనర్థదాయకమే..!!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ, జాలి, దయ, మంచితనం వంటివన్నీ మనుషుల్లో మెచ్చుకోదగిన లక్షణాలే.. కానీ అవి ఒక లిమిట్‌లో ఉన్నంత వరకే మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఒకప్పుడు అతి చొరవ ‘ధూర్త లక్షణం’గా పరిగణించేవారు. ఆధునిక కాలంలో ఇతరులను డిస్టర్బ్ చేసే చెడు వ్యసనంగానూ పరిగణిస్తున్నారు. ఇక అతి మంచితనం విషయానికి వస్తే.. కొన్ని సందర్భాల్లో మీకు నష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎదుటివారు ఇబ్బంది పడతారేమోనని అడిగిందల్లా చేయడం, అవతలి వ్యక్తులను సంతోష పెట్టడానికి స్వ ప్రయోజనాలను విస్మరించడం, ఏదైనా ఒక విషయంలో ‘నో’ చెప్పలేకపోవడం వంటివన్నీ అతి మంచితనంలో సాధారణంగా కనిపించే లక్షణాలుగా పేర్కొన్నవచ్చు. ఇవి మీకు నష్టం చేకూరుస్తాయి.

కొందరు తమను అందరూ మంచివారు అనుకోవాలనే ధోరణితో వ్యహరిస్తుంటారు. దీంతో ఇతరుల విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవడమో లేదా అసలు పట్టించుకోకపోవడమే చేస్తుంటారు. ఈ రెండు రకాల ప్రవర్తనలు కూడా మీపట్ల స్వార్థంగా ఆలోచించే వారికి మేలు చేస్తాయి. వారు మీ సమయాన్ని, టాలెంట్‌ను ఉపయోగించుకొని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీపట్ల చులకనగా వ్యవహరించడం వంటివి చేసే అవకాశం ఉంటుంది. అందుకే మంచితనం మంచిదే కానీ.. అతి మంచితనం మాత్రం నష్టం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

అరుదుగా లభించే వస్తువుకు, అవసరం మేరకు లేదా తక్కువగా మాట్లాడే వ్యక్తికి సమాజంలో ప్రజలు ఎక్కువ విలువ ఇస్తారు. దీనిని మంచి తనంగా పరిగణిస్తారు. ఇక్కడ వస్తువుకు డిమాండ్, ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువగా లేదా అనవసరంగా మాట్లాడే వ్యక్తిపట్ల ఇతరులు ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే అతిమంచితనంలో ఇవి రెండూ భిన్నంగా ఉంటాయి. తమను మంచి వారు అనుకోవాలని అతిగా మాట్లాడటం, అనవసర విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం అడగకపోయినా సలహాలు ఇవ్వడం, తమకే అన్నీ తెలుసు అన్నట్లు నిరూపించుకునే ప్రయత్నం చేయడం వంటివి అతి చొరవ, అతి మంచితనం కలిగి ఉండే వ్యక్తుల్లో కనిపించే లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో సందర్భోచితంగా వ్యవహరించడమే సరైన మార్గంగా పేర్కొంటున్నారు.

Advertisement

Next Story