మరింత అడ్వాన్సుగా మారుతోన్న కల్చర్.. ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచలేమని భయం!

by Gantepaka Srikanth |
మరింత అడ్వాన్సుగా మారుతోన్న కల్చర్.. ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచలేమని భయం!
X

హమ్ దో.. హమారే దో.. మేమిద్దరం.. మాకిద్దరు (పిల్లలు) సంస్కృతికి నేటితరానికి చెందిన కొందరు శుభం కార్డు వేస్తున్నారు. పెళ్లికి ముందే కాబోయే భార్యభర్తలు భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ పరిస్థితులపై పూర్తిగా చర్చించాకే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న క్రమంలో.. దీనికి మరింత అడ్వాన్సుగా కొన్ని జంటలు భవిష్యత్‌లో పిల్లలు కనాలా? వద్దా? అనే అంశం గురించి సైతం పెళ్లికి ముందే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు పెద్దవాళ్ల సమ్మతిని సైతం కోరడం లేదు. ఆర్థికపరంగా స్టేబుల్‌గా ఉంటేనే పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నారు. లేదంటే పిల్లలు వద్దు అని మ్యూచువల్‌గా నిర్ణయం తీసేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులతో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు తప్ప.. పిల్లల గురించి వారికి ఆలోచన ఉండటం లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పరంగా స్ట్రాంగ్‌గా ఉండేందుకు రాత్రిపగలు కష్టపడపడుతున్నారు. అలా చేసిన సేవింగ్స్‌తో సొంతంగా ఇళ్లు, కారు, ఏడాదిలో రెండు నుంచి మూడు సార్లు నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటువంటి సంప్రదాయాన్నే ‘డింక్స్’ (DINKs) కల్చర్ అంటారు. విదేశాల్లో పుట్టిన ఈ డింక్స్ సంస్కృతి క్రమంగా భారతదేశంలోనూ వేగంగా విస్తరిస్తోందని ఇటీవల విడుదలైన ‘లాన్సెట్ నివేదిక’ స్పష్టంచేసింది. = సాయికుమార్​కట్ట

డింక్స్​అంటే ఏమిటి?

‘డ్యుయల్​ఇన్‌కమ్ నో కిడ్స్’.. భార్యాభర్తల ఇద్దరి సంపాదన.. కానీ, వీరు పిల్లలను కనేందుకు ఆసక్తిని చూపించరు. దీనినే సింపుల్‌గా ‘డింక్స్’ అని పిలుస్తారు. ఇది 1970-80లలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎల్‌ఎం‌హెచ్‌సీ ఆర్థిక నిపుణులు అజా ఎవాన్స్ అభిప్రాయం మేరకు.. ‘వివాహ బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సంతానం, ఆర్థిక పరమైన బాధ్యతలు (రుణాలు) లేకుండా స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లు జీవించడమే డింక్స్ లైఫ్’. ఇటువంటి వ్యక్తులు తమ పర్సనల్ లైఫ్‌ను భాగస్వామి లేదా అత్యంత సన్నిహితులు, స్నేహితులు, కుటుంబంతో గడిపేందుకు మాత్రమే ఇష్టపడుతారు. విదేశీ ప్రయాణం, నచ్చిన ప్రదేశాలను వీక్షించేందుకు ఫ్రీ టైంను కేటాయిస్తుంటారు. ఎవరి కోసమో, ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము జీవించేందుకు ప్రయత్నిస్తుంటారు. భార్యభర్తలు ఇద్దరూ డబ్బులు సంపాదించి వారి అభిరుచులు, ఆనందం కోసం మాత్రమే ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి కల్చర్ మొన్నటివరకు అభివృద్ధి చెందిన, ఆర్థికపరంగా బలమైన దేశాల్లో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు తాజాగా భారత్‌లోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నది.

ఇలా మారడానికి కారణలేంటి?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థికపరమైన మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. ఇక ఆర్థికపరమైన అంతరాలు నానాటికీ పెరిగిపోవడమే డింక్స్ పరిస్థితులకు అద్దం పడుతున్నది. ముఖ్యంగా అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా లాంటి దేశాల్లో పెరుగుతున్న ఖర్చులు భారంగా పరిణమిస్తు్న్నాయి. కేవలం భార్యాభర్తలు ఇద్దరు కలిసి బతకడమే భారం అవుతున్న ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచి, వారికి నచ్చిన చదువులకు అయ్యే ఖర్చులను ఊహించుకుంటేనే యువత హడలిపోతున్నది. దీంతో పేరెంట్స్ ముఖ్యంగా ‘మిడిల్ క్లాస్’ వారు తమ జీవితమంతా రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు కట్టడమే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం కావాల్సి వస్తున్నది. ఫలితంగా ఒత్తిడికి లోనై, మానసిక ఆందోళన, కోరికలు చంపుకుని బతకాల్సి వస్తుందని వాపోతున్నారు. అందుకే ఎంతకాలం జీవించి ఉంటామో తెలియని ప్రస్తుత జనరేషన్‌లో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు ఈ డింక్స్ జంటలు. అందుకే పిల్లలు, కుటుంబం అనే బంధాలకు నేటితరం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కుటుంబం.. ఫైనాన్షియల్ సైకిల్

మన దేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ మధ్యకాలంలో వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, సింగిల్ లైఫ్ కంటే ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక పటిష్టత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక ఇంట్లో ఐదుగురు సంపాదిస్తే అందులో ఇద్దరి సంపాదనను ఇంటిపెద్ద ఖర్చులకు వినియోగించి మిగతాది సేవింగ్స్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటివి చేసి కుటుంబ ఆదాయాన్ని మరింత పెంచేవారు. అటువంటి సందర్భాల్లో ఇంట్లో ఎంతమంది సంతానం ఉన్నా నడిచేది. అప్పట్లో ఖర్చులు తక్కువగా ఉండటం కూడా అలా వారికి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గతంలోని పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. ఈ మధ్యకాలంలో పెళ్లైన వెంటనే కుటుంబాలకు దూరంగా ఉద్యోగరీత్యా, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కొత్త జంటలు వేరే కాపురాలు పెడుతున్నాయి. ఫలితంగా సంపాదన అంతా ఒకే దగ్గర జమ కావడం లేదు. దీంతో విచ్చలవిడిగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒకే వ్యక్తి సంపాదిస్తే నలుగురు కూర్చొని తినే రోజులివి. అందుకు ఉన్నత చదువులు, చదువుకు తగ్గ జాబ్ దొరక్కపోవడం, నిరుద్యోగం కూడా కారణం కావొచ్చు. అలాంటప్పుడు భార్యాభర్తలు సర్వైవ్ కావడమే పెద్ద సమస్య. ఇక పిల్లల్ని కనడం తలకు మించిన భారంగా మారిందని డింక్స్ జంటలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికాలో బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన స్డడీ ప్రకారం.. 2015లో పుట్టిన ఒక బిడ్డను 17 ఏళ్లు వచ్చే వరకు పెంచాలంటే దాదాపు (3 లక్షల యూఎస్ డాలర్లు)లకు పైగా ఖర్చవుతుంది. ఇక లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అంత ఖర్చును భరించలేరు. పిల్లలు వారి చదువులు, హాస్పిటల్ బిల్లులకే డబ్బంతా ఖర్చయితే మా పరిస్థితి ఏంటని నేటితరం అధికంగా ఆలోచిస్తున్నది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకే రిటైర్ అయ్యాక పెన్షన్ రావడం లేదు. అలాంటిది ప్రైవేట్ జాబ్ చేసేవారి సంపాదన ప్రస్తుతానికే సరిపోతుంది. మరి భవిష్యత్ సంగతి ఏంటి? అనేది వారి మదిలో మెదులుతున్న అతిపెద్ద ఆందోళన. అందుకే పిల్లలు వద్దనుకుంటున్న వారిలో దాదాపు 61 శాతం మంది ఆలోచన ఇదే విధంగా ఉన్నట్లు తేలింది.

స్వేచ్ఛ, పర్యావరణానికి మేలు చేస్తున్నాం

ప్రస్తుత రోజుల్లో పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం మనిషే. పర్యావరణ కాలుష్యం భవిష్యత్ తరాలకు పెనుసవాల్‌గా మారింది. అయితే, కొందరు మాత్రం ప్రకృతి మీద ప్రేమతో పిల్లలను కనడం లేదని చెప్పుకుంటున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2021లో చేసిన సర్వే ప్రకారం.. 18 నుంచి 49ఏళ్ల వయస్సు ఉన్న డింక్ జంటల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో పిల్లలను కనడం లేదని వెల్లడించారు. ఇక హారిస్ ఇంటరాక్టివ్ అండ్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. దాదాపు 18 శాతం మంది యువకులు వ్యక్తిగత స్వేచ్చ కోసమే పిల్లలను కనడం లేదని పేర్కొన్నారు. పిల్లలు పుడితే బాధ్యతలు పెరిగే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, ప్రైవేట్ స్పేస్ అస్సలు ఉండని చెప్పుకొచ్చారు.

అమెరికాలో 43 శాతానికి పెరిగిన డింక్స్

డింక్స్ కల్చర్ ప్రస్తుతం అమెరికాలో తారస్థాయికి చేరుకుంది. 2022 నాటికి 43 శాతం అమెరికన్ జంటలు పిల్లలకు దూరంగా ఉన్నారు. పదేళ్ల కిందట 36 శాతంగా ఉన్న ఈ డింక్స్.. ఏకంగా 7శాతం పెరిగి 43 శాతానికి చేరింది. మరి కొన్నేళ్లలో ఈ డింక్స్ 50 శాతానికి చేరుకునే చాన్స్ ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. కేవలం ఒక్క అమెరికాలోనే కాదు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతున్నా ఈ డింక్స్ కల్చర్ వలన 2050-2100 నాటికి 90 దేశాల్లో వేగంగా జనాభా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని.. ముఖ్యంగా యూరప్ దేశాలు, లాటిన్ అమెరికాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ డేటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. అయితే, ఆఫ్రికాలో మాత్రం జనాభాలో పెరుగుదల నమోదు కావొచ్చని పేర్కొంది. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో డింక్స్ కల్చర్ తక్కువగా ఉండటమే కారణం.

సౌత్ కొరియా, చైనా, జపాన్‌లోనూ

ఆర్థికంగా బలమైన దేశాలైన సౌత్ కొరియా, చైనా, జపాన్ దేశాల్లో ప్రస్తుతం జననాల రేటు వేగంగా పడిపోతుంది. ఆయా దేశాల్లో విపరీతంగా లివింగ్ కాస్ట్ పెరగడం, విపరీతమైన ఖర్చుల కారణంగా అక్కడి యువతీ యువకులు పెళ్లికి నో చెబుతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లలు కనేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్నా నేటితరం ముందుకు రావడం లేదు. 2023లో కొరియాలో జననాల రేటు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే కొరియాలో 2100 నాటికి దేశంలోని 51 మిలియన్ల జనాభా సగానికి తగ్గిపోతుందనే భయాలు నెలకొన్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లల సంరక్షణ కోసం 270 బిలియన్ల అమెరికన్ డాలర్లు కేటాయించింది. బిడ్డ పుడితే పేరెంట్స్‌కు 1,510 డాలర్లు ఇస్తున్నారు. 2022లో 0.72 ఉన్న సౌత్ కొరియా జననాల రేటు రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని అంచనా. ఆ దేశ ఎదుగుదల, అభివృద్ధి కోసం అక్కడి ప్రజలు వర్క్ హాలిక్స్‌ మారి కుటుంబం, పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించకపోవడమే జనాభా పతనానికి కారణమని తెలుస్తోంది. ఇక గతంలో చైనా ‘వన్ చైల్డ్’ పాలసీని తీసుకొచ్చింది. అదే ఆ దేశం పాలిట భస్మాసుర హస్తమైంది. ఇప్పుడు ఆ దేశంలో (141.22) కోట్ల జనాభా ఉండగా.. అందులో 51 శాతం మంది 25-29 ఏళ్ల వయస్సు, 18.4శాతం 30-34 ఏళ్ల వయస్సు, 8 శాతం 35–39 ఏళ్ల వయస్సు వారు పెళ్లికాని వారే ఉన్నారు. చైనాలో ఏజ్ బార్ అయినా నేటితరం పెళ్లికి నో చెబుతున్నారు. మరికొందరు పెళ్లికి ఓకే చెప్పినా పిల్లలు కనేందుకు మాత్రం నో చెబుతున్నారు. 2040 నాటికి ఆ దేశంలో 28 శాతం జనాభా అనగా.. 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 39 కోట్లకు చేరుకోవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో భవిష్యత్‌లో మానవ వనరుల కోసం ఇద్దరు పిల్లలను కనాలని చైనీస్ ప్రభుత్వం పిలుపునిచ్చినా, ప్రోత్సహకాలు ఇస్తామన్నా కపుల్స్ ముందుకు రాక పోవడం గమనార్హం. జపాన్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఆ దేశంలోనూ వయోవృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

భారత్‌లోనూ పెరుగుతున్న కల్చర్

మనదేశంలోనూ డింక్స్ కల్చర్ వేగంగా పెరుగుతున్నది. ప్రస్తుతం మనదేశంలో యువశక్తి అధికంగా ఉంది. కానీ, ఇక్కడ నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారింది. దానికి తోడు చాలీచాలనీ జీతాలు, క్రమంగా పెరుగుతున్న అద్దెలు, స్కూల్ ఫీజులు, ఇతరత్రా ఖర్చులు తడిసిమోపెడు అవుతుండటంతో ఇక్కడి యువ జంటలు సైతం పిల్లలు కనేందుకు నో అంటున్నారు. ముందుగా ఫైనాన్షియల్‌‌గా సెటిల్ అయ్యాకే పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నార్త్‌తో పోలిస్తే దక్షిణ భారతంలోని మెట్రో పాలిటిన్ సిటీస్‌లో ఈ కల్చర్ అధికంగా కనిపిస్తోంది. గతంలో ఇంటికి నలుగురు పిల్లలు ఉండగా.. అది కాస్త మొన్నటివరకు ఇద్దరు.. ఇప్పుడు ఒక్కరే చాలు అనే స్థాయికి చేరింది. లాన్సెట్ నివేదిక ప్రకారం.. 1950లో భారత్‌లో సంతానోత్పత్తి రేటు 6.18 శాతంగా ఉండగా.. ఇది 1980 నాటికి 4.60కు చేరింది. ఇక 2021లో 1.91శాతానికి తగ్గింది. ఈ రిపోర్టు మేరకు ఇది వృద్ధాప్య జనాభాకు దారి తీస్తుంది. ఇందులో 5 మంది భారతీయులలో ఒకరు సీనియర్ సిటిజన్‌గా ఉంటారు. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపే శ్రామికశక్తిని తగ్గించడానికి దారి తీస్తుంది. కాగా, భారత్‌లో నెమ్మదిగా పిల్లలను కనే వారి సంఖ్య తగ్గుతూ ఉన్నా ప్రపంచ జనాభాలో ప్రస్తుతం భారత్ (141.72కోట్లకు పైగా) నెంబర్ 1 స్థానంలో ఉంది.

డింక్స్‌తో కలిగే నష్టాలు

డింక్స్ కల్చర్ ప్రస్తుతం బాగానే అనిపించినా.. వయస్సు పెరుగుతున్న కొద్ది భారంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వయసు వచ్చాక నా అనుకునే వాళ్లు (సంతానం) లేకపోతే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరు తోడుంటారు సంతానం మినహా. మరో సందర్భంలో ఒకవేళ డింక్స్ భాగస్వాముల్లో ఎవరైనా ఒకరు మరణిస్తే ఎలా? వారికి సంతానం కూడా ఉండదు. ఒంటరిగా ఉన్నవారికి కడవరకు ఎవరు తోడుంటారు. ఒంటరితనం వేధించడం ఖాయం. అలా ఎన్నిరోజులు ఒక్కడే ఎవరి సపోర్టు లేకుండా లైఫ్ లీడ్ చేయగలరు. అందుకే పిల్లలు ఉండటం బెటర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరగా కీలకమైనది.. డింక్స్ కపుల్స్ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఇద్దరు త్వరగా విడిపోవడానికి ఆస్కారముంది. ఎందుకంటే ఇద్దరూ స్వతంత్ర భావాలు కలిగిన వారే. అందుకే పిల్లలు ఉన్నట్టయితే వారికోసం అయినా వీరు విడిపోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు. దీంతో కష్టమోసుఖమో సంతానం కోసం కలిసే ఉంటారు. అప్పుడు డైవర్స్ కేసులు కూడా తగ్గే చాన్స్ ఉంటుంది. పిల్లలు పుట్టాక గొడవలు కూడా తగ్గి ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరిగే చాన్స్ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed