31000 ఏళ్ల నాటి అస్థిపంజరం.. సర్జరీతో కాలు తొలగించిన ఆనవాళ్లు

by srinivas |
31000 ఏళ్ల నాటి అస్థిపంజరం.. సర్జరీతో కాలు తొలగించిన ఆనవాళ్లు
X

దిశ, ఫీచర్స్ : ఇండోనేషియాలోని ఒక గుహలో పురావస్తు శాస్త్రవేత్తలు 31,000 ఏళ్లనాటి పురాతన మానవ అస్థిపంజరాన్ని వెలికితీశారు. అంతేకాదు దీని ఎడమ కాలు దిగువ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు గుర్తించారు. బోర్నియోలోని లియాంగ్ టెబో గుహలో ఈ స్కెలిటన్ కనుగొనబడగా.. గత అంచనాలకు భిన్నంగా కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే అధునాతన వైద్యపరిజ్ఞానం అందుబాటులో ఉందని ఈ సంఘటన సూచిస్తోంది.

ఈ అస్థిపంజరం బోర్నియోకు చెందిన ఒక యువకుడిదని భావిస్తుండగా అతని ఎడమ కాలులో మూడో వంతు భాగాన్ని కోల్పోయాడు. అయితే ఈ కాలి ఎముక నలిపివేయబడినట్లు కాకుండా శస్త్రచికిత్స ద్వారా సరైన పద్ధతిలో తొలగించినట్లు కనిపించింది. అధ్యయనం ప్రకారం బాలుడు శస్త్రచికిత్స నుంచి ప్రాణాలతో బయటపడటమే కాకుండా ఆ తర్వాత ఆరు నుంచి తొమ్మిదేళ్ల వరకు జీవించాడని అవుట్‌లెట్ తెలిపింది. పైగా ఎటువంటి ఇన్‌ఫెక్షన్ ఆనవాళ్లు లేకపోవడం వంటి అంశాలను పరిశీలించిన మీదట శస్త్రచికిత్సకు దీన్ని రుజువుగా నిర్ధారించారు పరిశోధకులు. విజయవంతమైన అవయవ విచ్ఛేదనానికి ఇది ప్రారంభ సాక్ష్యమని, ఉష్ణమండల ఆసియాలో కొన్ని ఆధునిక మానవ సమూహాలు నియోలిథిక్ వ్యవసాయ పరివర్తనకు చాలా కాలం ముందు అధునాతన వైద్య పరిజ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేశారని ఇది రుజువు చేస్తోంది.

గతంలో ఫ్రాన్స్‌లోని ఒక రైతు ఎడమ ముంజేయి మోచేయి పైన కత్తిరించబడిన 7,000 సంవత్సరాల పురాతన అస్థిపంజరంలో విచ్ఛేదనానికి సంబంధించి పురాతన సాక్ష్యం కనుగొనబడింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఇండోనేషియా సెంటర్ ఫర్ ఆర్కియాలజీ, లాంగ్వేజ్ అండ్ హిస్టరీతో కలిసి ఈ ప్రాజెక్ట్‌పై పని చేసింది. మొత్తానికి వ్యవసాయం, శాశ్వత నివాసాల్లో జీవనం ప్రారంభించడానికి చాలా కాలం ముందే మానవులు దెబ్బతిన్న అవయవాలను విజయవంతంగా కత్తిరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని పురావస్తు శాస్త్రవేత్త, ప్రాజెక్ట్ కో-లీడర్ మాక్సిమ్ అబెర్ట్ చెప్పారు.

Advertisement

Next Story