ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఎల్ఐసీ సంస్థ ఐపీఓకు రాకపోవచ్చు!

by Harish |
lic22
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోగా ఐపీఓకు వచ్చే అవకాశం లేదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సంస్థ విలువను అంచనా వేయడంలో ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, దీనివల్ల ఐపీఓ డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎల్ఐసీ ఐపీఓకు ఎంపికైన మర్చంట్ బ్యాంక్ అధికారి తెలిపారు. మొదట ఎల్ఐసీ, అనుబంధ సంస్థల స్థిరాస్తులు, సంస్థ పరిమాణం, అది అందించే పాలసీల విలువను అంచనా వేయడంలో సంక్లిష్టతలు ఉన్నాయని, వీటికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాతే మిగిలినవి కొనసాగుతాయన్నారు. విలువ అంచనా వేసిన తర్వాత కూడా అనేక నియంత్రణ ప్రక్రియలు ఉన్నాయని మర్చంట్ బ్యాంక్ అధికారి పేర్కొన్నారు.

ఐపీఓకు సెబీతో పాటు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ పరిశీలన అవసరమని దీనికి మరో ఏడు నెలల సమయం పట్టొచ్చన్నారు. ఈ క్రమంలో 2021-22 చివరి త్రైమాసికంలోపు ఐపీఓకు రావడం కుదరకపోవచ్చన్నారు. కాగా, ప్రభుత్వం 2021-22 పూర్తయ్యే నాటికి మొత్తం రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను లక్ష్యంగా ఉంది. ఇందులో ఎల్ఐసీ ఐపీఓనే కీలకం. ఎల్ఐసీ సంస్థ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే రూ. 8-10 లక్షల కోట్ల విలువైన కంపెనీగా నిలవనుంది. ఎల్ఐసీ ప్రస్తుతం రూ. 32 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.

Advertisement

Next Story