ఎల్ఐసీ ఉద్యోగుల జీతాలు పెంచేందుకు కేంద్రం సుముఖత

by Harish |
ఎల్ఐసీ ఉద్యోగుల జీతాలు పెంచేందుకు కేంద్రం సుముఖత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఐసీ ఉద్యోగులందరికీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఎల్ఐసీ సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిచేసే వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది. బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం. వేతనాలను పెంచాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఉద్యోగులకు ఇది శుభవార్తే. తాజా నివేదికల ప్రకారం..వేతన పెంపు 15-16 శాతం వరకు ఉండొచ్చని, కొందరు 20 శాతం పెంపును కూడా సూచించినట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రస్తుతం బీమా దిగ్గజం ఎల్ఐసీలో ఉన్న మొత్తం 1.14 లక్షల మంది ఉద్యోగులు లబ్దిని పొందనున్నారు.

ఈ వారంలో వేతన పెంపు విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇదివరకే ఎల్ఐసీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కాగా, 2017, ఆగష్టు నుంచి ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలను పెంచాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. ఎల్ఐసీ చరిత్రలోనే మొదటిసారిగా వేతన పెంపు వాయిదా పడింది. తాజా నిర్ణయంతో వేతన పెంపు ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా 18-20 శాతం మధ్య ఉంటుందని అంచనా. గతంలో ఎల్ఐసీ యాజమాన్యం 16 శాతం వేతన పెంపును అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా 25 శాతం ఉండాలని భావిస్తున్నారు. తాజా వేతన సవరణ ఎల్ఐసీ ఐపీఓ కంటే ముందే అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed