ఐపీఎల్‌లో వాళ్లు లేని లోటు తీర్చేందుకు..

by Shyam |
ఐపీఎల్‌లో వాళ్లు లేని లోటు తీర్చేందుకు..
X

దిశ, స్పోర్ట్స్: సిక్సు కొడితే ఫ్యాన్స్ కేరింతలు, బౌండరీ బాదితే కేకలు, వికెట్ తీస్తే గ్యాలరీల్లో సంబురాలు.. ఈసారి ఈ సందడి ఇండియన్ ప్రీమయర్ లీగ్ (IPL)లో ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. చడీ చప్పుడు లేని సీపీఎల్‌ (CPL)ను టీవీల్లో ప్రేక్షకులు కూడా చూడలేకపోతున్నారు. మరి క్యాష్ రిచ్ ఐపీఎల్‌ను సందడిగా మార్చడం ఎలా అనే అనుమానాలు నెలకొన్నాయి.

దీనికి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ (Star Sports), బీసీసీఐ (BCCI)ఒక వ్యూహం రచించబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి లేపోవడంతో వారు లేని లోటు తీర్చేందుకు సరికొత్త టెక్నాలజీ (Technology)ని ఉపయోగించుకోనున్నారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ( English Premier League) మ్యాచ్‌ల సందర్భంగా ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్యాన్స్, ప్లేయర్ల మధ్య అనుసంధానం చేయబోతున్నారు. ఈ విషయంపై స్టార్ స్పోర్ట్స్‌ (Star Sports) కానీ, బీసీసీఐ (BCCI) కానీ ఇంత వరకు పెదవి విప్పలేదు. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు సీఈవో వెంకీ మైసూర్ ఈ టెక్నాలజీ గురించి చెప్పుకొచ్చారు.

ఎల్ఈడీల్లో ఫ్యాన్స్ సందడి

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL)మాదిరిగానే గ్యాలరీల్లో ఎల్ఈడీ వాల్స్ (LED Walls) ఏర్పాటు చేస్తారు. అలాగే ప్లేయర్లకు సమీపంలో కెమెరాలు కూడా ఉంటాయి. లైవ్ మ్యాచ్ జరిగే సమయంలో ఫ్యాన్స్ సందడిని ఎల్ఈడీల్లో ప్రసారం చేస్తారు. అంతేకాకుండా వాళ్లు ఆటగాళ్లతో అనుసంధానం కూడా అవ్వొచ్చు.

అలాగే, ఆటగాళ్లు తమ ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెట్టవచ్చు. ఈపీఎల్‌ (EPL)లో విజయవంతమైన ఈ వ్యవస్థను ఐపీఎల్‌ (IPL)లో ఉపయోగించబోతున్నట్లు వెంకీ మైసూర్ వెల్లడించారు. గ్యాలరీల్లో ప్రేక్షకులు కూర్చుంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో ఎల్ఈడీ (LED) ద్వారా కూడా అలాగే ఉంటుందని వెంకీ చెప్పుకొచ్చారు. ప్లేయర్లు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేక్షకుల వైపు చూసి చేతులు ఊపవచ్చు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా తమ అభిమాన క్రికెటర్ వైపు చూసి చేతులు ఊపి సందడి చేయవచ్చు. ఇదంతా టెక్నాలజీ పుణ్యమే.

విజయవంతమైన టెక్నాలజీనే..

ప్రముఖ సాకర్ లీగ్స్ (Soccer leagues) అయిన ప్రీమియర్ లీగ్, డానిష్ లీగ్ (Premier League, Danish League) సహా పలు ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌ల (Football league matches) సందర్భంగా ఈ సాంకేతికతను ఉపయోగించారు. ఇళ్లలో ఉన్న ఫ్యాన్స్ సందడిని ఏకంగా స్టేడియంలో ప్రసారం చేశారు. ఇంట్లో ఉన్న ప్రేక్షకులు కూడా స్టేడియంలో ఉన్నట్లే అనుభూతి పొందొచ్చని ఒక టెక్నాలజీ నిపుణుడు చెప్పారు.

ప్రతి ఫుట్‌బాల్ క్లబ్‌ (Football Club)ల నుంచి 16మంది అభిమానులను టెక్నాలజీతో అనుసంధానం చేసి వారి లైవ్ ఫీడ్‌ను స్టేడియంలో ప్రసారం చేశారు. వాళ్లు ఆటగాళ్లతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు. డానిష్ ప్రిమియర్ లీగ్‌ (Danish League)లో అయితే జూమ్ యాప్ ద్వారా ఫ్యాన్స్, ఆటగాళ్ల మధ్య అనుసంధానం కల్పించారు.

దీన్నే తిరిగి బ్రాడ్ కాస్టర్ టీవీల్లో ప్రసారం చేశారు. అయితే, ఐపీఎల్‌ (IPL)లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారనే విషయం బీసీసీఐ (BCCI)ఇంకా స్పష్టం చేయలేదు. కొన్ని వారాల క్రితం డిస్నీ స్టార్ (Disney Star)ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ ఈ టెక్నాలజీ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్‌ (IPL)ను మరింత రసవత్తరంగా మార్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. ఫ్యాన్స్ ఇంట్లో ఉంటూనే టీవీల్లో కూడా కనిపించే ఏర్పాట్లు చేయబోతున్నారు. అయితే ఎవరికి ఈ పరిజ్ఞానం అందించాలనే విషయం మాత్రం ఆయా ఫ్రాంచైజీలే (Franchisees) నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story