ఇదేం గోసరా బాబు.. హుజురాబాద్ ఓటర్లకు కొత్త తలనొప్పి

by Sridhar Babu |   ( Updated:2021-10-18 09:48:19.0  )
Huzurabad by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: టక్ టక్ టక్.. అంటూ శబ్దం వినిపించడంతో ఇంట్లో ఉన్న వాళ్లు ఎవరా అని తలుపు తీశారు. మీరు మా పార్టీకే ఓటేయండి అంటూ అభ్యర్థించి ఓ పార్టీ బృందం వెళ్లిపోయారు. తలుపు గడియ పెట్టి సేద తీరుదామని ఇంట్లోకి వెళ్లగానే మళ్లీ తలుపు చప్పుడు అయింది. ఎవరా అని వచ్చి తలుపు తీయగానే మా పార్టీకి ఓటు వేయాలని మరో బృందం వచ్చి అభ్యర్థించి వెళ్లిపోయింది. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు పది నుండి పదిహేను గ్రూపులు ఇంటికొచ్చి ఓటేయాలని కోరి వెళ్లి పోతున్నాయి. ఉప ఎన్నికలు సంగతేమో కానీ పోలింగ్ పూర్తయ్యే వరకు తమకు నిద్ర కూడా ఉండదేమోనని హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లు కలత చెందుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో వారి ప్రచారంతో ఇక్కడి ప్రజలు అసహనానికి గురవుతున్నారు.

తమ పార్టీ ఆభ్యర్థే గెలవాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు ఇంటింటి ప్రచారం కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ టీమ్స్ ఒక్కో ఇంటికి తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నాయి. శృతి మించిన ఈ ప్రచార బృందాలతో సగటు ఓటరు విసుగు చెందిపోతున్నాడు. ఊరూ వాడా బహిరంగ సభలను మరిపిస్తూ నేతలు ప్రచారం చేస్తుంటే చాలదన్నట్టు ఇంటింటికి తిరిగి మరీ ప్రచారాలు చేసి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. తమ ఇళ్లలో ఎలాంటి పరిస్థితి నెలకొందో గమనించకుండా ఆయా పార్టీల ప్రచార బృందాలు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్ది ప్రచారం చేసే టీమ్‌లతో మరీ ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.

పల్లె, పట్నం వదలకుండా

నియోజకవర్గంలోని పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ప్రచార బృందాలు ఏ ఇంటినీ వదలకుండా తిరుగుతున్నారు. దీంతో చాలా మంది ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోలింగ్ తేదీ సమీపించిన తర్వాత ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేవారని, ఆయా గ్రామాలు, కాలనీకి చెందిన వారు ఈ ప్రచార బృందాల్లో ఉండేవారని ఇప్పుడు వస్తున్న కొత్త వ్యక్తులు ఎవరో తెలియడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కూడా ఓటర్ల బాధను గమనించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed