అధికారులను చూస్తే జాలేస్తోంది.. వామన్ రావు ఆడియో లీక్

by Sridhar Babu |   ( Updated:2023-03-20 21:31:27.0  )
Lawyer Vaman Rao
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య రాష్ట్రంలో దుమారం రేగుతోంది. ఇప్పటికే కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యాయవాది వామన్ రావు మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ‘‘కమిషనర్ వద్ద నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు, కలెక్టర్ నుంచి అటెండర్ వరకు అధికారుల తీరు చూస్తే జాలి వేస్తోంది. ప్రభుత్వంలో పని చేస్తున్నారా? నాయకుల కోసం పని చేస్తున్నారా? అని ఓ భయంకరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఏ అధికారికి ఫోన్ చేసినా కనీస బాధ్యతగా స్పందించాలనే విషయం మర్చిపోయారు. గతంలో దరఖాస్తు ఇస్తే తక్షణ చర్యలు, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకును వ్యవస్థ ఉండేది. కానీ ఈరోజు జీతం కోసం పనిచేస్తున్న అధికారులను చూస్తే జాలేస్తోంది. శిలాఫలకాలపై పేర్ల కోసం కాదు కొట్లాడవలసింది, ప్రజా సమస్యలపై కొట్లాడడం నేర్చుకోండి. ప్రతి పక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న ప్రజా సమస్యలే ముఖ్యమైన ఆలోచన చేయండి. అధి ఒక రామాలయమే కావచ్చు, లేక మంథని క్షేత్రమే కావచ్చు మరేదైనా కావచ్చు. ఈరోజు అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలంటనే ప్రజలు భయంలో ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి.’’ అంటూ హైకోర్టు అడ్వకేట్ వామన్ రావు మాట్లాడిన ఆడియో లీక్ అయింది. రెండ్రోజుల క్రితం వామన్ రావు ఈ ఆడియో రికార్డు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed