ఎలక్ట్రిక్ స్కూటర్లను నిషేధించిన పారిస్.. కారణం ఏంటంటే

by Prasanna |   ( Updated:2023-04-07 09:18:33.0  )
ఎలక్ట్రిక్ స్కూటర్లను నిషేధించిన పారిస్.. కారణం ఏంటంటే
X

దిశ, ఫీచర్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇ-స్కూటర్లు, ట్రోటినెట్స్, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఫ్రెంచ్ రాజధాని పారిస్ ఇందుకు భిన్నంగా వెళ్తోంది. ఇప్పటికే నగరాల్లో ఇ-బైకులను నిషేధించింది. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ నిబంధన అమలు కానుంది. పర్యావరణ పరిరక్షణపై తమ దేశానికి చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, ఓటింగ్ రూపంలో సేకరించిన ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పారిస్ నగర మేయర్ హిడాల్‌గో తెలిపారు. ఇ- స్కూటర్లను నిషేధించాలన్న విజ్ఞప్తులు తరచూ వస్తుండటంతో ఫ్రాన్స్ ఇటీవల 20 జిల్లాల్లో నిషేధించాలా వద్దా అనే విషయంలో ఓటింగ్ నిర్వహించింది. నిషేధానికి అనుకూలంగా అత్యధికంగా 91.77 శాతం ఓట్లు నమోదయ్యాయి. కేవలం పారిస్ సిటీలోనే 1.38 మిలియన్ల మంది ఓటర్లలో 1,03,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రీజన్ ఇదే..

2018లో ఇ-స్కూటర్‌లు లేదా ట్రోటినెట్‌లను ప్రవేశపెట్టడంలో పారిస్ అగ్రగామిగా ఉంది. కాలుష్య రహితమైన పట్టణ రవాణాను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా యాక్సెస్ చేయగల మైక్రో-వెహికల్స్‌ వల్ల పారిస్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతేడాది ఫ్రెంచ్ రాజధానిలో ఇ-స్కూటర్ల వల్ల 459 ప్రమాదాలు జరిగాయి. వీటిలో మూడు ప్రాణాంతకమైనవిగా ఉన్నాయి. నాలుగేళ్లుగా ఇ-స్కూటర్‌లను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రమాద బాధితుల తరఫున పోరాడుతున్న అపాకౌవి స్వచ్ఛంద సంస్థ కో ఫౌండర్ ఆర్నాడ్ కీల్‌బాసా తెలిపారు. తన భార్య కూడా ఇ-స్కూటర్ ప్రమాదానికి గురైందని అతను పేర్కొన్నాడు. అంతేగాక ఇ-స్కూటర్ యూజర్స్ రోడ్డు భద్రతా నియమాలను తరచూ ఉల్లంఘిస్తుండటం, ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుండటం వల్ల తలెత్తే ఇబ్బందులతో విసుగెత్తిన ఇక్కడి ప్రజలు నిషేధం వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఇవి కూడా చదవండి: సడెన్‌గా ట్రైన్ బ్రేక్ ఎందుకు వేయరో.. వేస్తే ఏమౌతుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed