టెక్నికల్ ఎర్రర్స్‌కు కేరాఫ్ ‘ధరణి’.. రెచ్చిపోతున్న అక్రమార్కులు

by Anukaran |   ( Updated:2021-06-07 22:46:43.0  )
టెక్నికల్ ఎర్రర్స్‌కు కేరాఫ్ ‘ధరణి’.. రెచ్చిపోతున్న అక్రమార్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనకు సర్వం ‘ధరణి’ పోర్టల్. మానవ ప్రమేయం లేని వ్యవస్థ. ఇలా దరఖాస్తు చేసుకుంటే అలా పని జరిగిపోతుంది. ఇప్పుడీ సౌలభ్యం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. ధరణిలోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని భూ దందాకు తెగబడుతున్నారు. హైదరాబాద్​నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను లక్ష్యంగా చేసుకొని అవినీతి, అక్రమాలకు తెర తీశారు. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి భూమి హక్కులను హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారు. పట్టాదారుడు చనిపోతే వారి భూములపై హక్కులను సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తొలుత ల్యాండ్​మ్యాటర్స్​గ్రీవెన్స్ లో ఆధార్​సవరణ పేరిట మార్పునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఆధార్​కు బదులుగా వీరి నంబరును ఎంట్రీ చేయించుకోవడం, ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకునేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరులో జరిగిన ఈ ఘటన ధరణి పోర్టల్‌లో డేటా నిక్షిప్తం సురక్షితమేనా? అన్న సందేహాలకు తావిస్తోంది. అలాగే మానవ ప్రమేయం లేకుండానే దరఖాస్తుల పరిశీలన చేసి రికార్డులను సవరించే సరికొత్త రెవెన్యూ పాలన సరియైందేనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోర్జరీ పత్రాలు సమర్పిస్తే ల్యాండ్​మ్యాటర్స్​గ్రీవెన్స్‌లో తహశీల్దార్ గుర్తించలేదు.

ఆయన నివేదిక సమర్పిస్తే సంగారెడ్డి జిల్లా కలెక్టర్​కూడా ఆమోదించినట్లు తెలిసింది. కానీ అసలైన పట్టాదారుడి వారసులు దరఖాస్తు చేసుకోవడం ద్వారానే అక్రమార్కుడి దందా వెలుగులోకి వచ్చింది. రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు అక్రమార్కులు వేసిన వలలో అధికారులు చిక్కారు. వారసులు దరఖాస్తు చేసుకోవడంతో పత్రాలు ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైంది. వెంటనే అక్రమార్కుడిపై క్రిమినల్​చర్యలు తీసుకోవాలని పటాన్​చెరు తహశీల్దార్​సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారసుల రాక మరో వారం రోజులు ఆలస్యమైతే నకిలీ పట్టాదారుడే ఆ భూమిని మరొకరికి అమ్మేసేవాడు. ఆ తర్వాత కొనుగోలుదారుడు కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందడం, ధరణి పోర్టల్​లో తన పేరు నమోదు కావడం వంటి ప్రక్రియలు వేగంగా జరిగిపోయేవి. ఆ తర్వాత అసలైన పట్టాదారుల సమస్యకు పరిష్కారం ధరణి పోర్టల్​లో లేదు. న్యాయస్ధానానికి వెళ్లి హక్కులను రుజువు చేసుకోవడమే అనివార్యంగా మారేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఇక కోర్టుకు వెళ్తే ఎంత కాలం పడుతుందో తెలిసిందే. న్యాయమైన హక్కులను కాపాడుకోవడం, పొందడం అసలైన హక్కుదారులకు కష్టంగా మారనుంది. ధరణి పోర్టల్​ద్వారా అందే ప్రతి దరఖాస్తుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే పరిష్కరిస్తే మోసాలకు ఆస్కారం ఉందని మరోసారి రుజువైంది. ఐతే వారసులు తమ భూమిపై హక్కులు కల్పించాలని రావడం వల్లే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా రికార్డులను పరిశీలించుకోని వారు, పట్టాదారుడు చనిపోయినా దరఖాస్తు చేసుకోని భూములపై ఎన్ని మార్పులు జరిగాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అక్రమార్కడి మోసమిలా..

– పటానుచెరు మండలం భానూరులో ఖాతా నం.412లో ఆధార్​నంబరు 720148902248 ను ఎంట్రీ చేయాలని ధరణి పోర్టల్​ద్వారా తోట హనుమంతరావు ఏప్రిల్​19న దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తోట హనుమంతరావు 2019 ఆగస్టు 9న చనిపోయారని, ఆయన పేరిట ఉన్న భూములకు సక్సెషన్(వారసులకు పంపిణీ– పౌతి) చేయాలంటూ మే 6వ తేదీన ఓ దరఖాస్తు వచ్చింది. రెండు దరఖాస్తులు ఒకటే భూమి కోసమని తేలింది. ఇరుపార్టీలు అదే భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

– తోట కనకదుర్గ సమర్పించిన దరఖాస్తును, డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆమె భర్త హనుమంతరావుకు సంబంధించిన ఆధార్​కార్డు, డెత్​సర్టిఫికేట్, లీగల్​హెయిర్​సర్టిపికేట్(వారసత్వ ధృవీకరణ పత్రం), రిజిస్టర్డ్​డాక్యుమెంట్లు సరియైనవిగా గుర్తించారు.

– ఆధార్​నంబరును సరిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న తోట హనుమంతరావు దరఖాస్తులో సరైన పత్రాలు లేవు. ఆయన సమర్పించిన ఆధార్​కార్డు సరైంది కాదని తేలింది. ఆధార్​నంబరును సివిల్​సప్లయి డేటాను చెక్​చేశారు. కానీ ఆయన జత చేసిన రేషన్​కార్డు నం.396410093934 లో ఆధార్​నంబరును సరి చూశారు. బోగస్​అని స్పష్టమైంది.

– దరఖాస్తులో జత చేసిన ఆధార్​నం.720148902248 గుర్రం పాండుగా తేలింది. సదరు నంబరు ద్వారా నవంబరు 2020లో కూడా బయోమెట్రిక్​ద్వారా పీడీఎస్ బియ్యం తీసుకున్నట్లు తేలింది. ఆయన పేరును తోట హనుమంతరావుగా ఆధార్‌లో దిద్దారు. అధికారులను తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి, సంతకాలను ఫోర్జరీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గుర్రం పాండుపై క్రిమినల్​చర్యలు తీసుకోవాలని పటాన్​చెరు తహశీల్దార్​పోలీసు స్టేషన్‌లో సోమవారం కేసు పెట్టారు.

ఎలా చేశారు..?

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరులో సర్వే నం.497/ఇ లో 0.20 ఎకరాలు ఉంది. పట్టాదారు పాసు పుస్తకం టి09180130233, ఖాతా నం.412 ద్వారా అన్ని హక్కులు కలిగి ఉన్నారు. ఆయన చనిపోగా భార్య కనకదుర్గ, వారసులు రవికుమార్, శ్రీనివాస్, దీప్తిరావులు పౌతి చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరు మల్కాజిగిరి మేడ్చల్​జిల్లా బాచుపల్లి హిల్ కౌంటీలో ఉంటారు. ఈ మేరకు ఆయన భార్య కనకదుర్గ డెత్​సర్టిఫికేట్, వారసుల జాయింట్​అగ్రిమెంటును సమర్పించారు. ఐతే హనుమంతరావు చనిపోయిన విషయాన్ని గుర్తించిన అక్రమార్కులు భూమిని హస్తగతం చేసుకునేందుకు కుట్ర పన్నారు. ఏకంగా ఆధార్​సవరణ అంటూ ధరణి పోర్టల్‌లోని ల్యాండ్​మ్యాటర్స్​గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకొని తతంగాన్ని నడిపించారు. ​

ధరణిని సమీక్షించాల్సిందే..

అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కార కేంద్రంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. కానీ, డాక్యుమెంట్ల ఆధారంగానే పరిష్కరించడం వల్ల ఇలాంటి బోగస్​పట్టాదారులు పుట్టుకొస్తారని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు సమర్పించిన డాక్యుమెంట్లను ఆన్​లైన్​వ్యవస్థ అసలా? నకిలా? అన్నది ఎంత వరకు గుర్తిస్తుంది? అందుకే క్షేత్ర స్థాయిలో దర్యాప్తు అనేది అనివార్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరతను తీర్చడం వల్ల ఇలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవచ్చు. ధరణి పోర్టల్​మాడ్యూల్స్​ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలన్నారు. ఇప్పటికే ఇలాంటి అక్రమార్కులెందరు విజయం సాధించారో అంతుచిక్కడం లేదన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు అక్రమాలకు తావులేని రెవెన్యూ వ్యవస్థ రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

Next Story