అభ్యర్థులకు కరువైన మద్దతు

by Shyam |
అభ్యర్థులకు కరువైన మద్దతు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఒకప్పుడు ఎన్నికలేవైనా కాంగ్రెస్‌ పార్టీదే హవా ఉండేది. జనం గుంప గుత్తంగా ఓటు వేసేవారు. నియోజకవర్గాలన్నీ కంచుకోటలుగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేమైందని నగర వాసులు చర్చించుకుంటున్నారు. రాష్టంలో, గ్రేటర్ హైదరాబాద్ లో సరైన నాయకత్వం లేకపోవడంతోనే కాంగ్రెస్ డీలా పడిందా..? లేకపోతే అధికార పార్టీకి తలొగ్గిందా..? అనే అనుమానాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటనే విషయం అర్థం కావడం లేదని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేందుకు నాయకులే లేకపోవడం గమనార్హం.

నగరంలో పెద్దదిక్కు కరువు..

నగరంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గ్రేటర్‎లో 150 డివిజన్ లున్నాయి. ఇందులో మల్కజిగిరి పార్లమెంట్ పరిధిలో 38, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 17 డివిజన్లు ఉండగా మిగిలినవి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జిలే లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇంటికే పరిమితమైన ఇన్ చార్జిలు

గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరిశీలకులుగా వచ్చిన నేతలు ఇంటికే పరిమితమవుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కు షబ్బీర్ అలీ, మల్కాజిగిరికి బట్టి విక్ర మార్క, సికింద్రాబాద్ కుసుమ కుమార్ ల ను పార్టీ ఇన్ చార్జి లుగా వేసినప్పటికీ ఎక్కడ ప్రణాళిక ప్రకారం ప్రచారాలు లేవు.

రేవంత్ రెడ్డి జోరుగా ..

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కడే నియోజకవర్గం మొత్తం తిరిగి వస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని హైదర్ గూడా, గచ్చిబౌలి, మూసాపేట్ లో పార్టీ అభ్యర్థుల ప్రచారం కనిపిస్తుంది.

అధిష్ఠానం వైఖరితో పక్కపార్టీ వైపు…

కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులకు సరైన గౌరవం లేకపోవడంతోనే పార్టీలు మారుతున్నట్లు చర్చ సాగుతుంది. శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి భిక్షపతి యాదవ్, రవి కుమార్ యాదవ్ లు బీజేపీలోకి, మండల అధ్యక్షుడు మల్లేశం టీఆర్ఎస్ లో చేరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు కొప్పుల నర్సింహా రెడ్డి లాంటి సీనియర్ నాయకులు బీజేపీ లో చేరుతున్నారు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గింది.

ఉత్తమ్ ఉత్తదే..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఉత్తదేనని ప్రచారం సాగుతుంది. బరిలో నిలిచిన అభ్యర్థులకు భరోసా కల్పించడంలో విఫలం అవుతున్నాడు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ బలోపేతం వైపు పనిచేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ బరిలో నిలిచిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed