ఫార్మారంగంలో కొత్త పాలసీని తీసుకురావాలి

by Shyam |
KTR
X

కేంద్రమంత్రి సదానంద గౌడకు మంత్రి కేటీఆర్ లేఖ

దిశ, న్యూస్ బ్యూరో :
ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలంలో అవసరమైన మందులను తయారు చేస్తూ దేశ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అందరికీ గర్వకారణంగా నిలిచిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ హబ్‌గా తెలంగాణ కొనసాగుతోందని, దేశ మెడికల్ ఉత్పత్తిలో 35% కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, సంస్కరణలపై కేంద్ర రసాయన, ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి వి. సదానందగౌడ‌కి కేటీఆర్ బుధవారం ఓ లేఖ రాశారు. తెలంగాణలో 800 కంపెనీల్లో 1.20 లక్షల మంది ఫార్మారంగాల్లో ఉపాధి పొందుతన్నారని, ఈ రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. తాను సూచిస్తున్న కొన్ని సంస్కరణలు, ఇతర చర్యల వల్ల ఫార్మా రంగం ప్రగతితో పాటు ప్రపంచంలో భారత్ నాయకత్వ స్థానం మరింత సుస్థిరం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఫార్మా పరిశ్రమపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉందని, కంపెనీలు నడిచే పరిస్థితి లేదన్న మంత్రి.. ఫార్మా కంపెనీలకు ఆదాయపు పన్ను, జీఎస్టీలను రీఫండ్ చేయాలని కోరారు. కనీసం ఆరు నెలల పాటు పన్నులకు సంబంధించిన మారటోరియం విధించాలని కేంద్రమంత్రికి విన్నవించారు. చైనా వంటి దేశాల పోటీని ఎదుర్కొనేందుకు భారత ఫార్మా కంపెనీలకు సాధ్యమైనంత ఎక్కువగా ఎగుమతి ప్రోత్సాహకాలను కల్పించాలని కోరారు. తగ్గిన వడ్డీరేట్ల మేరకు ఫార్మారంగ కంపెనీలకు రుణాలు అందించేలా కమర్షియల్ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ప్రస్తుత లాక్‌డౌన్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఉత్పత్తి కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న విషయమని, మందుల రేట్లను నిర్ధారించడంలో 10 శాతం వరకు ఉదారం‌గా వ్యవహరించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలకు ప్రస్తుతం పోర్టుల వద్ద జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని కోరారు. పోర్టు సంబంధిత ఖర్చులను కనీసం ఆరు నెలల పాటు ఫార్మా కంపెనీల వద్ద వసూలు చేయొద్దని కోరారు. భారతదేశ ఫార్మా రంగంలో ‘ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను మరింత పెంచేందుకు ఆ రంగంలోని నిపుణులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీర్ఘకాలంలో ఫార్మా రంగానికి కావలసిన ముడి సరుకులు, ఏపీఐలకు సంబంధించి చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తామన్న మూడు బల్క్ డ్రగ్ తయారీ పార్కులను స్వాగతిస్తున్నామని తెలిపారు.

చైనాతో పోలిస్తే 30 – 40 శాతం ఉత్పాదన ఖర్చు మన దేశంలో ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా క్లస్టర్‌.. హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తోందని, జాతీయ ప్రాధాన్యత ఉన్న దీనికి భవిష్యత్తులోనూ పెట్టుబడులతో కంపెనీలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఫార్మా రంగం ప్రతినిధులతో పలుమార్లు చర్చించిన తర్వాతే ఈ లేఖ రాసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Tags: Pharma, lockdown, corona, KCR, Telangana, central ministers

Advertisement

Next Story

Most Viewed