గంజాయి దందా..యువతే టార్గెట్!

by Anukaran |   ( Updated:2021-01-08 21:38:14.0  )
గంజాయి దందా..యువతే టార్గెట్!
X

దిశ, ఖమ్మం ప్రతినిధి : మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఖమ్మం జిల్లా గంజాయి మాఫియాకు అడ్డగా మారింది. రూ.లక్షల్లో కాదు ఏకంగా రూ.కోట్లల్లోనే వ్యాపారం సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకున్నా అక్రమార్కులు అదే పంథా కొనసాగిస్తున్నారు. ఎప్పడు తనిఖీలు చేసినా రూ. కోట్లు విలువ చేసే క్వింటాళ్ల కొద్దీ గంజాయి దొరుకుతుండడం కలవరపాటుకు గురి చేసే విషయం. జిల్లా నుంచి సరిహద్దులు దాటడమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా యువత భారీస్థాయిలో గంజాయికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మంతో పాటు ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు తదితర ప్రాంతాల్లోని యువత గంజాయికి బానిసైనట్లు సమాచారం.

రూ.కోట్లల్లోనే వ్యాపారం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లాలన్నా జిల్లా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో క్వింటాళ్ల కొద్దీ గంజాయిని రాత్రివేళల్లో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ డొంకరాయి, ఛత్తీస్ గఢ్​, ఒడిశా మల్కాన్ గిరి ప్రాంతాల్లో గంజాయి భారీగా సాగుచేస్తున్నారు. సరిహద్దు మూడు రాష్ట్రాల నుంచీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తో పాటు బెంగళూరుకు, ముంబై, కలకత్తా, ఢిల్లీకి, రాజస్థాన్ ప్రాంతాలకు కూడా భారీస్థాయిగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. పట్టుబడుతున్న సొమ్ము విలువే రూ.కోట్లల్లో ఉంటుండగా, రహస్యంగా సరిహద్దులు దాటుతున్న సరుకు విలువ ఇంకెంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి మాఫియా ఈ ప్రాంతంలోని కొంత మంది వ్యక్తులతోనే జిల్లాను దాటించే ప్రయత్నం చేస్తున్నారు. లోడ్ ముందు సంబంధం లేనట్లు పైలెట్ వాహనంగా వెళ్తూ వారిని ఎలాగోలా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వారికి కమీషన్ రూపేణా డబ్బులు భారీగానే ముట్టుచెపుతున్నట్లు సమాచారం.

యువతే టార్గెట్..
యువతను టార్గెట్ చేసుకునే గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు మొదలు ఉన్నత కుటుంబం గల వారికి ఎలాగోలా అలవాటు చేసి బానిసలుగా మారుస్తున్నారు. గంజాయి దొరకని పరిస్థితుల్లో వారి వద్ద నుంచి అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం నగరంలో గంజాయి విక్రయిస్తుండగా ఓ షాపు యజమాని వారిని అడ్డగించగా గంజాయి మత్తులో ఉన్న యువత ఆయనపై దాడికి దిగారు. స్థానికులు వారిని నిర్బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో గంజాయిని సిగరెట్లలో నింపి కూడా విక్రయిస్తున్నట్లు అనేకసార్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా పోలీసులు గంజాయి మాఫియా పై మొదటి నుంచి ఉక్కుపాదం మోపుతూనే ఉన్నా, క్వింటాళ్ల కొద్దీ సరుకు సరిహద్దులు దాటుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠాలు గంజాయి స్మగ్లింగ్ చేస్తే అధిక మొత్తంలో సంపాదించ వచ్చనే అత్యాశతో కేసులకు సైతం వెనుకాడడం లేదని తెలుస్తోంది.

పట్టుబడిన ఘటనలు..
ఇటీవల ఖమ్మం శ్రీనగర్ కాలనీలో ట్రాక్టర్ ట్రాలీలో నాలుగు క్వింటాళ్ల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విలువ సుమారు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా.

నెల రోజుల క్రితం కొణిజర్లలో మండలంలో తూర్పు గోదావరి నుంచి రంగారెడ్డి జిల్లాకు 120కేజీ గంజాయి రవాణా చేస్తుంటే పోలీసులు పట్టకున్నారు.

విశాఖ ఏజెన్సీ నుంచి భారీగా గంజాయి కారులో రవాణా చేస్తుండగా ఖమ్మం అర్బన్ మండలం మంచుకొండ వద్ద ప్రమాదానికి గురై డ్రైవర్ చనిపోయాడు. దీంతో గంజాయి అక్రమ రవాణా బయటపడ్డింది. సుమారు రూ. 80 లక్షల విలువైన 500 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కూడా సుమారు రూ. 50లక్షల విలువ చేసే గంజాయిని కొబ్బరిలోడులో తరలిస్తుండగా కారేపల్లి వద్ద వాహనం ప్రమాదానికి గురికావడంతో గంజాయి రవాణా బయటపడింది.

తల్లాడ వద్ద సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా దాదాపు 190 కేజీల గంజాయి పట్టుబడింది.

సంవత్సరం కిందట ఒడిశా పాటు, ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి రెండు లారీలతో గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద నిఘా పెట్టిన పోలీసులుకు దాదాపు. రూ 46లక్షల విలువ చేసే 400కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో లారీ పైభాగంలో బొగ్గు బస్తాలు వేసి మధ్యలో 640 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టకున్నారు.

Advertisement

Next Story

Most Viewed