రద్దీ ప్రాంతాల్లో సెల్​ఫోన్లు దొంగిలిస్తున్న ముఠాలోని నలుగురు అరెస్ట్​

by Kalyani |
రద్దీ ప్రాంతాల్లో సెల్​ఫోన్లు దొంగిలిస్తున్న ముఠాలోని నలుగురు అరెస్ట్​
X

దిశ, చార్మినార్​ : రద్దీ ప్రాంతాల్లో సెల్​ ఫోన్​లు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ ముఠాలోని నలుగురు వ్యక్తులను సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సెల్​ఫోన్​లను కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని సైతం పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన సొత్తును సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఆరుగురి నిందితులను హుస్సేని హాలం, ఐఎస్​ సదన్​ పోలీసులకు అప్పగించారు. సౌత్​ జోన్​ టాస్క్​ పోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ... షాహిన్​నగర్​ కు చెందిన మొహమ్మద్​ అబ్బాస్​ ఆలీ అలియాస చోర్​ అబ్బాస్​ అలియాస్​ లౌడ్​ అబ్బాస్​ (60) హుస్సేనిహాలం పోలీస్​ స్టేషన్​ రౌడీ షీటర్​. అదే ప్రాంతానికి చెందిన మొహమ్మద్​ రిజ్వాన్​ (24), భవానీనగర్​ కు చెందిన మొహమ్మద్​ సాధిక్​ అలియాస్​ చోటా మూసా (22), కంచన్​బాగ్​కు చెందిన మొహమ్మద్​ దస్తగిరి (48), రెయిన్​ బజార్​కు చెందిన షేక్​ అజాహర్​ అలియాస్​ అజ్జు (30) వీళ్ళంతా హైదరాబాద్​లో పుట్టి పెరిగిన వాళ్ళే.

ప్రధాన నిందితుడు మొహమ్మద్​ అబ్బాస్​ ఆలీ 1989 నుండే నేరాలు చేయడం ప్రారంభించాడు. ఇతనిపై ఇప్పటి వరకు 37 పాత కేసులు ఉన్నాయి. మొదట పండ్ల వ్యాపారం చేసే అబ్బాస్​ ఆలీకి వస్తున్న సంపాదన సరిపోక పోవడంతో విలాసవంతమైన జీవితం కోసం స్నాచింగ్​, సెల్​ ఫోన్​ దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మొహమ్మద్​ రిజ్వాన్​, మొహమ్మద్​ సాధిక్,మొహమ్మద్​ దస్తగిరి లతో కలిసి ఓ ముఠాను తయారు చేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. హైదరాబాద్​, రాచకొండ కమిషనరేట్​ పరిధిలలోని రద్దీ ప్రాంతాలలో సెల్​ఫోన్​లు తస్కరించడం, ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కత్తి చూపెట్టి బెదరకొట్టేవారు.

దొంగిలించిన సెల్​ఫోన్​లను మొహమ్మద్​ సత్తార్​, షేక్​ అజహర్​లకు విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ అదనపు డీసీపీ అందెశ్రీనివాస్​ పర్యవేక్షణలో సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ ఎస్​.రాఘవేంద్ర , ఎస్​ఐలు ఎం.మహేష్​, కె.నర్సింహులు, జి.ఆంజనేయులు, ఎన్​.నవీన్​ ల బృందం హుస్సేనిహాలం ప్రాంతంలో అనుమాన స్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారించంగా చేసిన నేరాణ్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 8 సెల్​ఫోన్​లు, ఒక కత్తి, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం వారిని హుస్సేని హాలం పోలీసులకు అప్పగించారు. ఈ కేసును హుస్సేనిహాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story