- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా దంపతులకు కీ రోల్… రేవంత్ ప్లాన్ అదేనా..?
దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించాలని బలంగా కోరుకున్న కాంగ్రెస్ నేతల్లో కొండా దంపతులు ముందున్నారు. కొద్దిరోజుల క్రితం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి కనీస సహకారం, మద్దతు లభించని విషయం తెలిసిందే. అనుహ్యంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు జనంలో మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పాదయాత్ర ముగింపు సభలో రేవంత్‌రెడ్డిని కొండా దంపతులు పొగడ్తలతో ఆకాశానికెత్తారు. రాజశేఖరుడి పాదయాత్రను గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలే, దూకుడు స్వభావమే పార్టీని నిలబెట్టగలవని కొండా సురేఖ వెల్లడించడం గమనార్హం. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కొంతమంది సీనియర్ నేతలకు సైతం మింగుడు పడలేదు. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది నేతలు ఎమ్మెల్సీ, కార్పోరేషన్ ఎన్నికలకు ముందు వరంగల్‌కు వచ్చినా కొండా దంపతులు కనీసం వారిని కలవడానికి కూడా ఇష్టపడకపోవడం గమనార్హం. దీనికి రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత పార్టీలో వారిపై జరిగిన చర్చే కారణమని తెలుస్తోంది.
అంచనాలు తారుమారు… అలక వహించారు..
రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కితే కమిటీలో ఖచ్చితంగా కొండా దంపతులకు ప్రాధాన్యం ఉంటుందని అంతా ఊహించారు. కొండా దంపతుల్లోనూ కమిటీలో చోటుపై అంచనాలు నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారికి కనీసం కమిటీలో చోటు దక్కకపోవడంతో మనసు నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రేవంత్ నియామకం తర్వాత వారి అభిప్రాయన్ని కూడా మీడియాతో పంచుకోలేదు. రేవంత్‌ను కలవలేదని సమాచారం. ఈ విషయం గ్రహించిన రేవంత్‌రెడ్డి తనకు వ్యతిరేక స్వరం వినిపించిన నేతలను, కినుక వహించిన వారిని నేరుగా కలుస్తూ పార్టీ బలోపేతానికి సహకరించాలని, కాంగ్రెస్ పునరేకీకరణకు కలిసి రావాలని పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా దంపతుల ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. బుధవారం జూబ్లీహిల్స్‌లోని కొండా దంపతుల ఇంటికి చేరుకున్న పీసీసీ నూతన చీఫ్ రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ మంగళహారతితో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డిని శాలువతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వరంగల్‌లో ఉండగా… ఆయనతో రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఓరుగల్లు పార్టీలో వారే కీలకం..
ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటగా వర్ధిల్లింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేబినేట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ-మురళీధర్‌రావు దంపతులు ఓరుగల్లు జిల్లా రాజకీయాలను శాసించారనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర విభజన.. మధ్యలో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం.. బయటకు రావడం.. వంటి పరిణామాలతో రాజకీయ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తున్నారు. టీఆర్‌ఎస్ వేవ్‌లో వారి సత్తా చాలడం లేదన్నా అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. కానీ కొండా దంపతుల రాజకీయం విభిన్నమని ఇప్పటికీ నమ్ముతుంటారు. రేవంత్‌రెడ్డి నియామకం జరగాలని బలంగా కోరుకున్న కొండా దంపతులు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇచ్చే స్వేఛ్చను వినియోగించుకుంటూ జిల్లాలో పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. భవిష్యత్ రాజకీయాల్లో మళ్లీ కేంద్ర బిందువుగా మారుతారనే అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఆ అంచనాలు నిలబెట్టే విధంగా రాజకీయ పోరు సాగుతుందో లేదో మరి..!