పక్కా ప్లాన్‌తో ఈటల.. టీఆర్‌ఎస్‌కు మరో షాక్

by Anukaran |   ( Updated:2021-09-20 00:22:02.0  )
Eatala-Rajender-Vs-TRS
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నాతో ఉండి నాతో ఎదిగిన వారంతా ఇప్పుడు నన్ను వీడిపోయారు. గులాబీ కండువా కప్పుకున్న వారెవరినీ తిరిగి నాదరికి చేరనిచ్చేది లేదు, బీజేపీలో చేర్చుకునేది లేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో ఈటల వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేసిన నాయకులంతా కిమ్మనకుండా ఉండి పోయారు. అయితే ఈటల తీసుకున్న నిర్ణయంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. గులాబీ గూటికి చేరుకున్న వారు కమలం పంచన చేరేందుకు వస్తే స్వాగతించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఈటల.. టీఆర్ఎస్.. బీజేపీ..

తాజాగా బీజేపీలో ఉప సర్పంచ్ చేరారు. ఆయన గతంలో ఈటల వెంటే ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితమే టీఆర్ఎస్‌లో చేరారు. 24 గంటలు తిరగక ముందే బీజేపీలో జాయిన్ కావడంతో ఫిరాయింపు ప్రక్రియను ఈటల వర్గం మళ్లీ స్టార్ట్ చేసిందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. వీణవంక మండలం శ్రీరాములపేట ఉప సర్పంచ్ బొబ్బల దామెదర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి బీజేపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో చేరిన ఆయన 24 గంటలు తిరగక ముందే ఈటల సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.

వ్యూహంలో భాగమా..

అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఈటల వేసిన ప్రతీ అడుగును నిశితంగా పరిశీలిస్తోంది. అయితే.. తన ఎత్తుగడలు గులాబీ నేతలకు అంతుచిక్కవద్దన్న భావనతో మాజీ మంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. తన వెంట తిరిగిన నాయకుడిని గంటల్లో టీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా మల్చుకుని గులాబీ కండువా కప్పుతున్నందున ఓటు బ్యాంకు ఉన్న వారిని తన సమీపంలోకి కూడా రానివ్వకుండా ఈటల జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తాను ప్రయాణించే వాహనంలోనే ముఖ్య నాయకులను కూర్చోబెట్టుకుని తిరిగిన ఈటల.. ఇప్పుడు తన వాహనంలో గన్ మెన్లు, డ్రైవర్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. గ్రామాల వారీగా ముఖ్యమైన వారిని గుర్తించి వ్యక్తిగతంగా కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో తన ప్లాన్ సక్సెస్ అవుతుందని ఈటల భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed