ఇది ప్రగతిశీల బడ్జెట్ : సీఎం కేసీఆర్

by Shyam |
ఇది ప్రగతిశీల బడ్జెట్ : సీఎం కేసీఆర్
X

రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సంక్షేమ తెలంగాణ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రిని ఆయన ఛాంబర్‌లో హరీశ్‌రావు కలిసిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికున్న ఆదాయ వనరులను, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. అన్ని వర్గాల సంక్షేమం- అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం కత్తిమీద సాము వంటిదని, మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో ఎక్కువ మంది పేదలకు అవకాశం లభించాలనే సంకల్పానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుకు ఈ బడ్జెట్‌లో రూట్‌మ్యాప్ ఉందన్నారు.

tags: Telangana, Budget, KCR, HarishRao, Progressive, Welfare, Promises

Advertisement

Next Story

Most Viewed