‘కేసీఆర్ సచివాలయానికి రాకుండా చరిత్రకెక్కారు’

by Shyam |
congress leader shabbir ali
X

దిశ, కామారెడ్డి : సీఎం కేసీఆర్ ఏడేళ్లలో మూడు లక్షల కోట్ల అప్పు చేసారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ విమర్శించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా సచివాలయానికి రాని సీఎంగా కేసీఆర్ చరిత్రకెక్కారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నిధులు, నియామకాలు, అభివృద్ధి లేకుండా చేసారని విమర్శించారు. పక్క రాష్ట్రాల వారు కృష్ణాజలాలను వాడుకుంటే సీఎం కేసీఆర్ చూస్తూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు.

రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజి 52 కాంగ్రెస్ తీసుకువస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కాళేశ్వరంగా 22 కు మార్చారన్నారు. 200 కోట్లు ఇస్తే కాళేశ్వరం పనులు పూర్తి చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని సీఎం కేసీఆర్ చెప్పి మాట మార్చారని అన్నారు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పిన కేసీఆర్ కామారెడ్డికి మొండిచేయి చూపించారని ఎద్దేవా చేశారు.

కామారెడ్డి పర్యటనకు వస్తున్న కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని, దోమకొండకు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండున్నరేళ్ల తర్వాత పల్లె, పట్టణ బాట పట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed