- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు.. 84 శాతం మందిలో తీవ్ర వ్యతిరేకత
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ అట్టడుగుకు పడిపోయింది. ఏడాది క్రితం వరకు దేశవ్యాప్తంగా 9వ స్థానంలో నిలిచిన సీఎం జాడ ఇప్పుడు కానరావడం లేదు. దేశ వ్యాప్తంగా నంబర్‌వన్ ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి పనితీరు బాగుంది, ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. రాష్ట్రాల వారీగా సీఎంల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఇందులో సీఎం కేసీఆర్ వెనకబడిపోయారు. కేవలం మూడు శాతం ఓట్లతో ఏపీ సీఎం జగన్ కన్నా వెనక్కి వెళ్లారు.
దేశమంతా సర్వే
ఇండియా టుడే ఆధ్వర్యంలో జూలై 10 నుంచి జూలై 20 వరకు దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 11.5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఏపీ, అసోం, బిహార్, చత్తీస్‌ఘఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 14,559 మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటర్వ్యూ చేశారు. 71% గ్రామీణ ప్రాంతాలు, 29% పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసినట్టు సంస్థ వెల్లడించింది. గతంలో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముందున్న కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ముందుగా టాప్ టెన్ జాబితాను వెలువరించారు. ఈ జాబితాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందరి కన్నా ముందున్నారు. స్టాలిన్ పాలన అద్భుతమని 42% మంది తమిళనాడు ప్రజలు అభిప్రాయపడ్డారు. అటు 38%తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలువగా.. 35%తో కేరళ సీఎం పినరయి విజయన్ మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నాల్గో స్థానంలో(30 %), అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (29%) ఐదో స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగి ఆరో స్థానంలో (29%), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(22%) ఏడో స్థానంలో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదవ స్థానంలో(22%) ఉండగా.. 19%తో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 19%తో 9వ స్థానంలో ఉన్నారు. 19%తో చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ భగేల్ 10వ స్థానంలో నిలిచారు.
వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య
దేశంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నది. రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నదని సర్వేలో తేలింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ధరల పెరుగుదలపై 23% వ్యతిరేకతను వ్యక్తం చేస్తే.. 17% ఉద్యోగాల కల్పనపై అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో 84 శాతం మంది సీఎం కేసీఆర్ పరిపాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే తేటతెల్లం చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో మూడొంతుల మంది వ్యతిరేకంగా ఓటేశారు.
కొట్టుడుపోయిన సంక్షేమం
రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో గతంలో మెరుగైన స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్ గ్రాఫ్ ఈసారి గణనీయంగా పడిపోయింది. కేవలం 3% ఓట్లతో దేశంలో చివరి స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల వరకు కొంతమేరకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఇప్పుడు ఆయనపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ డౌన్ వెనుక ఆయన వ్యవహరించిన తీరు ప్రధాన కారణమని పలువురు పేర్కొంటున్నారు. విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు, ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అధికారుల పనితీరు, సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల వైఖరి కూడా గ్రాఫ్ తగ్గడానికి కారణమనే విశ్లేషణలున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన చాలా హామీలు నెరవేర్చకపోవడం, రాష్ట్రంలో అప్పుల వ్యవహారం రాష్ట్ర భవిష్యత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయనే అంశాలు ప్రజల్లోకి వెళ్లుతున్నట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ జూన్‌లో ప్రవేశపెట్టిన దళిత ఎంపవర్మెంట్ కూడా గ్రాఫ్‌లో గట్టెక్కించలేకపోవడం గమనార్హం.