చక్రం తిప్పిన సిట్టింగులు.. మహబూబ్ నగర్‌ ఎమ్మెల్సీలుగా మళ్లీ వారే..!

by Shyam |
చక్రం తిప్పిన సిట్టింగులు.. మహబూబ్ నగర్‌ ఎమ్మెల్సీలుగా మళ్లీ వారే..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖాళీ అయిన రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మళ్లీ సిట్టింగులకే అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది.ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కు ముందు నుండే ఒక స్థానం మహబూబ్ నగర్ పార్లమెంటుకు, రెండవ స్థానం నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు కేటాయించాలన్న డిమాండ్‌తో పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు ముందుకు వేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారిలో ఒకరికి అవకాశం కల్పించి, రెండవ స్థానాన్ని మహబూబ్ నగర్ పార్లమెంట్‌కు కేటాయించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావించారు. గత నాలుగు రోజులుగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు ఆదివారం ఒక స్థానం నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి, రెండవ స్థానాన్ని ప్రముఖ కళాకారుడు సాయి చందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ అంశాన్ని మీడియా సంస్థలు బాగా హైలెట్ తీసుకొచ్చాయి. ఆదివారం రాత్రి అనూహ్యంగా దామోదర్ రెడ్డి నామినేషన్ వేయవలసిందిగా సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ క్రమంలో రెండు సీట్లకు ముగ్గురి అభ్యర్థులు సిద్ధంగా ఉండగా పార్టీ అధిష్టానం ఎవరికీ అవకాశం ఇస్తుందన్న ఉత్కంఠ మళ్ళీ మొదలైంది. సోమవారం సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది.

సుదీర్ఘ చర్చలు..

అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ భవన్‌లో సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సమాచారం. దీనికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాగా, పలు అంశాలపై చర్చలు జరిపిన అనంతరం వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. చివరి క్షణంలో సాయి చందుకు అవకాశం లేకుండా పోయింది.

రేపు నామినేషన్లు..

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.ఉదయం 11 గంటల తర్వాత నామినేషన్లు వేయాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరుకానున్నారు.

Advertisement

Next Story