- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదర్శంగా నిలుస్తున్న అతివలు.. అంత్యక్రియల్లో ‘ట్రిపుల్ ఎస్ మగువ టీమ్’
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆకాశంలో సగం ఆవనిలో సగం అన్నట్టుగా ఈ అతివలు తమలోని సేవా భావాన్ని చాటుకున్నారు. ఓ వైపున కరోనా బాధితులకు బాసటగా నిలుస్తూనే.. మరో వైపు వారి అంత్యక్రియలు చేసేందుకు కూడా సాహసిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారంటనే మగవాళ్లు సైతం దూరం దూరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లోనూ ఆ మహిళలు మాత్రం ధైర్యంతో కొవిడ్ బాధిత శవానికి.. చివరి తంతు పూర్తి చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పాత రుద్రారం గ్రామానికి చెందిన ఓ మహిళ.. కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు.
గురువారం రాత్రి గ్రామానికి చేరుకున్న ఈ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు అడగడంతో.. సంజీవిని సేవా సమితి మగువ టీం సభ్యులు ధైర్యంగా వెళ్లి అంత్యక్రియల తంతు పూర్తి చేశారు. సాధారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలను పురుషులే నిర్వహిస్తుండటం రివాజు. కానీ ఇక్కడ కరోనాతో మరణించిన ఆమెకు.. చివరి తంతు పూర్తి చేసేందుకు మహిళలు ముందుకు రావడం అందరినీ అబ్బుర పరిచింది. సంజీవని సేవా సమితి మగువ టీం మెంబర్స్ గడి రజిత, సాదియా నౌసీన్, రాజేశ్వరీలు రాత్రి 9 గంటలకు పాత రుద్రారం వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
సూపర్ సర్వీస్..
తూర్పు అటవీ ప్రాంతంగా పిలవబడే కాటారం మండల కేంద్రానికి చెందిన నలుగురు మహిళలు తమలోని సేవా గుణాన్ని చాటి సమాజానికి సరికొత్త సందేశాన్ని అందించారు. సూర్యుని వెలుగులను అందరికంటే ముందుగా చూసే తూర్పు ప్రాంతంలోని మహిళలు అందించిన సర్వీస్‌తో కొత్త వెలుగులను నింపినట్టు అయింది. వీరందించిన సేవలు తెలిసి ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు.
బాధితులకు సాయం..
కరోనా బాధితులకు సాయం అందించేందుకు అన్ని రకాలుగా ముందుకు వచ్చిన ట్రిపుల్ ఎస్ మగువ టీం సభ్యులు కొద్ది రోజులుగా కరోనా బాధితులకు రేషన్ కిట్లు కూడా అందిస్తున్నారు. కరోనా సోకిన వారికి చేయూతనందించేందుకు నిత్యవసరాలను కూడా సరఫరా చేస్తున్నారు.
సమాజ సేవ కోసం : సాదియా నౌసిన్
సమాజ సేవ చేయాలన్న తపనతోనే ట్రిపుల్ ఎస్ మగువ టీంలో చేరా. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న వారిని కళ్లారా చూస్తూ.. చలించి పోయా. అందుకే ధైర్యంగా సేవలందించేందుకు ముందుకు వచ్చా. కొవిడ్ బాధిత శవానికి అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆ కుటుంబ సభ్యుల్లో కనిపించిన సంతృప్తి అంతా ఇంతాకాదు. ఏదైనా సేవ ద్వారా అందించే సాటిస్ఫై వేరే ఉంటుంది. సమాజం కరోనా బాధితుల పట్ల వివక్ష చూపుతుండటం కూడా బాధించింది. అందుకే వారికి అన్నింటా చేదోడుగా ఉండాలన్న తపనతో ముందుకు వచ్చాను.
రేషన్ సరుకులు అందిస్తున్నాం: రాధిక
గత 20 రోజులుగా కాటారం మండలంలోని కరోనా బాధితులకు స్వయంగా వెళ్లి రేషన్ సరుకులు కూడా అందిస్తున్నాం. సమాజ సేవలో నా వంతు బాధ్యత నెరవేర్చాలన్న సంకల్పంతోనే కరోనా బాధితులకు సేవ అందించాలని నిర్ణయించుకున్నాను. కరోనా కష్ట కాలంలో సకాలంలో తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి నా వంతు సాయం చేయాలన్న తపనతోనే నిత్యవసరాలు అందిస్తున్నాను.