130 కి.మీ. నడక… ఆనక మళ్లీ వెనక్కి!

by Aamani |   ( Updated:2020-04-26 08:35:40.0  )
130 కి.మీ. నడక… ఆనక మళ్లీ వెనక్కి!
X

దిశ, ఆదిలాబాద్: కూలీ పనుల కోసం మన రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వెళ్లారు. కరోనా కారణంగా అక్కడ అంతా అల్లకల్లోలంగా ఉండడంతో కాలినడక తిరుగుముఖం పట్టారు. తెలంగాణ సరిహద్దులో అడ్డుకోవడంతో తిరిగి సుమారు 130 కిలో మీటర్లు నడిచి వెనక్కి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లాకు చెందిన 35 మంది కార్మికులు లాతూర్‌లో ఒక నిర్మాణ రంగ కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరారు. వీరిలో 20 మంది మహిళలే. కరోనా ప్రభావంతో లాతూర్ లో కాంట్రాక్టు పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు కూడా తమను స్వస్థలాలకు వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఏమీ తోచక వారం రోజుల క్రితం కాలినడక బయల్దేరారు. లాతూర్ నుంచి తెలంగాణ సరిహద్దు నిజామాబాద్ జిల్లా మద్నూర్ దాకా 130 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. కానీ, స్వగ్రామాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని హరీష్ అనే యువకుడు ఫోన్ ద్వారా, వాట్సాప్ లోనూ తమ బంధువులకు చేరవేశాడు.

మహారాష్ట్ర పోలీసులు సహకరించారు కానీ, ఇంటికి వెళ్లలేక, తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబితే స్వగ్రామాలకు వెళ్లేందుకు మహారాష్ట్ర పోలీసులు తమకు సహకరించారని ఆ కూలీలు చెప్పారు. అయితే, మద్నూర్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని వాపోయారు. తాము ఇక్కడే ఉండి తమ గ్రామస్తుల ద్వారా వాహనాలు తెప్పించుకుని స్వగ్రామాలకు వెళ్లిపోతామని మొర పెట్టుకున్నా ఇక్కడి పోలీసులు కనికరించలేదని విచారం వ్యక్తం చేశారు.

130 కిలోమీటర్లు వెనక్కి…

తెలంగాణ సరిహద్దు‌లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తమను పోలీసులు అడ్డుకోవడంతో తాము పడరాని పాట్లు పడ్డామని వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు మమ్మల్ని తిరిగి లాతూరు కు తీసుకు వెళ్లారని వారు తెలిపారు. తమను ఎలాగైనా స్వస్థలాలకు చేర్చాలని వారు కోరుతున్నారు.

tags: Karimnagar, Maharashtra, Latur, Migrant workers, Border check post, Police, 130km

Advertisement

Next Story

Most Viewed