శివశివా.. ఏందయ్యా ఇది.. పబ్బును మరిపించిన కాళేశ్వరం గెస్ట్ హౌజ్

by Sridhar Babu |   ( Updated:2021-07-31 03:51:56.0  )
Kaleswaram Guest House
X

దిశ, కాటారం: నిత్యం శివనామ స్మరణతో మారుమోగాల్సిన ఆలయ పరిసర ప్రాంతాలు మందు బాబుల కేకలతో దద్దరిల్లుతున్నాయి. భక్తులు సేద తీరేందుకు ఉపయోగపడాల్సిన విశ్రాంతి గదులు విందు వినోదాలకు వేదికగా మారిపోయాయి. ఆలయ గెస్ట్ హౌస్‌లు కాస్తా పబ్‌లను తలపిస్తున్నాయి. ఇందంతా ఎక్కడో కాదు.. ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరాలయ గెస్ట్ హౌజ్‌ల్లోనే. కొందరు ఇష్టానుసారంగా నిత్యం విందులు చేసుకుంటూ చిందులు వేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో శివ శివ.. ఏందయా ఈ దారుణం అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలోని సింగరేణి గెస్ట్ హౌస్‌ను మందుబాబులు ఏకంగా పబ్బును తలపించేలా మార్చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం ఇదే తంతు కొనసాగుతోంది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్దంగా కాళేశ్వరం ఆలయ రూముల్లో చుక్క, ముక్కలతో మందు బాబులు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. దైవ సన్నిధిలో ఉంటూ దేవున్ని పూచించి తరించాలనుకుంటున్న భక్తులకు మందుబాబుల ఆగడాలతో ఇబ్బందిగా మారింది. స్థానికంగా ఈవో ఉండకపోవడంతో అజమాయిషీ లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు తావివ్వకుండ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఈవో లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులకు దిశా నిర్దేశం చేసేవారు లేకుండా పోయారాన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం ఆలయానికి భక్తుల రద్దీ కూడా తీవ్రంగా పెరిగినందున, ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మందు బాబుల ఆగడాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు.

Advertisement

Next Story

Most Viewed