కాళేశ్వరం పనులకూ ‘కరోనా’ అడ్డంకి..

by Sridhar Babu |   ( Updated:2020-05-02 01:56:15.0  )
కాళేశ్వరం పనులకూ ‘కరోనా’ అడ్డంకి..
X

దిశ, కరీంనగర్: ఆ రంగం, ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలపై ‘కరోనా’ ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపైనా ఆ మహమ్మారి ప్రభావం పడింది. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పనుల్లో ఆలస్యమే అవుతున్నది. రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎగువ ప్రాంతానికి తరలించి, నిర్దేశించుకున్న లక్ష్యంలోనే పనులు పూర్తిచేయాలనీ సీఎం భావించారు. కానీ, 40 రోజులుగా పనులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. ప్రాజెక్టుకు ఆయువు పట్టైన మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్‌ల వద్ద పనులు ఆగిపోయాయి.

నిలిచిన పనులు..

మేడి‌గడ్డ బ్యారేజీకి ఇరువైపులా నిర్మించాల్సిన కరకట్ట పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూలీల సమస్య తీవ్రంగా ఉండటం వల్లే ఈ పనులకు ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది. మెయిన్ బ్యారే‌జ్ కావడంతో ఇక్కడ త్వరగా పనులు పూర్తయితే పూర్థిస్థాయిలో నీటిని నిలువ ఉంచి ఎగువ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. కానీ, కరకట్టతోపాటు ఇతర పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వచ్చే వర్షాకాలం నాటికైనా ఈ పనులు పూర్తవుతాయా? లేదా అనే సందేహం వస్తోంది. డైవర్షన్ కెనాల్స్ పనులూ నిలిచిపోవడం అటు అధికారులను ఇటు స్థానిక రైతాంగాన్ని ఆందోళన కల్గిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్‌లోకి కేవలం ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చే వరద నీటిని నిలిపేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో బ్యారేజ్ సమీపం గ్రామాల మీదుగా వచ్చే వాగులు, వంకలు, పంట చేలకు సంబంధించిన నీరు గోదావరిలో కలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ నీరంతా సమీప గ్రామాలకు సంబంధించిన పంటలను ముంచేస్తోంది. ప్రత్యామ్నాయంగా ఈ నీటిని మళ్లించేందుకు రెండు వైపులా డైవర్షన్ బండ్ నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ వైపు 5.5 కిలోమీటర్లు, మహారాష్ట్ర వైపు 12 కిలో మీటర్ల వరకు ఈ కెనాల్స్ నిర్మించాల్సి ఉంది. ఈ కాలువల ద్వారా నీటిని మేడిగడ్డ బ్యారేజ్ దిగువన కిలోమీటరు దూరం వరకు మళ్లించాల్సి ఉంది. కానీ, ఆ పనులు ఇప్పుడు జరగడం లేదు. వేసవి కాలంలో ఈ పనులు పూర్తి కాకపోతే వచ్చే వర్షాకాలంలో కూడా సమీప గ్రామాలకు చెందిన పంటలు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

బాంబే పోర్టులోనే మోటార్లు..

మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌ను ఎగువ ప్రాంతానికి ఎత్తి‌పోసేందుకు కన్నెపల్లి వద్ద ప్రత్యేకంగా పంప్ హౌజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని భావించిన అధికారుల 11 మోటార్లను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించారు. వీటి ద్వారా ఇప్పటికే ఎగువ ప్రాంతానికి నీటిని తరలించారు కూడా. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు కాళేశ్వరం నీటిని వినియోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రాణహిత, గోదావరి నదుల మీదుగా కూడా వరద నీరు ఎక్కువగానే వస్తున్నందున మరో టీఎంసీ నీటిని కూడా వినియోగించుకుంటే మరిన్ని అవసరాలను తీర్చుకోవచ్చని భావించారు. ఈ మేరకు మూడో టీఎంసీ పనులనూ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు అదనంగా మోటార్లను దిగుమతి చేసుకున్నారు. ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాల నుంచి వచ్చిన ఈ మోటార్లు బాంబే పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కన్నెపల్లికి రావాల్సి ఉంది. ఇందులో 2 మోటార్లు కన్నెపల్లి పంప్ హౌజ్‌కు ఇప్పటికే చేరుకోవడంతో వాటిని ఫిట్టింగ్ చేయిస్తున్నారు అధికారులు. మిగతా వాటిని తెప్పించే క్రమంలో లాక్ డౌన్ అమల్లోకి రావడంతో వాటిని బాంబే పోర్టు నుంచి తరలించే అవకాశం లేకుండా పోయింది. దాంతో తెలంగాణ సర్కార్ మొదట 2 మోటార్లను తరలించేందుకు ప్రత్యేకంగా పాస్‌లను పంపించడంతో అవి కన్నెపల్లికి బయలు దేరాయి. మరో 2 మోటార్లనూ తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో మిగతా 2 మోటార్లూ బాంబే పోర్టు నుంచి బయలు దేరనున్నాయి. అయితే, ఇక్కడా కూలీలు లేకపోవడంతో పనులు వేగంగా జరగడం లేదు. మొత్తానికి లాక్ డౌన్‌తో అక్కడ బ్యారేజ్ పనులు, ఇక్కడ పంప్ హౌజ్ పనులు, మోటార్ల ఫిట్టింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

Tags: corona virus, covid 19 affect, lockdown, kaleshwaram project, works stopped, no coolie, motors

Advertisement

Next Story