ఈటలను తొలగించేందుకు కేసీఆర్ కుట్ర: రేవంత్

by Shyam |
ఈటలను తొలగించేందుకు కేసీఆర్ కుట్ర: రేవంత్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కరోనా నియంత్రణలో విఫలమయ్యారని సాకుతో మంత్రిని తొలగిస్తారని, ఈ విషయాన్ని ఓ టీఆర్ఎస్ నేత స్వయంగా తనతో చెప్పాడన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన జర్నలిస్టుల ఉపవాస దీక్ష కార్యక్రమంలో ఎంపీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నెల వేతనం రూ. 2 లక్షల చెక్కును జర్నలిస్టుల సంక్షేమ నిధికి అందించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మరో వారం రోజుల్లో మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రిని బలి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీలో బహిరంగంగా చర్చించుకుంటున్నారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతోందని రేవంత్ మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోద ఆసుపత్రి లో వైద్యం అందిస్తున్నారని, దీని ప్రకారం గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని చెప్పకనే చెప్పుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఉద్ధేశ్యపూర్వకంగానే కరోనా విజృంభిస్తున్నా మౌనంగా ఉంటున్నారని, పేదవారి ప్రాణాలను మాత్రం గాంధీ ఆస్పత్రిలో ఫణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిర్లక్ష వైఖరికి నిరాహార దీక్ష చేస్తున్నా జర్నలిస్ట్‌లకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నానన్నారు. తక్షణమే మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని, ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదని విమర్శించారు. మనోజ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైతే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed