‘ఆశా’ కిరణం.. స్వీపర్ టు డిప్యూటీ కలెక్టర్

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-17 05:43:40.0  )
asha-kiranam
X

దిశ, ఫీచర్స్ : ‘పెళ్లి’ జీవితాన్ని మారుస్తుందటారు. నిజమే అది పూలదారిని స్వాగతిస్తుందో, ముళ్లబాటను చూపిస్తుందో తెలియదు. జోధ్‌పూర్ అమ్మాయి జీవితంలో రెండోదే జరిగింది. ఆమె ‘ఆశ’లన్నీ ఏడడుగులు కల్లలు చేయగా, ఎనిమిదేళ్ల తర్వాత ఆ బంధం నుంచి విముక్తి పొందింది. ఇద్దరు పిల్లలను పోషించడానికి స్వీపర్‌‌గా పనిచేసింది. సమాజపు సూటిపోటి మాటలను, జీవిత కష్టాలను లెక్కచేయకుండా తన లక్ష్యం కోసం ప్రయత్నించింది. నేడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. వీధుల్నీ శుభ్రం చేసిన ఆ చేతులు, సమాజంలోని చెత్తను క్లీన్ చేయడానికి సమాయత్తమవుతున్నాయి. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచే ఆ ఆశాకిరణమే ‘ఆశ కందారా’.

జోధ్‌పూర్‌కు చెందిన ఆశ కందారాకు 1997లో వివాహం కాగా, ఎనిమిదేళ్ల తర్వాత ఆ బంధం నుంచి విడిపోయింది. తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఆమె కుటుంబ పోషణకు స్వీపర్‌గా పనిచేసింది. ఇంటి బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. విధి వెక్కిరిస్తున్నా, జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఆశ.. సివిల్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయింది. ఈ క్రమంలోనే 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది. ఆశగా ఫలితాల కోసం వేచిచూస్తున్నా సమయంలో దేశంలో లాక్‌డౌన్ మొదలైంది. దాంతో కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఫలితాలు ఆలస్యం కావడంతో ఇక్కడ కూడా ఆమెకు నిరాశ తప్పలేదు. కానీ ఎట్టకేలకు జూలై 13న ఫలితాలు రాగా, రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షను క్లియర్ చేసి చరిత్ర సృష్టించింది. హద్దేలేని ఆనందంతో ఆశ ఉప్పొంగిపోయింది.

సమాజంలో తాను ఎదుర్కొన్న వివక్ష తన జీవితాన్ని మార్చడానికి ప్రేరేపించిందని ఆశ అన్నారు. ప్రారంభంలో తాను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకున్నానని, అయితే వయసు సంబంధిత పరిమితుల కారణంగా పరీక్షలకు హాజరు కాలేదని ఆమె తెలిపారు. ‘ఇది కఠినమైన ప్రయాణం. ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఈ విజయం ఆ బాధలన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నిరుపేదలకు, అన్యాయానికి గురైన వారికోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను’ అని ఆశ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed