జీహెచ్ఎంసీ పీఠంపై ఉద్యోగ జేఏసీ మహిళా నేత కన్ను..?

by Anukaran |   ( Updated:2020-11-04 01:36:34.0  )
జీహెచ్ఎంసీ పీఠంపై ఉద్యోగ జేఏసీ మహిళా నేత కన్ను..?
X

దిశ, తెలంగాణ బ్యూరో :
ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాలపై కన్నేశారు. ఇటీవల ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికే పలు ఎన్నికల్లో దెబ్బతిన్న ఈ నేతలు తాజాగా ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పటికే జేఏసీ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అడుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ స్థానంపై అటు దేవీ ప్రసాద్ కూడా కన్నేశారు. అంతేకాకుండా పార్టీ నేతల ఆశీస్సులు ఉండి, పలు విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ అధికారి కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డిసెంబర్ నెలలో ఖాళీ అవుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పోస్టులపై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానంపై ఉద్యోగ నేతలు పట్టు పడుతున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఉద్యోగ నేతలకు అవకాశం ఇచ్చేందుకు వెనకాడుతోంది. ఏడాదిన్నర కిందట జరిగిన కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో రవాణా శాఖ ఆర్టీవో చంద్రశేఖర్ గౌడ్‌ను రంగంలోకి దింపినా… ఓటమిపాలయ్యాడు. ఇటీవలే ఆయన కరీంనగర్ ఆర్టీఓగా పునర్ నియమితులయ్యారు. గతంలో దేవీ ప్రసాద్ కూడా ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిణామాలు పార్టీ నేతలను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం ఇచ్చినా కలిసిరావడం లేదని, వారితో పార్టీకి కూడా పెద్దగా ప్రయోజనాలేమీ లేవని దూరం పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

మేయర్ పదవిపై హామీ ఇస్తారా..?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. దాదాపు రాజకీయ పక్షాలతో పాటు అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో టికెట్ల వేట సాగుతోంది. అధికార పార్టీలో దాదాపు 30 శాతం కార్పొరేటర్లకు టికెట్లు దక్కవని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తరుపున మంత్రి కేటీఆర్ కూడా కొంతమంది కార్పొరేటర్లపై అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచీ ఈ స్థానంపై ఆశతోనే ఉన్నట్లు చెప్పుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతుండటంతో టికెట్ కోసం కూడా ప్రయత్నాలు వేగంగానే చేస్తున్నారు. కాగా, మేయర్ స్థానం మహిళకు కేటాయించడంతో సదరు ఉద్యోగ జేఏసీ మహిళా నేతకు కలిసివచ్చి తనకు అవకాశం కల్పించాలంటూ వెంట పడుతున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ దగ్గరకు తనతో సన్నిహితంగా ఉండే మరో మంత్రితో పాటుగా వెళ్లి కలిసి విజ్ఞప్తి చేసుకున్నారని సమాచారం. కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని, కూకట్‌పల్లి జోన్ పరిధిలో ఓ స్థానం నుంచి పార్టీ టికెట్ ఇప్పించాలని, మేయర్ స్థానానికి తననే ప్రకటించాలని కోరారు. అయితే ఈ ప్రచారం చాలా రోజుల నుంచి గ్రేటర్ రాజకీయాల్లో, ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్నా… తాజాగా మంత్రి కేటీఆర్‌ను కలువడంతో ఊహాగానాలు మరింతగా పెరిగాయి. అయితే మంత్రి కేటీఆర్ నుంచి మాత్రం వ్యతిరేక సమాధానమే వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వస్తే రావాలని, అంతేకానీ పదవులపై ఆశలు పెట్టుకోరాదని, ఇప్పుడున్నపరిస్థితుల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమని, ఉద్యోగ సంఘాల నేతలపై చాలా ఆరోపణలున్నాయంటూ సున్నితంగా మందలించినట్లు చెప్పుతున్నారు. మేయర్ స్థానాన్ని అప్పగించే అంశంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని సూచించినట్లు తెలిసింది. దీంతో మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు ఇంకో మంత్రి, నేతలు కలిసి ప్రయత్నాలు చేసినా… కేటీఆర్ మందలింపు ధోరణితోనే తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఖర్చు అంశాలు, వారి ఆర్థిక ధైర్యాలను కూడా మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు చెప్పుతున్నారు. కానీ కేటీఆర్ నుంచి మాత్రం వ్యతిరేక సమాధానమే వచ్చిందని చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాల్లోనే తనకే రాజకీయాలంటే ఇష్టం లేదని, ఇప్పుడే రాజకీయాలకు రామంటూ మాట మార్చి బయట ప్రచారం చేసుకుంటున్నారని ఉద్యోగ నేతలు చెప్పుతున్నారు.

Advertisement

Next Story