వినూత్న ‘పీపీఈ కిట్‌’ రూపొందించిన ఝాన్సీ పోలీస్

by vinod kumar |
వినూత్న ‘పీపీఈ కిట్‌’ రూపొందించిన ఝాన్సీ పోలీస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది తప్పకుండా పీపీఈ కిట్లు (కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే దుస్తులు) ధరించాలి. అయితే ఇక వర్షకాలం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా పోలీసులు ఓ సరికొత్త కిట్‌ను రూపొందించారు. కరోనాతోపాటు వాన నుంచి రక్షణ పొందేలా ట్రాన్సపరెంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్‌ను రూపొందించారు. ఇప్పటికే స్థానిక వెండర్‌కు 1000 డ్యుయల్ పర్పస్ పీపీఈ కిట్ల కోసం ఆర్డర్ చేశారు. వివిధ విభాగాల్లో పనిచేసే పోలీస్ ఫోర్స్ లోని 1000 మందికి తొలి విడతగా వీటిని అందించనున్నారు. అడిషనల్ సూపరిడెంటెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీ వాత్సవ వీటిని డిజైన్ చేశారు.

‘పదిహేను రోజుల కింద నాకు డ్యుయల్ పర్పస్ పీపీఈ కిట్ ఐడియా వచ్చింది. దీంతో ప్రయోగం కోసం కొన్ని పీసెస్‌ను తయారు చేశాం. బార్డర్ డ్యూటీ చేస్తున్న పోలీసులు వీటిని వేసుకుని ట్రై చేశారు. వీటి పనితీరు బాగుండటంతోపాటు అనుకున్న రిజల్ట్ ఇవ్వడంతో ఆర్డర్ చేశాం. హాట్ స్పాట్స్, క్వారంటైన్ సెంటర్స్, పోలీస్ రైడ్స్, అరెస్ట్‌లు చేసే సమయంలో పోలీస్ యూనిఫామ్ కనిపించేలా దీన్ని రూపొందించాం. దీని ప్రైస్ రూ. 400 మాత్రమే’ అని శ్రీవాత్సవ తెలిపారు. కరోనా నుంచి రక్షణతో పాటు వర్షాకాలంలో తడవకుండా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed