స్వర్ణకారుల జీవితాల్లో చీకటి నింపిన కరోనా

by Shyam |   ( Updated:2021-05-25 11:33:18.0  )
స్వర్ణకారుల జీవితాల్లో చీకటి నింపిన కరోనా
X

దిశ, తెలంగాణ బ్యూరో : వారికి సీజన్ బట్టే పని… ఆ సీజన్ ముగిస్తే పనే ఉండదు.. ఎప్పుడో ఒకసారి.. అడపాదడపా అతుకులు వేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బుతో మడిగలు, ఇంటి అద్దెలతో పాటు కుటుంబాన్ని పోషించుకోవాలి.. లేకుంటే పస్తులే… అలాంటి వారిపై కరోనా పిడుగు పడింది. పెళ్లిళ్ల సీజన్‌లోనే కరోనా ఉధృతి ఉండటం… ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో వారి జీవన విధానం చిన్నాభిన్నమైంది.. కుటుంబ పోషణ భారమైంది… ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో స్వర్ణకారులు మనోవేధనకు గురవుతున్నారు. ఓవైపు ఉపాధి తగ్గిపోవడం, మరోవైపు మిషనరీతో ఆభరణాలు తయారీ చేసే అవకాశం లేకపోవడంతో కొత్తతరం ఈ వృత్తికి దూరమవుతున్నారు.

స్వర్ణకారులు.. వీరి పేరులో స్వర్ణం ఉన్నా జీవితాల్లో మాత్రం చీకట్లు అలముకుంటున్నాయి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఒకే చోట కూర్చుని సూక్ష్మ వస్తువులతో భలే ఆభరణాలను తయారు చేసేవారు. వివిధ రకాల మోడళ్లలో బంగారం వస్తువులను తయారుచేస్తారు. దీంతో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునే వారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య లక్షలకు పైగా ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నా ఒక్కొక్కసారి కడుపునిండా తిండి తినలేని దుస్థితి. కార్పొరేట్‌ మాయాజాలం, రెడీమేడ్‌ ఆభరణాలు మార్కెట్‌లోకి విరివిగా వస్తుండటంతో స్వర్ణకారుల కొలిమిలో నిప్పు రాజుకోవడం గగనమైపోతుంది. బంగారు ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వస్తువులను మెరుగు పెట్టించుకునేందుకు వీరి వద్దకు వస్తుండటంతో చేతినిండా పనులు లేక పస్తువులు ఉంటున్నారు. కుటుంబ పోషణ, దుకాణాల అద్దెల చెల్లింపులు గగనమైపోతున్నాయి. వృత్తిపరంగానూ వీరు చాలా ఒడుదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రెడిమేడ్‌కు ప్రజల ఆసక్తి..

రెడిమేడ్‌ వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి తరచుగా జ్యువెలరీ దుకాణంలు రావడంతో కుల వృత్తి దారులు కుమిలిపోతున్నారు. తక్కువ ధరకే రెడిమేడ్‌ వస్తువులు వస్తున్నాయనే నెపంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కానీ వాటి నాణ్యతను గుర్తించడం లేదు. దీంతో స్వర్ణకారుల వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇదే అదనుగా భావించి పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్‌ , బెంగుళూరు, ఉత్తరప్రదేశ్‌, మొదలగు రాష్ట్రాల నుండి వర్తకులు వచ్చి వ్యాపారులు రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నారు. దీనికి తోడు పట్టణాలు, నగరాల్లోని రెడీ మేడ్‌ షోరూంలు మిషన్‌లపై తయారుచేసిన విభిన్నమైన డిజైన్స్‌ ప్రవేశపెట్టడం, ఎడాపెడా డిస్కౌంట్స్‌ ఇవ్వడం, పెళ్లిరోజు, పుట్టినరోజు అంటూ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారుల ను ఆకర్షించడంతో స్వర్ణకారుల భవిష్యత్తు అగమ్యగోచరమైంది.

రోజుకు రూ.150 రాని పరిస్థితి..

తులం బంగారం గొలుసు చేయాలంటే లాక్ డౌన్ కు ముందు రెండురోజులకు పైగా సమయం పట్టేది. పాలిష్, మిషన్ వర్కు, డై వర్కు చేసి మూడోరోజు వినియోగదారుడికి ఇచ్చేవారు. రోజుకు రూ.500 గిట్టుబాటు అయ్యేది. అయితే లాక్ డౌన్ తో రోజూ 3 గంటలే పనిచేస్తుండటంతో వారం రోజులు పడుతుందని దీంతో రూ.150 కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి. దీంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్ధం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కష్టమర్లు రాక నిలిచింది. మడిగెల అద్దెలు, ఇళ్ల కిరాయిలు, కుటుంబ పోషణ భారంగా మారిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని స్వర్ణకారులు వేడుకుంటున్నారు.

12 మంది ఆత్మహత్య..

చిన్న, చిన్న ఆభరణాలతో పాటు స్వర్ణకారుల హక్కుగా ఉన్న పుస్తె, మట్టెల్ని సైతం చేసుకోలేని పరిస్థితి స్వర్ణకారుడికి ఏర్పడింది. 2020 డిసెంబర్, 2021 జనవరిలో 12 మంది స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఖమ్మం, కోదాడ, జగిత్యాల, ఆర్మూర్,ఓదాల, ఆలేరు, పెద్దపల్లి, దుబ్బాక, హుజురాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నవారే. కుల వృత్తిని వదలుకోలేక, కొత్త మార్గం పట్టలేక లక్షలాది మంది జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ వృత్తిలో కష్టాల కారణంగా తర్వాతి తరాలు వేరే పనులవైపు ఆసక్తి చూపుతున్నారు. మరో వైపు 1963వ దశకంలో స్వర్ణ నియంత్రణ చట్టం (గోల్డ్‌ కంట్రోల్‌ యాక్ట్‌) ఎన్నో స్వర్ణకారుల కుటుంబాల్ని అగాధంలోకి నెట్టి, మరెందరినో వారి వృత్తికి దూరం చేసింది.

కార్మికులుగా గుర్తింపు కరువు..

కొన్ని వందల ఏళ్ల నుంచి స్వర్ణకారులు వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండి స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. అయితే కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ కల్పించే సదుపాయాలు అందజేయాలని పలుమార్లు మంత్రులకు వినతులు ఇచ్చారు. దీక్షలు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

లాక్‌డౌన్ కష్టాలు..

కోవిడ్‌‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించి 4 గంటలు వెసులుబాటు కల్పించింది. భవన నిర్మాణం, ఈకామర్స్, ఫుడ్ డెలివరీ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు అనుమతి నచ్చింది. కానీ స్వర్ణకారులకు అనుమతి ఇవ్వలేదు. ఇచ్చిన 4 గంటల్లో మూడు గంటలే. 5 నిమిషాలు ఆలస్యమైన పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కొందరు స్వర్ణకారులు దుకాణం మూసి వేసి లోపల పనులు చేసుకుంటే వారి వాహనాలను సైతం సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఉదహారణకు ఈనెల 24న భువనగిరిలో స్వర్ణకారుడు పెళ్లికి సంబంధించిన పుస్తె మెట్టెలను తీసుకొని వెళ్తుంటే పోలీసులు కేసు నమోదు చేసి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. హైదరాబాద్ లోని గోలిగూడలో దుకాణం మూసివేత 5 నిమిషాలు ఆలస్యమైనందుకు వెయ్యిరూపాయల జరిమాన వేసారు. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరి ఖనిలో దుకాణం ముందు వాహనాలు పెట్టి షాపు మూసివేసి లోన వర్కు చేస్తుంటే వాహనాలు సీజ్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రికవరీ పేరుతో పోలీస్‌ లు వేధింపులు స్వర్ణకారులకు యమపాశంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణకారుల డిమాండ్లు

ప్రతి స్వర్ణకారుడికి పావలా వడ్డీకే రూ.5 లక్షలు రుణ సదుపాయం. ఆత్మహత్య, సహజ మరణం, అప్పుల బాధ, ప్రమాదంలో మృతిచెందితే అతడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. వృద్ధులైన స్వర్ణకారులకు ప్రతి నెల రూ. 2,000 ల పెన్షన్‌ సదుపాయం కల్పించాలి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఆధునికమైన ఆభరణాలు తయారీ మిషనరీలపై పని చేయడానికి, ఉపాధి భృతినిస్తూ శిక్షణ ఇప్పించాలి. సుశిక్షుతులైన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలోనే జువెలరీ పార్కులు ప్రతి జిల్లా కేంద్రాల్లో నెలకొల్పాలి. స్వర్ణకారులనే అధికారులుగా డైరెక్టర్లుగా నియమించాలి. పుస్తెలు, మట్టెలు, ప్రధానపు ఉంగరాలు, లక్ష్మి రూపులు జువెలరీ షాపుల్లో రెడీమేడ్‌గా అమ్మడాన్ని నిషేధించాలి. జీఓఎమ్‌ఎస్‌ నెం. 272(హోమ్‌ డిపార్టుమెంటు)ను పటిష్టంగా అమలు చేసి అందులో గల లోపాలను సవరించి స్వర్ణకారులపై జరుగుతున్న పోలీస్‌ వేధింపులు అరికట్టాలి. తమిళనాడులోని విధంగా రాష్ట్రంలో ‘స్వర్ణకారుల వెల్ఫేర్‌ బోర్డు’ఏర్పాటు చేయాలి.

స్వర్ణకారుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

వృత్తినే నమ్మొకొని జీవిస్తున్నాం. ప్రభుత్వం ఎలాంటి ఆర్ధికసాయం అందజేయడం లేదు. కరోనాతో గతేడాది నుంచి పనులు లేక పస్తులుండే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా స్వర్ణకారుల వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. స్వర్ణకారులందరికీ రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలి. -కీసరి శ్రీకాంత్ చారి, ఆల్ ఇండియా స్వర్ణకారసంఘం సీసీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సెక్రటరీ

పావలా వడ్డీ రుణాలివ్వాలి

పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ఆదాయ వనరులు లేవు. పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. స్వర్ణకారులకు యంత్రాలపై ఆభరణాలు తయారు చేసేందుకు శిక్షణ ఇవ్వాలి. పుస్తెలు, మట్టెలు, ప్రధానపు ఉంగరాలు, లక్ష్మి రూపులు జువెలరీ షాపుల్లో రెడీమేడ్‌గా అమ్మడాన్ని నిషేధించాలి. -మారుపాక సంతోష్ చారి, గోలిగూడ స్వర్ణకార సొసైటీ అధ్యక్షుడు

రోజుకు 150 కూడా వస్తల్లేవ్

లాక్ డౌన్ తో అందరికి నాలుగు గంటలు వెసులుబాటు కల్పించినా మాకు మాత్రం 3 గంటలే. ఆ మూడు గంటల్లో ఒక్క ఆభరణం కూడా తయారు చేయలేక పోతున్నాం. ఇతర ప్రాంతాల నుంచి గిరాకీ వచ్చేది అదికూడా రావడం లేదు. రోజుకు 150 రూపాయలు కూడా వస్తల్లేవ్. మడిగ అద్దెలు, ఇంటి అద్దెలతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. -జగన్, స్వర్ణకారుడు

వెసులుబాటు కల్పించాలి

స్వర్ణకారులను కార్మికులుగా గుర్తించాలి. భవన నిర్మాణ కార్మికులు లాగా మమ్మల్ని గుర్తించి లాక్ డౌన్ నుంచి మినహాయించాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనందుకు వెయి రూపాయల జరిమానా విధించారు. అసలే మాకు గిరాకీ లేదు. ఇళ్లు గడవడం కష్టమైంది. ఈ సమయంలో జరిమానాలు వేస్తే ఎలా కట్టాలి. ప్రభుత్వమే మమ్ముల్ని ఆదుకోవాలి. -ప్రదీప్, స్వర్ణకారుడు

Advertisement

Next Story

Most Viewed