జెట్ ఎయిర్‌వేర్ దివాలా ప్రతిపాదనపై ఉద్యోగుల అసంతృప్తి!

by Harish |
Jet Airways
X

దిశ, వెబ్‌డెస్క్: జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు కొన్ని షరతులకు లోబడి కన్సార్షియం పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా టైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గత నెల 22న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే, కల్‌రాక్-జలాన్ కన్సార్టియం, జెట్ ఎయిర్‌వేర్ దివాలా తీర్మాన ప్రక్రియ ఇంకా సుఖాంతం కాలేదని తెలుస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, కార్మికులకు ఈ సంస్థను కొనుగోలు చేస్తున్న కల్‌రాక్-జలాన్ కన్సార్షియం కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోరిన దానికి, ఇస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉందని వారు భావిస్తున్నారు. ఉద్యోగులు వేసిన దావా ప్రకారం రూ. 1,265 కోట్లు ఉండగా, కన్సార్టియంలో భాగంగా వారికి రూ. 52 కోట్లు మాత్రమే కల్‌రాక్-జలాన్ ప్రతిపాదించింది.

ఉద్యోగుల చెప్పిన దాని ప్రకారం.. విమానయాన సంస్థ ప్రతీ ఉద్యోగికి కనీసం రూ. 3 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకూ బాకీ పడుతోంది. అయితే, ఇప్పుడు కొనుగోలు చేస్తున్న సంస్థ ప్రతీ ఉద్యోగికి మొత్తం రూ. 23 వేలు మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇంత భారీ వ్యత్యాసమేంటని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన పరిష్కార ప్రణాళిక కింద ఫోన్‌, ఐప్యాడ్‌, లాప్‌టాప్‌ వీటిలో ఏదో ఒకదానితో పాటు నగదు చెల్లింపులు చేస్తామని కల్‌రాక్-జలాన్ అంటోంది. ఈ ప్రోత్సాహకాలు అందుకోడానికి జలాన్‌ కల్రాక్‌ ప్రతిపాదనను కనీసం 95 శాతం మంది సిబ్బంది ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో ఆమోద ముద్ర లభించడం కష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నగదు చెల్లింపులన్నీ ఆకస్మిక నిధి(రూ. 8 కోట్ల) నుంచి ఇవ్వనున్నారు. కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో అవసరమైతే అదనపు మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇదే సమయంలో పరిష్కార ప్రణాళికపై చట్టబద్ధంగా ముందుకెళ్లాలా లేకుంటే ‘అత్యంత తక్కువ’ ఉపశమనంతో సరిపెట్టుకోవాలా అనేదానిపై ఉద్యోగులు గందరగోళంలో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed