బద్వేలు ఉపఎన్నికపై జనసేన కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2021-10-09 02:38:41.0  )
బద్వేలు ఉపఎన్నికపై జనసేన కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు ఉపఎన్నిక రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు టికెట్ ఇవ్వడంతో జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని సూచిస్తూ టీడీపీ పోటీ నుంచి నిష్క్రమించింది. జనసేన, టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందనుకున్న తరుణంలో బీజేపీ తామున్నామంటూ బరిలోకి దిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అనే నినాదంతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ నామినేషన్ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంపై బీజేపీ దృష్టి సారించింది.

బీజేపీ ఎన్నికల బరిలో ఉండటంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పొత్తు ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ బద్వేలు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తమ క్యాడర్ సహకరిస్తోందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శనివారం బద్వేలు ఉపఎన్నికపై స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే వారిని గౌరవించి పోటీలో ఉండకూడదని జనసేన పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో మాత్రం చనిపోయిన ఎంపీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదని గుర్తు చేశారు.

బీజేపీ తన పార్టీ పాలసీ ప్రకారం బద్వేల్‌లో పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీతో జనసేన కలిసే ఉందని బద్వేలు ఉఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. రాష్ట్రంలో జనసేనకు బీజేపీతో పొత్తు ఉన్నందున, బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. అయితే ఈ ఉపఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందా లేదా అనేదానిపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామని ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి బీజేపీ అభ్యర్థనను స్వాగతించి పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటనలో పాల్గొంటారా లేక సైలెంట్‌గా ఉంటారా అనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం.

35 నామినేషన్ల దాఖలు..

బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు 35 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు. ఇందులో కొన్ని డబుల్, త్రిబుల్ నామినేషన్లు ఉన్నాయని వీటి వివరాలు ఎలక్షన్ కమిషన్‌కు పంపుతామని స్పష్టం చేశారు. 11వ తేదీన స్క్రూటినీ చేస్తామని.. 13న ఉప సంహరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఆరోజు 3గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇకపోతే నవబర్ 30వ తేదీనా పోలింగ్ జరుగుతుందని.. ఎన్నికల నిర్వహణకు 281 పోలింగ్ కేంద్రాలతో పాటు మరో 9 అడిషనల్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు కేతన్ గార్గ్ వెల్లడించారు.

Advertisement

Next Story